Categories: LATEST UPDATES

చెత్త ప్లాంటే వినోద కేంద్రం

  • కోపెన్ హెగన్ లోని కోపెన్ హిల్ ప్రత్యేకత ఇదీ

మన నగరంలో ఇంటింటి నుంచీ సేకరించిన వ్యర్థాలను ఓ చోట వేసి కాల్చేస్తుంటారు. ఆ ప్రాంతానికి మనం వెళ్లగలమా? పొరపాటున కూడా అటు వెళ్లడానికి సాహసించలేం. కానీ కోపెన్ హెగెన్ లో వ్యర్థ శుద్ధి ప్లాంట్ నే వినోద కేంద్రంగా మార్చేశారు. అసలు ఆ భారీ భవనాన్ని చూస్తే అది చెత్త ప్లాంటా అని సందేహం కలగక మానదు. 100 మీటర్ల పొడవున్న ఈ ఆర్కిటెక్ట్ అద్భుతం పేరు కోపెన్ హిల్. పూర్తిగా చదునుగా ఉండే నగరంలో మానవ నిర్మిత 100 మీటర్ల ఎత్తైన పర్వతాన్ని రూపొందించారు. ప్రపంచంలోనే ఎత్తైన వాల్ క్లైంబింగ్ ఏర్పాటు చేశారు. భవనం పైన అనేక కార్యకలాపాలతో కూడిన డైనమిక్ కమ్యూనిటీ హబ్ ఉంది.

పైన ఉన్నవారికి తాము ఎనర్జీ ప్లాంట్ పైన ఉన్నట్టు అస్సలు ఊహించలేరు. ఈ భవనం గొప్పదనం ఇంతటితో ఆగదు. పైన ప్రజలు స్కీయింగ్ లేదా హైకింగ్ చేస్తున్నప్పుడు భవనం లోపల పెద్ద ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. నగరం మొత్తం నుంచి వచ్చే వ్యర్థాలను సేకరించి కాల్చివేస్తుంది. కోపెన్ హాగన్ లోని సుమారు 90వేల మంది ఇళ్లకు వేడి, విద్యుత్ రెండింటినీ సరఫరా చేయడానికి తగినంత శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పైగా ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు పొగ గొట్టం నుంచి వెలువడే పొగ విషపూరితం కాదు. అది కేవలం నీటి ఆవిరి మాత్రమే. మొత్తానికి ఓ వ్యర్థ శుద్ధి ప్లాంట్ ను వినోద కేంద్రంగా మార్చి కోపెన్ హాగన్ అధికారులు ఔరా అనిపించేలా చేశారు.

This website uses cookies.