(కింగ్ జాన్సన్ కొయ్యడ)
జీసీసీ (గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్) లను ఆకర్షించడంలో హైదరాబాద్ క్రమక్రమంగా బెంగళూరును అధిగమిస్తోందని సిరిల్ సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడించింది. 2023 ప్రథమార్థంలో బెంగళూరుతో పోల్చితే అధిక జీసీసీలను ఆకర్షించడమే ఇందుకు ప్రధాన కారణం. అసలు జీసీసీలంటే ఏమిటి? ఇవి ఎప్పుడు మన దేశంలోకి అడుగుపెట్టాయి? వీటి వల్ల హైదరాబాద్‌కు ఒనగూడే ప్రయోజనమేమిటి? వీటి రాకతో రియల్ రంగానికి కలిగే లాభమేమిటి?
జీసీసీ అనగా ఇదో ఆఫ్‌షోర్ సెంటర్ అని చెప్పొచ్చు. అంటే, విదేశీ సంస్థలు తమ కార్యకలాపాల్ని నిర్వహించడానికి హైదరాబాద్‌లో కార్యాలయాల్ని ఏర్పాటు చేయడం అన్నమాట. వీటిని ప్రపంచస్థాయి సంస్థలుగా అభివర్ణించొచ్చు. విదేశీ సంస్థలకు సంబంధించిన ఐటీ సేవలు, పరిశోధన, అభివృద్ధి, కస్టమర్ సపోర్టు వంటి కార్యకలాపాల్ని భాగ్యనగరం నుంచి నిర్వహిస్తారు. ఉదాహరణకు, అమెరికాకు చెందిన ఒక సంస్థకు సంబంధించిన కార్యకలాపాల్ని హైదరాబాద్ నుంచి నిర్వహించడమే జీసీసీలని చెప్పొచ్చు. ఇవి మనదేశంలోకి ఇప్పుడిప్పుడే కొత్తగా రావట్లేదు. 1980లోనే ఆరంభమయ్యాయి. 1990 నుంచి విస్తృతమయ్యాయి. జనరల్ ఎలక్ట్రిక్, సిటీ గ్రూప్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటివి ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఇవి భారత ఐటీ మరియు వ్యాపార సేవల పరిశ్రమకు వెన్నెముక్క వంటివి. గత దశాబ్దం నుంచి వీటి సేవలకు సంబంధించి వినూత్న ఆవిష్కరణలు చోటు చేసుకున్నాయి.
ప్రపంచంలో గల జీసీసీల్లో యాభై శాతం వాటా భారతదేశానిదే కావడం గమనార్హం. ఇప్పటివరకూ సుమారు 1580 సంస్థలుండగా వీటి సంఖ్య పెరుగుతోంది. 2025 నాటికి ఈ సంఖ్య 1900కు చేరుకుని.. 2030 నాటికి 2400కు చేరుకుంటాయని సిరిల్ సంస్థ అంచనా వేస్తోంది. వచ్చే ఐదేళ్లలో వీటి విలువ సుమారు 60-85 అమెరికన్ బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశముంది. అంటే, అప్పటికీ ప్రపంచంలోని 500 ఫార్చ్యూన్ సంస్థలు మనదేశంలోనే ఉంటాయని గుర్తుంచుకోండి.
* సరికొత్త ఆవిష్కరణల కారణంగా 2012 నుంచి 2023 దాకా మనదేశంలో జీసీసీల సంఖ్య అధికమైంది. వీటిలో ప్రస్తుతం 19 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ సంఖ్య 45 లక్షలకు చేరుకునే అవకాశముంది. 2018 నుంచి 2023 దాకా ఈ రంగంలో 12.1 శాతం వృద్ధి నమోదైంది. 2023 నుంచి 2030 దాకా సుమారు 14 శాతం వృద్ధి చోటు చేసుకునేందుకు ఆస్కారముందని అంచనా.
మనదేశంలోని ఆరు నగరాలు జీసీసీల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయి. బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్, ఢిల్లీ, గురుగ్రామ్, హైదరాబాద్, పుణె వంటివి ప్రధానమైనవి. మౌలిక సదుపాయాలు, ట్యాలెంట్ పూల్, సపోర్టింగ్ ఎకో సిస్టమ్ వంటివి ఉండటంతో వీటి ఏర్పాటు సులభంగా మారింది. జీసీసీలు దాదాపు 203 మిలియన్ చదరపు అడుగుల స్థలంలో ఏర్పాటు కాగా.. వీటిలో 55 శాతం వాటా బెంగళూరు, హైదరాబాద్‌ది కావడం గమనార్హం. దేశంలోని ద్వితీయ శ్రేణీ పట్టణాల్లోనూ అడుగుపెట్టేందుకు ఈ సంస్థలు ముందంజలో ఉన్నాయి. విశాఖపట్నం, జైపూర్, వడోదర, కొచ్చి, భువనేశ్వర్, చంఢిఘడ్ వంటివి ఆకర్షిస్తున్నాయి. అంతెందుకు, రానున్న రోజుల్లో తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూరు వంటివి జీసీసీ హబ్‌గా అవతరించే అవకాశాలున్నాయి.
భాగ్యనగరంలో చదువుకున్న యువతకు కొదవ లేదు. మౌలిక సదుపాయాలు మెరుగ్గా అభివృద్ధి చెందుతున్నాయి. ఐఎస్‌బీ, ట్రిపుల్ ఐటీ, బిట్స్ పిలానీ వంటి పలు అంతర్జాతీయ విద్యాసంస్థలు ఉండటం హైదరాబాద్‌కు కలిసొచ్చే అంశం. హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువ ఐటీ ఉద్యోగులు వివిధ సంస్థల్లో పని చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఏటా లక్ష మంది ఇంజినీర్లు చదువును పూర్తి చేసుకుంటున్నారు. వీరిలో సగం మంది ఇతర మెట్రో నగరాల్లో సైతం ఉద్యోగం చేస్తున్నారు.
గోల్డ్‌మాన్ సాచ్చ్, లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్, అమెరికన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, స్టేట్ స్ట్రీట్, ఫెడెక్స్, అపోలో టైర్స్ వంటివి 2023 ప్రథమార్థంలో హైదరాబాద్‌లోకి అడుగుపెట్టాయి.
ఐదు వందల ఉద్యగులతో ఆరంభమైన ఊబర్ సంస్థ రెండువేలకు సామర్థ్యాన్ని పెంచుతోంది. జర్మనీకి చెందిన జెడ్ఎఫ్ హైదరాబాద్‌లో ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేస్తోంది. మైక్రాన్ సంస్థ ప్రధాన కార్యాలయం తర్వాత హైదరాబాద్‌లోనే అతిపెద్ద కేంద్రాన్ని ఆరంభించింది. మొత్తానికి హైదరాబాద్‌లో జీసీసీల సంఖ్య పెరుగుతుండటంతో లగ్జరీ ఇళ్లకు గిరాకీ గణనీయంగా పెరుగుతుంది. వీటికి కోకాపేట్ ప్రధాన లొకేషన్‌గా మారుతుంది. ఫలితంగా, ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లోని అపార్టుమెంట్లను అపూర్వ ఆదరణ లభిస్తుంది. – ప్రశాంత్ రావు, డైరెక్టర్, పౌలోమీ ఎస్టేట్స్
This website uses cookies.