- మొత్తం లీజింగ్ లో బెంగళూరుతో కలిపి 60 శాతం వాటా
- జేఎల్ఎల్ నివేదిక వెల్లడి
దేశంలో రిటైల్ లీజింగ్ జోరుగా సాగుతోంది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో రిటైల్ రంగంలో లీజింగ్ కార్యకలాపాలు 3.1 మిలియన్ చదరపు అడుగుల మేర నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను జేఎల్ఎల్ వెల్లడించింది. 2025 మొదటి మూడు నెలల్లో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో జనవరి-మార్చి మధ్య షాపింగ్ మాల్స్, హై స్ట్రీట్లలో దాదాపు 3.1 మిలియన్ చదరపు అడుగుల రిటైల్ స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. మొత్తం రిటైల్ లీజింగ్ లో బెంగళూరు, హైదరాబాద్ కలిసి 60 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
బెంగళూరు, హైదరాబాద్‌లోని ప్రముఖ హై స్ట్రీట్‌లలో రోజువారీ అవసరాలు, కిరాణా, ఆహారం, పానీయాలు, ఫ్యాషన్, దుస్తులు వంటి రిటైలర్ వర్గాల నుంచి పెద్ద స్టోర్ సైజు అవసరాలతో సబర్బన్ మైక్రో-మార్కెట్లలో లీజింగ్ జరిగినట్టు నివేదిక తెలిపింది. రిటైలర్ వర్గాలలో ఫ్యాషన్, దుస్తులు భారతదేశ రిటైల్ ల్యాండ్‌స్కేప్‌లో ముందంజలో ఉన్నాయి. మొత్తం లీజింగ్ లో ఇవి 31% వాటాను కలిగి ఉన్నాయి. దీని తర్వాత 21 శాతం వాటాతో ఫుడ్ అండ్ బేవరేజెస్ ఉండగా.. ఎంటర్ టైన్ మెంట్ వాటా 16 శాతంగా నమోదైంది. సరఫరా విషయానికి వస్తే.. 2025 మొదటి త్రైమాసికంలో 2 మిలియన్ చదరపు అడుగుల కొత్త రిటైల్ స్థలాలు పెరిగాయి. ఇది 2024 మొదటి త్రైమాసికంతో పోలిస్తే 169 శాతం అధికం.
ALSO READ: ముంబైలో బాలీవుడ్ రియల్ షో
ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లో కొత్త రిటైల్ స్టోర్ ఓపెనింగ్‌లలో బలమైన ఊపు కొనసాగింది. త్రైమాసిక ప్రాతిపదికన రిటైల్ రంగంలో స్థూల లీజింగ్ కార్యకలాపాలు 2024 మొదటి త్రైమాసికంలో 2.35 నుంచి 9 శాతానికి పెరిగాయి. 2025 మొదటి త్రైమాసికంలో 2 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐదు కొత్త షాపింగ్ మాల్స్ అందుబాటులోకి వచ్చినట్టు నివేదిక తెలిపింది. ఈ త్రైమాసికంలో కొత్త రిటైల్ సరఫరా ఇప్పటికే 2024 కేలండర్ సంవత్సరం మొత్తం వార్షిక సరఫరాను అధిగమించడం విశేషమని పేర్కొంది. మూడు గ్రేడ్ ఏ మాల్స్ జోడించడం ద్వారా 68 శాతం వాటాతో ముంబై అగ్రస్థానంలో ఉండగా.. హైదరాబాద్, ఢిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
కొత్త సరఫరాతో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో వ్యవస్థీకృత రిటైల్ స్టాక్ 2025 మొదటి త్రైమాసికం చివరి నాటికి 88.5 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. “రాబోయే మూడు త్రైమాసికాలలో (ఏప్రిల్-డిసెంబర్ 2025) 7 మిలియన్ చదరపు అడుగుల కొత్త గ్రేడ్ ఏ సరఫరా వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2025 సంవత్సరం చివరి నాటికి ఈ రంగంలో స్థూల లీజింగ్ 10 మిలియన్ చదరపు అడుగుల మార్కును సులభంగా తాకుతుందని భావిస్తున్నారు’ అని నివేదిక పేర్కొంది.