- ఇంతింత రేటు పెట్టాక..
- బయ్యర్లు కొనమంటే కొంటారా?
- పదేళ్లలో జూబ్లీహిల్స్‌లో మార్పేం వచ్చింది?
- ట్రాఫిక్, పబ్బులు పెరగడం తప్ప!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బంజారాహిల్స్‌లో గజం ధర రూ. లక్ష పలికితే ప్రస్తుత సీఎం కేసీఆర్ అప్పట్లో ఘాటుగా విమర్శించారు. గజం లక్ష ఏమిటంటూ అప్పటి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కానీ, ఇప్పుడేమో జూబ్లీహిల్స్‌లో గజం ధర రూ.3 లక్షలంటూ కొందరు ప్లాట్లను విక్రయిస్తున్నారు. గత పదేళ్ల కాలంలో ప్లాట్ల ధరలు ఇంతగా పెరుగుతాయని ఎవరూ ఊహించలేదు. జూబ్లీహిల్స్ లో వెయ్యి గజాల ప్లాటు కొనాలంటేనే సుమారు రూ.30 కోట్లు పెట్టాల్సి వస్తోందన్నమాట. నటుడు మోహన్ బాబు ఇంటి చేరువలో అమ్మకానికి ఉన్న ఒక ప్లాటు రేటు రూ.3 లక్షలని చెబుతున్నారు.
బంజారాహిల్స్‌లో కొన్ని ప్రాంతాల్లో చదరపు అడుక్కీ రూ.2.50 లక్షల చొప్పున కొందరు ప్లాట్లను అమ్మకానికి పెట్టారు. మరికొన్ని ఏరియాల్లో గజానికి రూ.2.35 లక్షలు అంటున్నారు. ఎమ్మెల్యే కాలనీలో కాస్త లోపలికి గజం రేటు రూ.2.30 లక్షలని చెబుతున్నారు. మాదాపూర్ ప్రధాన రహదారిలో గజం ధర రూ.2.25 లక్షలకు విక్రయించడానికి కొందరు రియల్టర్లు ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి, ఇంతింత రేట్లు పెరగడం.. ఎవరికీ అందుబాటులో లేకపోవడం వల్ల చాలామంది కొనుగోలుదారులు స్థిర నివాసం వైపు పెద్దగా మక్కువ చూపట్లేదు. ఈ కారణంగానే కొందరు వ్యక్తులు ఎన్నికల తర్వాత ప్లాట్లను కొనాలనే నిర్ణయానికి వచ్చారు. మరి, అప్పటివరకూ ఏం చేస్తారంటే.. కిరాయి ఇంట్లో ఉండటానికే మొగ్గు చూపుతున్నారు. ధరలు తగ్గిన తర్వాతనే ప్లాట్లను కొంటామని కొందరు రియల్ ఎస్టేట్ గురుకి తెలిపారు.
ట్రిపుల్ వన్ జీవో పుణ్యమా అంటూ కొందరు రియల్టర్లు ఎకరం ధర రూ.14 కోట్లు చెబుతున్నారు. ఎవరైనా కొనేందుకు సీరియస్‌గా ఉన్నట్లయితే.. రేటు కొంత తగ్గిస్తామని స్థలయజమానులు అంటున్నారు. మోకిలాలో ఎకరాల్లో స్థలం కొనేందుకు ఎవరూ మొగ్గు చూపకపోవడంతో కొందరు స్థలయజమానులు రేటు తక్కువ చేసి విక్రయించడానికి సమాయత్తం అవుతున్నారు. నిన్నటివరకూ రూ.13 కోట్లు పలికిన ఎకరం భూమిని రూ.11 కోట్లకే కొందరు విక్రయిస్తున్నారు. మరి, రానున్న రోజుల్లో రేటు మరెంత తగ్గుతుందేమోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.