- 2025-26 నాటికి రూ.45వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని క్రిసిల్ అంచనా
దేశంలోని డేటా సెంటర్లలోకి పెట్టుబడులు వెల్లువెత్తనున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి రూ. 45వేల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది. పెద్ద కంపెనీలు క్లౌడ్ సొల్యూషన్స్ వినియోగించుకోవడం పెరుగుతున్న కొద్దీ డేటా సెంటర్లకు డిమాండ్ పెరుగుతోందని వివరించింది. అలాగే ఓటీటీల వినియోగం కూడా పెరుగుతున్న నేపథ్యంలో డేటా సెంటర్లకు డిమాండ్ ఫెరిగిందని తెలిపింది.
గత అయిదేళ్లలో మొబైల్ డేటా ట్రాఫిక్ వార్షికంగా 45 శాతం మేర వృద్ధి చెందిందని క్రిసిల్ వెల్లడించింది. కొత్తగా ప్రవేశపెట్టిన 5జీ సర్వీసులతో రిటైల్ యూజర్లలో డేటా వినియోగం ఇంకా విస్తరిస్తుందని, తద్వారా ఉత్పత్తయ్యే డేటాను నిల్వ చేసేందుకు డేటా సెంటర్ల అవసరమూ పెరుగుతుందని వివరించింది. ప్రస్తుతం 780 మెగావాట్లుగా ఉన్న భారతీయ డేటా సెంటర్ల స్థాపిత సామర్ధ్యం .. 2026 మార్చి నాటికి 1,700 మెగావాట్ల స్థాయికి చేరగలదని, ఇందుకు రూ. 45వేల కోట్లు అవసరం అవుతాయని పేర్కొంది. కొత్త పెట్టుబడుల్లో దాదాపు మూడో వంతు భాగం ఆర్థిక రాజధాని ముంబైలోను, మిగతావి హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, పుణె వంటి ప్రాంతాల్లో ఉండొచ్చని అంచనా వేసింది.