ప్రీలాంచ్ ప్రమోటర్లపై కన్నెర్ర చేసిన తెలంగాణ రెరా అథారిటీ.. ఆరు సంస్థలకు షోకాజ్ నోటీసుల్ని జారీ చేసింది. ప్రీలాంచుల్లో రారాజు భువనతేజ ఇన్‌ఫ్రా సంస్థ ఉండటం గమనార్హం. రాంచరణ్ తేజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సువర్ణభూమి ఇన్‌ఫ్రా డెవలపర్స్ కి రెరా షోకాజ్ నోటీసునిచ్చింది. ఉస్మాన్ నగర్లో అనుమతి లేకుండా ప్రీలాంచుల్లో ఫ్లాట్లను విక్రయిస్తున్న రాధే గ్రూప్ కు రెరా అథారిటీ నోటిసునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇక్కడ బిలడర్లందరూ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ఓం శ్రీ బిల్డర్స్, టీఎంఆర్ గ్రూపులకు రెరా ఎందుకు షోకాజ్ నోటీసునిచ్చిందో మీరు పరిశీలించారా?
నగరానికి చెందిన ఓం శ్రీ డెవలపర్స్ ఓం శ్రీ సిగ్నెట్ అనే ప్రాజెక్టుకు రెరా నుంచి అనుమతిని తీసుకుంది. ఇందులో మొదటి నాలుగు బ్లాకులకు మాత్రమే రెరా అనుమతి తీసుకుని.. రెరాకు తెలియకుండా.. ఈ బ్లాకును నిర్మించడం ఆరంభించింది. ఈ విషయం రెరా దృష్టికి రాగా.. వెంటనే ఓంశ్రీ డెవలపర్స్‌కు రెరా నోటీసును జారీ చేసింది. ఈ క్రమంలో బిల్డర్లు జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా ఫేజులవారీగా నిర్మాణాల్ని చేపట్టే డెవలపర్లు.. ప్రతి బ్లాకును రెరా వద్ద నమోదు చేయించాకే అమ్మకాల్ని చేపట్టాలి. ఇలాంటి అంశాలపై కూడా రెరా దృష్టి సారిస్తుందనే విషయాన్ని గుర్తించాలి.
టీఎస్ రెరా ఛైర్మన్‌గా డా. ఎన్ సత్యనారాయణ నియామకం కాక ముందు.. రాష్ట్రంలోని రెరా అథారిటీ అనేక ప్రీలాంచ్ సంస్థలకు నోటీసుల్ని జారీ చేసింది. కాకపోతే, ఆ నోటీసులకు సంబంధించిన ఎలాంటి పురోగతి ఆతర్వాత కనిపించలేదు. చౌటుప్పల్‌లో 200 ఎకరాలకు అనుమతి తీసుకుని 1200 ఎకరాలంటూ ప్రచారం చేసిన జీ స్క్వేర్ అనే రియల్ సంస్థకు రెరా అథారిటీకి ఇదివరకే నోటీసునిచ్చింది. కాకపోతే, దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియదు. సాహితీ గ్రూప్, జయా గ్రూప్, ఆర్‌జే గ్రూప్, ఫార్చ్యూన్ 99 హోమ్స్, జీఎస్సార్ గ్రూప్ వంటి పలు రియల్ సంస్థలకు గతంలో ఇచ్చిన నోటీసుల విషయంలో ఎలాంటి చర్యల్ని తీసుకున్నారనే అంశాన్ని టీఎస్ రెరా వెల్లడించాల్సిన అవసరముంది.
తెలంగాణ రాష్ట్రంలో కొందరు ప్రమోటర్లకు నేటికీ రెరా అథారిటీ అంటే పెద్దగా భయం లేదనే చెప్పాలి. అందుకే, ఎప్పటిలాగే ప్రీలాంచుల్లో ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయిస్తున్నాయి. ఈ ప్రీలాంచ్ జాడ్యం రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాలకూ విస్తరించడం విచారించాల్సిన విషయం. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి వంటి జిల్లాల్లోనూ పలువురు ప్రమోటర్లు ప్రీలాంచుల్లో ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. సంగారెడ్డి, సదాశివపేట్ వంటి ప్రాంతాల్లో కొందరు రియల్టర్లు కొనుగోలుదారుల నుంచి సొమ్ము తీసుకుని.. రెండు, మూడేళ్లు గడుస్తున్నా నేటికీ ప్లాట్లను అందించడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఈ ప్రాంతాల్లో ప్లాట్ల మీద పెట్టుబడి పెట్టిన అనేకమంది కొనుగోలుదారులు భయాందోళనలో ఉన్నారు. ఉన్న సొమ్మంతా ప్రమోటర్లకి ఇవ్వడంతో.. బయటికొచ్చి ఎవరికైనా చెబితే.. ఆ సొమ్ము కూడా రాదనే ఆందోళనలో ఉండటం గమనార్హం. కాబట్టి, రెరా ఛైర్మన్ ఇలాంటి కేసుల పట్ల దృష్టి సారించి పరిష్కరించే ప్రయత్నం చేయాలి.
This website uses cookies.