Categories: TOP STORIES

111 జీవో ప్రాంతంలో అపార్టుమెంట్ల‌కు అనుమ‌తినిస్తారా?

* జీహెచ్ఎంసీలో ఇళ్ల‌కు అనుమ‌తులెవ‌రిస్తారు?
* 111 జీవోలో కొత్త క‌ట్ట‌డాల్ని అనుమ‌తినిస్తారా?
* కొత్త రీజియ‌న్ మొత్తానికి మాస్ట‌ర్ ప్లాన్ రూపొందిస్తారా?
* అలాగైతే 1.32 ల‌క్ష‌ల ఎక‌రాల‌ను డెవ‌ల‌ప్ చేస్తారా?

 

కొత్తగా హైద‌రాబాద్ మెట్రోపాలిట‌న్ రీజియ‌న్ ఏర్పాటు చేస్తున్నామంటూ.. పుర‌పాల‌క శాఖ తాజాగా విడుద‌ల చేసిన జీవో కొంత అస్ప‌ష్టంగా ఉంది. కోర్ హైద‌రాబాద్‌తో పాటు జీహెచ్ఎంసీ ప‌రిధిలోకి వ‌చ్చే ప్రాంతాల‌న్నీ.. ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన కొత్త అథారిటీ ప‌రిధిలోకి వ‌స్తాయ‌ని జీవోలో పేర్కొన్నారు. దీంతో ప్ర‌స్తుత‌మున్న జీహెచ్ఎంసీ ప‌రిస్థితి ఏమిట‌నే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. ఇప్పుడున్న జీహెచ్ఎంసీ య‌ధావిధిగా కొన‌సాగుతుందా? లేక దాన్ని ర‌ద్దు చేసి కొత్త మెట్రోపాలిట‌న్ రీజియ‌న్ కిందికి తెస్తారా? అనే విష‌యంలో స్ప‌ష్ట‌త‌నివ్వ‌లేదు. ఎందుకంటే, జీహెచ్ఎంసీ ప‌రిధిలో టౌన్ ప్లానింగ్ అధికారులు.. ఇల్లు, భ‌వ‌నాల‌కు అనుమ‌తినిస్తారు. హెచ్ఎండీఏ ప‌రిధిలోనూ హెచ్ఎండీఏనే అనుమ‌తినిస్తుంది. జీహెచ్ఎంసీ మిన‌హా ఇత‌ర కార్పొరేష‌న్లు అయిన నిజాంపేట్‌, బోడుప్ప‌ల్‌, పీర్జాదిగూడ‌, జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్, బండ్ల‌గూడ‌, బ‌డంగ్‌పేట్‌, మీర్‌పేట్‌- జిల్లెల్‌గూడ వంటి కార్పొరేష‌న్ల‌లో అపార్టుమెంట్ల‌ను క‌ట్టాలంటే హెచ్ఎండీఏనే అనుమ‌తిని మంజూరు చేస్తుంది. మ‌రి, జీహెచ్ఎంసీ ప‌రిధిని హైద‌రాబాద్ మెట్రోపాలిట‌న్ రీజియ‌న్ ప‌రిధిలోకి ప్ర‌భుత్వం తెచ్చిన క్ర‌మంలో.. ఇల్లు, భ‌వ‌నాల‌కు అనుమ‌తుల్ని మంజూరు చేసే అధికారం జీహెచ్ఎంసీకి ఉంటుందా? లేదా హెచ్ఎండీఏకు అప్ప‌గిస్తారా? అనే విష‌యంలో పుర‌పాల‌క శాఖ స్ప‌ష్ట‌త‌నివ్వాలి. జీహెచ్ఎంసీ ప్రాంతాల గురించి కొత్త జీవో గురించి ప్ర‌త్యేకంగా పేర్కొన‌క‌పోతే.. ఎవ‌రికీ ఎలాంటి సందేహం వ‌చ్చేది కాదు. కాక‌పోతే, కోర్ హైద‌రాబాద్‌, జీహెచ్ఎంసీ ప్రాంతాల్ని కొత్త మెట్రోపాలిట‌న్ రీజియ‌న్ ప‌రిధిలోకి తెస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం వ‌ల్లే.. కొత్త సందేహాలు పుట్టుకొస్తున్నాయి. పోనీ, జీవోలో ఇలాంటి విష‌యాల‌పై కాస్త స్ప‌ష్ట‌త ఇచ్చినా.. ఎలాంటి స‌మ‌స్య ఉండేది కాదు.

జీహెచ్ఎంసీ.. కొత్త న‌గ‌రంలోకి!
625 కిలోమీట‌ర్ల విస్తీర్ణం గ‌ల ఎంసీహెచ్ ఏరియాతో పాటు జీహెచ్ఎంసీలోని కీల‌క ప్రాంతాలైన మాదాపూర్‌, మియాపూర్‌, గ‌చ్చిబౌలి, సికింద్రాబాద్‌, ఉప్ప‌ల్‌, కాప్రా, బాలాన‌గ‌ర్‌, కుత్బుల్లాపూర్ త‌దిత‌ర ప్రాంతాల్ని కూడా హైద‌రాబాద్ మెట్రోపాలిట‌న్ రీజియ‌న్ ప‌రిధిలోకి తెస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఈ క్ర‌మంలో ప‌ద‌కొండు జిల్లాల్లోని 104 మండ‌ల్లాల్లోని 1355 రెవెన్యూ విలేజీల‌ను క‌లుపుతూ హైద‌రాబాద్ మెట్రోపాలిట‌న్ రీజియ‌న్‌గా ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఇటీవ‌ల‌ పుర‌పాల‌క శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ దాన‌కిశోర్ జీవోను విడుద‌ల చేశారు. దీంతో హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర ప‌రిధి సుమారు 10,472 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్లకు పెరిగింది. పాత హైద‌రాబాద్‌, జీహెచ్ఎంసీ ప‌రిధితో పాటు సంగారెడ్డి, సిద్దిపేట్‌, వికారాబాద్, యాదాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి, న‌ల్గొండ‌, నాగ‌ర్ క‌ర్నూల్‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, మెద‌క్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ వంటి జిల్లాల్లోని ప్రాంతాలతో హైద‌రాబాద్ మెట్రోపాలిట‌న్ రిజీయ‌న్‌గా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. ప‌రిధిని విస్త‌రించారు స‌రే.. మ‌రి, ఇంత పెద్ద ప్రాంతాన్ని ఎలా నిర్వ‌హిస్తారో.. ఇందుకోసం ప్ర‌భుత్వం ఎలాంటి ప్ర‌ణాళిక‌ల్ని ఏర్పాటు చేసిందో తెలియ‌దు. జీహెచ్ఎంసీ అధికారాల్లో ఎలాంటి మార్పులు చేయ‌క‌పోతే, ఆయా ప్రాంతాల్ని మెట్రోపాలిట‌న్ అథారిటీ ప‌రిధిలోకి చేర్చుతున్న‌ట్ల ప్ర‌త్యేకంగా ప్ర‌క‌టించ‌డం ఎందుక‌నే సందేహం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. ఇందులో ఏదో మ‌త‌ల‌బు ఉంద‌నే ప్ర‌చారం ఊపందుకుంది.

111 జీవో ప్రాంతాలు..
కొత్త న‌గ‌రం ప‌రిధిలోకి!
తెలంగాణ ప్ర‌భుత్వం తెలివిగా ఏం చేసిందంటే.. ట్రిపుల్ వ‌న్ జీవో ప‌రిధిలోకి వ‌చ్చే కొన్ని గ్రామాల్నీ కొత్త‌గా ఏర్పాటు చేసిన హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం ప‌రిధిలోకి తీసుకొచ్చింది. ఉదాహ‌ర‌ణ‌కు మొయినాబాద్ ప‌రిధిలోకి వ‌చ్చే బాకారం, కేతిరెడ్డిప‌ల్లి, అజీజ్‌న‌గ‌ర్‌, చిలుకూరు, క‌న‌క‌మామిడి.. శంషాబాద్ కిందికొచ్చే చౌద‌రిగూడ‌, గంధిగూడ‌.. ఇలా 84 గ్రామాల్ని కొత్త‌గా ఏర్పాటు చేసిన మెట్రోపాలిట‌న్ రీజియ‌న్ ప‌రిధిలోకి తెచ్చింది. మ‌రి, 111 జీవో ప‌రిధిలోకి వ‌చ్చే ప్రాంతాల్లో.. కొత్త‌గా ఇల్లు క‌ట్టుకోవ‌డానికి, అపార్టుమెంట్ల నిర్మాణానికి.. ఇక నుంచి అనుమ‌తినిస్తారా? లేక ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న నిషేధాన్ని కొన‌సాగిస్తారా? అనే విష‌యంలో స్ప‌ష్ట‌త‌నివ్వాలి. గ‌త ప్ర‌భుత్వం 111 జీవో ప‌రిధిలోకి వ‌చ్చే ల‌క్షా ముప్ప‌య్ రెండు వేల ఎక‌రాల‌కు క‌లుపుకుని ఒక మాస్ట‌ర్ ప్లాన్‌ను రూపొందిస్తామ‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మ‌రి, అదే ప్ర‌ణాళిక‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌చ్చ‌జెండా ఊపుతుందా? అందుకోస‌మే 111 జీవో ప్రాంతాల్ని కొత్త అథారిటీ ప‌రిధిలోకి తెస్తుందా? అనే సందేహం స‌ర్వ‌త్రా ఉత్ప‌న్నం అవుతుంది. ఏదీఏమైనా, పుర‌పాల‌క శాఖ‌ను స్వ‌యంగా ముఖ్య‌మంత్రియే నిర్వ‌హిస్తున్నారు కాబ‌ట్టి.. ఈ అంశంలో ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న సందేహాల‌కు ఆయ‌నే స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రముంది.

This website uses cookies.