Hyderabad Metropolitan Region formed with 10,472 Kms
కొత్తగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ ఏర్పాటు చేస్తున్నామంటూ.. పురపాలక శాఖ తాజాగా విడుదల చేసిన జీవో కొంత అస్పష్టంగా ఉంది. కోర్ హైదరాబాద్‌తో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే ప్రాంతాలన్నీ.. ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త అథారిటీ పరిధిలోకి వస్తాయని జీవోలో పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతమున్న జీహెచ్ఎంసీ పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడున్న జీహెచ్ఎంసీ యధావిధిగా కొనసాగుతుందా? లేక దాన్ని రద్దు చేసి కొత్త మెట్రోపాలిటన్ రీజియన్ కిందికి తెస్తారా? అనే విషయంలో స్పష్టతనివ్వలేదు.
కోర్ హైదరాబాద్‌తో పాటు జీహెచ్ఎంసీలోని కీలక ప్రాంతాలైన అమీర్‌పేట్, ఖైరతాబాద్, ఛార్మినార్, సోమాజిగూడ, నాంపల్లి, ముషీరాబాద్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, మియాపూర్.. వంటి ప్రాంతాల్ని వేరు చేసి.. వాటన్నింటినీ.. గ్రేటర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో పదకొండు జిల్లాల్లోని 104 మండల్లాల్లోని 1355 రెవెన్యూ విలేజీలను కలుపుతూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్‌గా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ జీవోను విడుదల చేశారు. దీంతో హైదరాబాద్ మహానగర పరిధి సుమారు 10, 472 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. పాత హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధితో పాటు సంగారెడ్డి, సిద్దిపేట్, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మెదక్, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లోని ప్రాంతాలతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ రిజీయన్‌గా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పరిధిని విస్తరించారు సరే.. మరి, ఇంత పెద్ద ప్రాంతాన్ని ఎలా నిర్వహిస్తారో.. ఇందుకోసం ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికల్ని ఏర్పాటు చేసిందో అతి త్వరలోనే తేలుతుంది.
కొత్త మెట్రోపాలిటన్ రీజియన్ ఏర్పాటయ్యాక.. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త అపార్టుమెంట్లకు అనుమతుల్ని ఎవరు మంజూరు చేస్తారు? అనే అంశాన్ని జీవోలో పేర్కొని ఉంటే ఎవరికీ ఎలాంటి సందేహాలు వచ్చేవి కాదు. ఇప్పటివరకైతే జీహెచ్ఎంసీ పరిధిలోకి హెచ్ఎండీఏ ఎప్పుడూ ప్రవేశించలేదు. దీన్ని పరిధిలోకి ఎలాంటి అపార్టుమెంట్లు అయినా జీహెచ్ఎంసీయే అనుమతిని మంజూరు చేసేది. ఇప్పుడు కొత్త జీవోలో ప్రత్యేకంగా హైదరాబాద్ పరిధిలోని ఏరియా పేర్లను కూడా చేర్చడంతో.. అనుమతులు ఎవరిస్తారనే సందేహాలు తలెత్తుతున్నాయి. కాబట్టి, ఈ అంశంలో ప్రభుత్వం స్పష్టతనివ్వాల్సిన అవసరముంది.
111 జీవో ప్రాంతాలు..
కొత్త నగరం పరిధిలోకి!
తెలంగాణ ప్రభుత్వం తెలివిగా ఏం చేసిందంటే.. ట్రిపుల్ వన్ జీవో పరిధిలోకి వచ్చే కొన్ని గ్రామాల్నీ కొత్తగా ఏర్పాటు చేసిన హైదరాబాద్ మహానగరం పరిధిలోకి తీసుకొచ్చింది. ఉదాహరణకు మొయినాబాద్ పరిధిలోకి వచ్చే బాకారం, కేతిరెడ్డిపల్లి, అజీజ్‌నగర్, చిలుకూరు, కనకమామిడి.. శంషాబాద్ కిందికొచ్చే చౌదరిగూడ, గంధిగూడ.. ఇలా అనేక ప్రాంతాల్ని కొత్త పరిధిలోకి తెచ్చింది. మరి, 111 జీవో పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో.. కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి అనుమతినిస్తారా? లేక ఇప్పటివరకూ ఉన్న నిషేధాన్ని కొనసాగిస్తారా? అనేది తేలాల్సి ఉంది.
This website uses cookies.