మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ, హర్యానా వంటి రాష్ట్రాల్లో రెరా అంటే అక్కడి బిల్డర్లు భయపడతారు. నిబంధనలకు విరుద్ధంగా ఎంత పెద్ద బిల్డర్ ప్రవర్తించినా.. అక్కడి రెరా ఛైర్మన్లు ముక్కుపిండి జరిమానాను వసూలు చేస్తారు. కానీ, మన తెలంగాణ రాష్ట్రంలో రెరా నిద్రపోతుండటంతో.. ప్రీలాంచ్ ప్రమోటర్లు తెగ రెచ్చిపోతున్నారు. హెచ్ఎండీఏ అనుమతి లేదు.. రెరా పర్మిషన్ లేదు.. అయినా, బయ్యర్ల నుంచి వంద శాతం సొమ్ము వసూలు చేయడానికి తెగబడ్డాడీ బిల్డర్. చదరపు అడుక్కీ రూ.4700కే ఫ్లాట్లను అందజేస్తామని బయ్యర్లను మభ్యపెడుతున్నాడు. కేవలం స్థలం కొనడానికే ఇలా ప్రజల్నుంచి కోట్ల రూపాయల్ని వసూలు చేస్తే.. ఆకాశహర్మ్యాల్ని ఎలా కడతాడనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరి, అతను కడతాడో లేడో.. అనుమతి వస్తుందో లేదో తెలియదు. ఒకవేళ నిర్మాణాన్ని ఆరంభించినా సకాలంలో అందజేస్తాడా? లేకపోతే ఏలియెన్స్ స్పేస్ స్టేషన్ తరహాలో ఏళ్ల తరబడి కడతాడా అన్నది ఆలోచించాలి. కాబట్టి, ఇలాంటి స్కీముల్లో పెట్టుబడి పెట్టేముందు వాస్తవ పరిస్థితుల్ని అంచనా వేసి.. బయ్యర్లు తుది నిర్ణయం తీసుకోవాలి. మీ సొమ్ముకు మీరే పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకంటే, ఇంటి కొనుగోలుదారుల్ని మోసపోకుండా రక్షించాల్సిన టీఎస్ రెరా హ్యాపీగా నిద్రపోతున్నది. ప్రజలంతా మోసపోయిన తర్వాత వాళ్ల వద్దకెళ్లి ఫిర్యాదు చేసినా ఉపయోగముండదు.
రూ.2500 కోట్ల వసూలు?
నార్త్ ఈస్ట్ హ్యాబిటేషన్ అనే ప్రాజెక్టును కూకట్‌పల్లిలోని ఐడీఎల్ చెరువు వద్ద.. సర్వే నెంబర్ 1011లోని.. 19.12 ఎకరాల్లో నిర్మిస్తున్నారట. ఇందులో మొత్తం వచ్చేవి పద్నాలుగు టవర్లు వస్తాయి. అంటే, ఎంతలేదన్నా ఇరవై వేల ఫ్లాట్లు నిర్మించే అవకాశముంది. కానీ, బ్రోచర్‌ని చూస్తే రెండు వేల ఏడు వందల ఎలైట్ కుటుంబాలే నివసిస్తాయని ప్రచారాన్ని నిర్వహిస్తోంది. చదరపు అడుక్కీ 4700 చొప్పున ఒక్కో ఫ్లాటును ఈ సంస్థ విక్రయిస్తోంది. మొదట్లో నిర్మించే రెండు వేల ఏడు వందల ఫ్లాట్లను లెక్కపెడితే.. సుమారు రెండువేల ఐదు వందల కోట్లను ఈ సంస్థ ప్రీలాంచ్‌లో వసూలు చేసేలా ఉందని అర్థమవుతోంది. రెరాను తప్పించుకోవడానికి బిల్డర్లు ఎలాంటి ప్లాన్లు వేస్తున్నారో ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోవాలి. కేవలం రేటు తక్కువనే అంశాన్ని మాత్రమే మీరు చూడకండి. సొమ్ము తీసుకున్నాక అతను అపార్టుమెంట్‌ను కట్టకపోతే మీరేం చేస్తారు. పోలీసులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరిగినా మీ సొమ్ము మీకు వెనక్కి రాదు. అప్పుడు రెరా అధికారులు కూడా మీకు ఎలాంటి సాయం చేయరు. కాబట్టి, ప్రీలాంచుల్లో ఫ్లాట్లను అస్సలు కొనుగోలు చేయకండి.
This website uses cookies.