హైదరాబాద్ లో కొత్త గ్రోత్ హబ్ గా వేగంగా అభివృద్ధి చెందుతున్న బుద్వేల్ లో భూముల ధరలు భారీగా పెరిగాయి. హెచ్ఎండీఏ తాజాగా నిర్వహించిన భూముల వేలంలో ఎకరాకు గరిష్టంగా రూ.41.25 కోట్ల ధర లభించింది. మొత్తం 14 ప్లాట్‌లలో ఉన్న 100.01 ఎకరాలకు సుమారు రూ.2,000.20 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా, ఏకంగా రూ.3,625.73 కోట్ల ఆదాయం లభించింది. ఎకరానికి కనీస ధరను రూ.20 కోట్ల చొప్పున నిర్ణయించారు. కానీ గురువారం నిర్వహించిన బిడ్డింగ్‌లో అత్యధికంగా ఎకరానికి రూ.41.25 కోట్ల వరకు ధర పలికింది.
కనిష్టంగా రూ.33.25 కోట్ల ధర లభించింది. అటు ఔటర్ రింగు రోడ్డు, విమానాశ్రయంతోపాటు ఇటు ఐటీ హబ్ లకు సమీపంలో ఉండటంతో పలు రియల్టీ సంస్థలు ఆసక్తి ప్రదర్శించాయి. పైగా బుద్వేల్ లో ఇంటర్నల్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, ఫుట్ పాత్ లు, నీటి సరఫరా తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి హెచ్ఎండీఏ రూ.200 కోట్లు వెచ్చిస్తోంది. ఇవన్నీ కలిసి ఇక్కడ భూముల ధరలు పెరగడానికి కారణమయ్యాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో ఓఆర్‌ఆర్‌ను ఆనుకొని ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఈ వెంచర్‌లో బహుళ వినియోగ భవనాలకు అనుమతులను ఇవ్వనున్నారు.
This website uses cookies.