Categories: TOP STORIES

రిటైల్ లీజింగులో హైదరాబాద్ అదుర్స్

  • 2023 మొదటి తొమ్మిది నెలల్లో 145 శాతం పెరుగుదల
  • ఫ్యాషన్, దుస్తుల రంగానిదే ఆధిపత్యం
  • సీబీఆర్ఈ నివేదికలో వెల్లడి

రిటైల్ లీజింగ్ లో హైదరాబాద్ అదరగొట్టింది. 2023 జనవరి-సెప్టెంబర్ లో ఏకంగా 145 శాతం పెరుగుదల నమోదైంది. 2022 జనవరి-సెప్టెంబర్ లో 0.2 మిలియన్ చదరపు అడుగుల మేర రిటైల్ లీజింగ్ పెరగ్గా.. ఈ ఏడాది అదే కాలంలో అది 0.49 మిలియన్ చదరపు అడుగులు పెరిగినట్టు సీబీఆర్ఈ తాజా నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో జరిగిన రిటైల్ లీజింగ్ లో హైదరాబాద్ 10 శాతం వాటా కలిగి ఉండటం విశేషం. ముఖ్యంగా రిటైల్ లీజింగ్ లో ఫ్యాషన్, దుస్తుల రంగాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో హైదరాబాద్ లో 0.26 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ జరగ్గా.. గతేడాది ఇదే సమయంలో 0.09 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ జరిగింది. అంటే అప్పటితో పోలిస్తే ఇది 189 శాతం ఎక్కువ కావడం గమనార్హం.

రిటైల్ లీజింగ్ కు సంబంధించి రంగాలవారీగా చూస్తే ఈ ఏడాది తొమ్మిది నెలల్లో ఫ్యాషన్, దుస్తుల రంగం వాటా 34 శాతం కాగా.. హోమ్ అండ్ డిపార్ట్ మెంట్ స్టోర్లు 17 శాతం, ఆహారం, పానీయాలు 13 శాతం వాటాతో ఉన్నాయి. ఢిల్లీ, చెన్నై, పుణెలు ఫ్యాషన్, దుస్తుల విభాగంలో లీజింగ్ కార్యకలాపాలకు నాయకత్వం వహించగా.. పుణె, అహ్మదాబాద్, ముంబైలలో హోమ్ అండ్ డిపార్ట్ మెంట్ స్టోర్ లీజింగ్ అధికంగా ఉంది. జనవరి-సెప్టెంబర్ కాలంలో బెంగళూరు అత్యధికంగా 30 శాతం లీజింగ్ వాటా కలిగి ఉండగా.. ఢిల్లీ 19 శాతం, పుణె 12 శాతం, చెన్నై 11 శాతం వాటాతో ఉన్నాయి. ఇక జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం లీజింగ్ 1.84 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఇందులో బెంగళూరు, పుణె సంయుక్త వాటా 59 శాతం. నగరాలవారీగా చూస్తే బెంగళూరు 35 శాతం, పుణె 24 శాతం, హైదరాబాద్ 14 శాతం వాటాలతో ఉన్నాయి. సరఫరా విషయానికి వస్తే.. 58 శాతం వాటాతో పుణె మొదటి స్థానంలో, 19 శాతంతో ఢిల్లో రెండో స్థానంలో ఉన్నాయి.

This website uses cookies.