సీనియర్ సిటిజన్ కు ఊరటనిచ్చిన కర్ణాటక రెరా ట్రిబ్యునల్
విల్లా కొనుగోలు చేసి.. దానిని స్వాధీనం చేసుకోవడానికి పుష్కర కాలంపాటు వేచి చూసిన ఓ సీనియర్ సిటిజన్ కు ఎట్టకేలకు ఊరల లభించింది. కర్ణాటక రెరా ఇచ్చిన ఉత్తర్వులను తోసిపుచ్చి కొనుగోలుదారుకు విల్లాను నెల రోజుల్లోపు స్వాధీనం చేయాలని కర్ణాటక రెరా ట్రిబ్యునల్ ఆదేశించింది. అలాగే విల్లా అప్పగించడంలో జాప్యం చేసినందుకు ఐదేళ్లపాటు ఏడాదికి 9 శాతం వడ్డీ చెల్లించాలని సూచించింది.
కర్ణాటకకు చెందిన దేవకీ నందన్ అనే సీనియర్ సిటిజన్ 2012 సెప్టెంబర్ 6న విల్లా కొనుగోలుకు డెవలపర్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం రూ.3.2 కోట్లు చెల్లించారు. 2013 డిసెంబర్ నాటికి స్వాధీనం చేస్తానని డెవలపర్ హామీ ఇచ్చారు. అయితే, 2014 జనవరి వచ్చినా డెవలపర్ ఆ విల్లాను స్వాధీనం చేయడంలో విఫలమయ్యారు. 2014 నుంచి 2019 వరకు ఎన్నిసార్లు అడిగినా డెవలపర్ నుంచి సరైన స్పందన లేకపోవడంతో నందన్ రెరాను ఆశ్రయించారు.
ALSO READ: రిటైల్ లీజింగ్ లో భాగ్యనగరం భళా
అయితే, 2016లో రెరా చట్టం అమలుకు ముందు ఈ ప్రాజెక్టు పాక్షిక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందిందని పేర్కొంటూ ఈ కేసును 2023 మే నెలలో కొట్టివేసింది. ఈ నేపథ్యంలో కొనుగోలుదారు కర్ణాటక రెరా ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. రెరా చట్టం అమల్లోకి వచ్చినప్పుడు అభివృద్ధి పనులు ఇంకా అసంపూర్తిగా ఉన్నాయని, అవసరమైన ఆమోదాలు లేవని నందన్ వాదించారు. వాస్తవానికి, ప్రాజెక్టులో మూడింట రెండు వంతులు మాత్రమే పూర్తయ్యాయని డెవలపర్ కూడా అంగీకరించారు.
* వాదనలు విన్న ట్రిబ్యునల్.. కొనుగోలుదారుతో ఏకీభవించింది. లగ్జరీ విల్లాను నెల రోజులలోపు స్వాధీనం చేయాలని డెవలపర్ ను ఆదేశించింది. అంతేకాకుండా కర్ణాటక యాజమాన్య ఫ్లాట్ల (నియంత్రణ, అమ్మకం, నిర్వహణ మరియు బదిలీ) చట్టం, 1972లోని సెక్షన్ 8 ప్రకారం, ఏప్రిల్ 2017 వరకు ప్రతి నెల ఆలస్యానికి సంవత్సరానికి 9% చొప్పున జాప్య వడ్డీని చెల్లించాలని స్పష్టం చేసింది.