Categories: LATEST UPDATES

హైద‌రాబాద్‌కు త‌క్ష‌ణ‌మే మాస్ట‌ర్ ప్లాన్ కావాలి

  • క్రెడాయ్ తెలంగాణ‌కు కొత్త కార్య‌వ‌ర్గం..
  • మ‌న మార్కెట్‌ న‌ జుక్తీ న‌హీ.. న రుక్తీ న‌హీ.. న త‌క్తీ న‌హీ
  • నెక్స్ట్ లెవెల్లోకి మ‌న నియోపోలిస్‌

క్రెడాయ్ తెలంగాణ సంఘం నూత‌న కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం సంస్థ కార్యాల‌యంలో కోకాపేట్‌లో విలేక‌రుల స‌మావేశాన్ని నిర్వ‌హించారు. కొత్త బృందానికి చైర్మన్‌గా డి. మురళీకృష్ణా రెడ్డి, అధ్యక్షుడిగా ఇ. ప్రేంసాగర్ రెడ్డి, ప్రెసిడెంట్‌- ఎలక్ట్ గా కె. ఇంద్రసేనారెడ్డి, సెక్రటరీగా జి. అజయ్ కుమార్, ఉపాధ్యక్షులుగా బి. పాండురంగా రెడ్డి, పురుషోత్తం రెడ్డి, గుర్రం నర్సింహా రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, కోశాధికారిగా జగన్ మోహన్ చిన్నాల, క్రెడాయ్ తెలంగాణ జాయింట్ సెక్రటరీలుగా వై.వెంకటేశ్వర్ రావు, బండారి ప్రసాద్, చేతి రామారావు, ఎం. ఆనంద్ రెడ్డి నేతృత్వం వ‌హిస్తారు. క్రెడాయ్ యూత్ వింగ్ తెలంగాణ కోసం కోఆర్డినేటర్‌గా సి. సంకీర్త్ ఆదిత్య రెడ్డి మరియు కార్యదర్శిగా రోహిత్ అశ్రిత్ బాధ్యతలు నిర్వహిస్తారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ కొత్త కార్య‌వ‌ర్గానికి శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలంగాణా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి అందరూ కలిసి పని చేస్తార‌ని.. బిల్డర్ల ఐక్యత, క్రెడాయ్ నెట్‌వర్క్‌ను మరిన్ని జిల్లాలకు విస్తరించడం, బాధ్యతాయుతమైన బిల్డర్‌లను ఎంపానెల్ చేయడంపై దృష్టి సారిస్తార‌ని తెలిపారు. పెరీ అర్బ‌న్‌, రిక్రియేష‌న్ జోన్ల‌లో లేఅవుట్లు వేయ‌డం కుదర‌డం లేద‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వంలో 35 ల‌క్ష‌ల మంది ప‌ని చేస్తే.. నిర్మాణ రంగంలో ఐదు కోట్ల డెబ్బ‌య్ ఐదు ల‌క్ష‌ల మంది ప‌ని చేస్తున్నార‌ని వెల్ల‌డించారు. వ్య‌వ‌సాయ రంగంలో సీజ‌న‌ల్ ఎంప్లాయ్‌మెంట్ ఉంటుంద‌ని.. కానీ నిర్మాణ రంగంలో ప‌ర్మ‌నెంట్ ఎంప్లాయ్‌మెంట్ ఉంటుంద‌న్నారు. నిర్మాణ రంగాన్ని నియంత్రించ‌డానికి రెరానుఏర్పాటు చేసిన‌ట్లే.. సిమెంటు, స్టీలు రంగంపై రెగ్యులేట‌రీ అథారిటీని ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఈ రెండు ప‌రిశ్ర‌మ‌లు నిర్మాణ రంగాన్ని ఇబ్బంది పెడుతున్నాయ‌ని విచారం వ్య‌క్తం చేశారు. హైద‌రాబాద్‌తో పాటు ఇత‌ర న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌కు మాస్ట‌ర్ ప్లాన్ల‌ను త్వ‌ర‌గా రూపొందించాల‌న్నారు.

ఈ సంద‌ర్భంగా క్రెడాయ్ తెలంగాణ ఎల‌క్ట్ ప్రెసిడెంట్ ఇంద్ర‌సేనారెడ్డి మాట్లాడుతూ.. యూకే ప్ర‌ధాన‌మంత్రి విన్‌స్ట‌న్ చ‌ర్చిల్ అన్న మాట‌ల్ని గుర్తు చేశారు. మ‌నం బిల్డింగుల‌కు రూపాన్నిస్తే.. ఆ త‌ర్వాత అట్టి భ‌వ‌నాలు స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌కు వేదిక‌గా మార‌తాయ‌ని.. అవి అక్క‌డ నివ‌సించే ప్ర‌జ‌ల్లో స‌రికొత్త స్ఫూర్తినిస్తాయ‌ని.. ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాల్ని మెరుగుప‌రుస్తాయ‌ని ఆయ‌న అన్నార‌ని తెలిపారు. మొన్న‌టి హైటెక్ సిటీ, నిన్న‌టి ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్ నేటి నియోపోలిస్ ప్ర‌పంచ స్థాయి ప‌టంలో హైద‌రాబాద్‌ను నిలిపింద‌న్నారు. తెలంగాణ ప్ర‌భుత్వ విశిష్ఠ ల‌క్ష‌ణాల వ‌ల్ల భార‌త‌దేశంలోని 35 ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌లు న‌గ‌రానికొచ్చి నివ‌సిస్తున్నార‌ని తెలిపారు. సుజలాం, సుఫ‌లాం, మ‌ల‌య‌జ సీత‌లాం అన్న ప‌దానికి చ‌క్క‌టి నిర్వ‌చ‌నంగా తెలంగాణ మారింద‌న్నారు. గుజ‌రాత్ గిఫ్ట్ సిటీ, బెంగ‌ళూరు ఎల‌క్ట్రానిక్ సిటీ, ఎన్‌సీఆర్ డీఎల్ఎఫ్ సిటీకి నెక్స్ట్ లెవెల్ మ‌న న‌గ‌రానికి చెందిన నియోపోలిస్ అని కితాబునిచ్చారు. వ‌చ్చే ప‌దేళ్ల‌లో ప‌ది ల‌క్ష‌ల మందికి ఉద్యోగాల్ని క‌ల్పించే అవ‌కాశ‌ముంద‌న్నారు. రానున్న రోజుల్లో ఊహించ‌ని అభివృద్ధి ఉంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. వ‌చ్చే ఇర‌వై పాటు హైద‌రాబాద్ రియ‌ల్ రంగం మార్కెట్‌ న‌ జుక్తీ న‌హీ.. న రుక్తీ న‌హీ.. న త‌క్తీ న‌హీ అని ధీమా వ్య‌క్తం చేశారు.

 

క్రెడాయ్ తెలంగాణ కార్యదర్శి జి. అజయ్ కుమార్ మాట్లాడుతూ , “తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా టెక్స్‌టైల్స్, ఆటో-అనుబంధాలు, ఫార్మా & హెల్త్ కేర్, ఐటి, ఐటిఇఎస్, ఏవియేషన్, ఫుడ్ ప్రాసెసింగ్ మొదలైన వివిధ పరిశ్రమల ద్వారా కారిడార్లు ఏర్పాటు చేసి పెట్టుబడులను ఆకర్షిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ‘ఒక జిల్లా, ఒక ఉత్పత్తి’ పథకంపై పని ప్రారంభించింది, ఇది ఎగుమతి ప్రోత్సాహం మరియు దిగుమతి ప్రత్యామ్నాయం రెండింటికీ అధిక మార్కెట్ సంభావ్యత కలిగిన ఉత్పత్తులను గుర్తించడం మరియు ప్రోత్సహించడం, పారిశ్రామిక జోన్ల అభివృద్ధికి హామీ ఇవ్వడం, జిల్లాలకు ప్రయోజనం చేకూర్చడం. మౌలిక సదుపాయాలు మరియు పరిశ్రమల అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ మరియు ఉపాధిని సృష్టించడం చేస్తుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌కు డిమాండ్‌ పెరిగింది. క్రెడాయ్ తెలంగాణ జిల్లా చాప్టర్ లు సభ్యులను విస్తరించడంలో సహాయపడటం మరియు వారికి కొత్త సాంకేతికతలు, మానవశక్తి యొక్క నైపుణ్యం అభివృద్ధి మరియు రెరా మార్గదర్శకాలకు కట్టుబడి ఉండేలా చేయడం, రాష్ట్రవ్యాప్తంగా నైతిక మరియు ఆరోగ్యకరమైన రియల్ ఎస్టేట్ రంగానికి భరోసా ఇవ్వడంపై దృష్టి సారించింది…” అని అన్నారు.

This website uses cookies.