హైదరాబాద్ మెట్రో రైల్ కు 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.1745.85 కోట్ల నష్టం వాటిల్లింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది కాస్త తక్కువ. ఎల్ అండ్ టీ సంస్థ నిర్వహిస్తున్న మెట్రో రైల్ కు 2020-21లో రూ.1766.75 కోట్ల నష్టం వచ్చింది. టికెట్లు, టికెట్లేతర అంశాలు, ఇతరత్రా అంశాల ద్వారా 2021-22లో రూ.357.15 కోట్ల ఆదాయం రాగా, అంతకుముందు సంవత్సరం ఇది రూ.227.95 కోట్లుగా నమోదైంది.
కరోనా కారణంగా ప్రభుత్వం విధించిన ఆంక్షల వల్ల ఆదాయం బాగా ప్రభావితమైందని కంపెనీ తన నివేదికలో పేర్కొంది. ప్రయాణికుల సంఖ్య తగ్గడం.. కంపెనీ నిర్వహిస్తున్న మాల్స్ కు కూడా తగినంత ఆదాయం లేకపోవడం వంటి పరిస్థితులతో భారీ నష్టాలు వచ్చాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవడంపై మరింత దృష్టి సారించనున్నట్టు వెల్లడించింది. అలాగే ప్రయాణ సమయం తగ్గించడం కోసం మెట్రో రైల్ అన్ని కారిడార్లలో రైలు వేగాన్ని గంటలకు 70 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్లు చేయడానికి మెట్రో రైల్ సేఫ్టీ కమిషనర్ అనుమతి ఇచ్చినట్టు తెలిపింది.
ఒకవైపు ప్రయాణీకుల సంఖ్య తగ్గింది..షాపింగ్ మాళ్లకు ప్రజలు రావట్లేదు.. మరి, వీరి సంఖ్యను పెరగాలంటే ఏం చేయాలి? కేవలం మెట్రో రైళ్లలో ప్రయాణించే వారినే కాకుండా అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే వారిని మెట్రో మాళ్లు ఎందుకు ా ఆకర్షించట్లేదు? ప్రజలకు కావాల్సిన రకరకాల వస్తువులు దొరక్కపోవడమే ప్రధాన కారణమని చెప్పొచ్చు. మరి, విభిన్నమైన వస్తువులు దొరకాలంటే ఏం చేయాలి? మెట్రో స్టేషన్లలో ఔట్ లెట్ల నెలసరి అద్దెలను గణనీయంగా తగ్గించాలి. అప్పుడే మియాపూర్, జేఎన్టీయూ, అమీర్ పేట్, పంజాగుట్ట, ఎల్ బీ నగర్, కూకట్ పల్లి తదితర మెట్రో స్టేషన్లో అవుట్ లెట్ల సంఖ్య పెరుగుతుంది.
This website uses cookies.