Categories: TOP STORIES

హైదరాబాద్‌లో గాలిమేడ‌లు..

హైదరాబాద్లో కొందరు డెవలపర్లు నిర్లజ్జగా.. నిసిగ్గుగా.. వ్యవహరిస్తున్నారు. కాగితాల మీదే ఆకాశహర్మ్యాల్నీ చూపెడుతూ.. తక్కువ రేటుకే ఫ్లాటు యూడీఎస్, ప్రీ లాంచ్ సేల్స్ అంటూ అమాయక కొనుగోలుదారులకు కుచ్చుటోపి పెడుతున్నారు..

హైద‌రాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి

రెరాను ప‌ట్టించుకోని ప‌లు బ‌డా నిర్మాణ సంస్థ‌లు

యూడీఎస్ పేరిట అక్ర‌మంగా అమ్మ‌కాలు

ప్ర‌భుత్వానికి న‌ష్టం.. సుమారు రూ.2,750 కోట్లు?

కోర్టును ఆశ్ర‌యించే యోచ‌న‌లో టీబీఎఫ్

హైదరాబాద్లోని కొందరు డెవలపర్లు నిర్లజ్జగా.. నిసిగ్గుగా.. వ్యవహరిస్తున్నారు. రెరా నిబంధనలకు యధేచ్చగా తూట్లు పొడుస్తున్నారు. యూడీఎస్, ప్రీ లాంచ్ సేల్స్ అంటూ అమాయక కొనుగోలుదారులకు కుచ్చుటోపి పెడుతున్నారు. కాగితాల మీదే ఆకాశహర్మ్యాల్నీ చూపెడుతూ.. తక్కువ రేటుకే ఫ్లాటు అంటూ వారి కష్టార్జితాన్ని అప్నన్నంగా దోచుకునే పనిలో పడ్డారు. ఎవరేం చేస్తారులే అనే నిర్లక్ష్యపు ధోరణీతో బయ్యర్లతో ఆటాడుకోవడంలో నిమగ్నమయ్యారు. రెరా నిబంధనలకు విరుద్ధంగా బరితెగించి ప్రకటనల్ని గుప్పిస్తున్నా.. జీఎస్టీ, స్టాంప్ డ్యూటీలను ఎగవేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా.. ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తకుండా వ్యవహరిస్తున్నారు. మరి, వీరి ఆగడాలకు అడ్డుకట్టు వేసేవారే తెలంగాణ రాష్ట్రంలో లేరా? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోక ముందే.. ఇలాంటి అక్రమ అమ్మకాల్ని ప్రభుత్వం నిరోధించాలి.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి ముఖ్య‌మంత్రి కేసీఆర్ విప్ల‌వాత్మ‌క‌మైన నిర్ణ‌యాల్ని తీసుకుంటూ రాష్ట్రాన్ని అగ్ర‌ప‌థాన నిల‌బెడుతున్నారు. టీఎస్ ఐపాస్‌తో ప్ర‌పంచాన్ని ఆకర్షించిన ఆయ‌న‌.. టీఎస్ బీపాస్ అంటూ దేశీయ నిర్మాణ రంగంలో స‌రికొత్త సంచ‌ల‌నం సృష్టించారు. అస‌లు మ‌న‌దేశంలో ఏ రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆలోచ‌న రాక‌ముందే.. 21 రోజుల్లో ఇంటి నిర్మాణానికి అనుమ‌తుల్ని మంజూరు చేసే స‌రికొత్త ప్ర‌క్రియ‌కు శ్రీకారం చుట్టారు. మరోవైపు అక్ర‌మ నిర్మాణాల్ని అరిక‌ట్టేందుకు ప్ర‌తి జిల్లాలో క‌లెక్ట‌ర్ల నేతృత్వంలో ప్ర‌త్యేక టాస్క్‌ఫోర్సును నియ‌మించారు. రాష్ట్రాన్ని అగ్ర‌ప‌థాన తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ ఇన్ని మెరుగైన నిర్ణ‌యాల్ని తీసుకుంటుంటే.. కొంద‌రు డెవ‌ల‌ప‌ర్లు మాత్రం అక్ర‌మ ప‌ద్ధ‌తిలో ఫ్లాట్ల‌ను విక్ర‌యించే స‌రికొత్త దందాకు శ్రీకారం చుట్టారు. దీన్నే యూడీఎస్ స్కీము అని కూడా అంటారు.

ప్రీ లాంచ్ సేల్స్.. సాఫ్ట్ లాంచ్ సేల్స్.. యూడీఎస్ స్కీమ్.. ఫిఫ్టీ పర్సెంట్ పేమెంట్ .. ఇలా ప‌లు రియల్ సంస్థలు అమాయక ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నాయి. తక్కువ రేటుకే ఫ్లాటు అంటూ మోసం చేస్తున్నారుయి. కాకపోతే వంద శాతం సొమ్ము ముందే కడితే ఈ ప్రయోజనం అంటున్నాయి. యాభై శాతం సొమ్ము కడితే మరో రేటు అంటున్నాయి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, స్థానిక మున్సిపాలిటీల నుంచి అనుమతులు తీసుకోకుండా.. తెలంగాణ రెరా అథారిటీ ఫైనల్ అప్రూవల్ లేకుండానే ఈ మోసానికి పాల్పడుతున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రధాన కేంద్రంగా కార్యకలాపాల్ని నిర్వహించే పలువురు డెవలపర్లు అక్రమ పద్ధతుల్లో ఫ్లాట్లను విక్రయిస్తున్నారు.

* పశ్చిమ హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో 1300 చదరపు అడుగుల డబుల్ బెడ్రూం ఫ్లాట్ కొనాలంటే ఎంతలేదన్నా రూ.కోటి దాకా అవుతుంది. అంటే, హెచ్ఎండీఏ నుంచి అనుమతి తీసుకుని, రెరా ఫైనల్ అప్రూవల్ తీసుకున్నాక ఒక బిల్డర్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సుమారు రూ. కోటి రూపాయలకు అటుఇటుగా విక్రయిస్తారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కోటి రూపాయలు పెట్టి డబుల్ బెడ్ రూం ఫ్లాట్ ఎంతమంది కొనగలరు? లేదు కదా.. అందుకే సామాన్యులు, మధ్యతరగతి ప్రజానీకాన్ని ఆకర్షించడానికి కొందరు అక్రమార్క బిల్డర్లు యూడీఎస్ విధానంలో ఫ్లాట్లు అమ్మడం ఆరంభించారు. దీని ప్రకారం, ఒక చోట స్థలం ఉంటుంది, దానికి స్థానికసంస్థ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోరు, రెరా అనుమతి ఉండదు. కాకపోతే, ఫ్లాట్ కట్టిన తర్వాత అవిభాజ్యపు వాటా (అన్ డివైడెడ్ షేర్ ఆఫ్ లాండ్) కింద ఎంతయితే స్థలం వస్తుందో అంత స్థలాన్ని అపార్టుమెంట్ కట్టకముందే అమ్మేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అంటే, అపార్టుమెంట్ కేవలం పేపర్ లేదా బ్రోచర్ మీదే ఉంటుందన్నమాట. అనుమతి తీసుకున్నాక ఫ్లాట్ అమ్మితే కోటి రూపాయలు అవుతుంది కాబట్టి, కట్టక ముందే యూడీఎస్ స్థలాన్ని రూ.50 నుంచి రూ.60 లక్షలకే విక్రయిస్తున్నారు. కాకపోతే, ఈ సొమ్ముని ముందే ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. నెల రోజుల దాకా కొన్ని సంస్థలు గడువునిస్తున్నాయి.

* డెవలపర్లు కట్టే ఫ్లాట్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వాలకు నేరుగా 11 శాతం రాబడి వస్తుంది. ఉదాహరణకు కోటి రూపాయల ఫ్లాట్ బయ్యర్లు కొనగానే.. వాటి మీద జీఎస్టీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ.11 లక్షలు ఖజానాకు చేరుతుంది. యాభై లక్షల ఫ్లాటు అయితే రూ.5.5 లక్షల దాకా ఆదాయం ఖజానాలో పడుతుంది. ఇదంతా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెరా అథారిటీల నుంచి అనుమతి తీసుకుని నిర్మిస్తేనే సాధ్యమవుతుంది. కానీ, ఇక్కడ అలా జరగడం లేదు. డెవలపర్లు అన్ డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ కింద స్థలాన్ని విక్రయించి, దాన్ని రిజిస్టర్ చేస్తున్నారు. ఇలా న‌గ‌రంలో ప‌లువురు కొనుగోలుదారుల్నుంచి రూ.25 వేల కోట్ల సొమ్మును ప‌లువురు డెవ‌ల‌ప‌ర్లు వ‌స‌లు చేశార‌ని అన‌ధికార స‌మాచారం. ఇలా, దాదాపు ప్ర‌భుత్వ ఖ‌జానాకు రూ.2,750 కోట్ల చిల్లు ప‌డింద‌ని ప‌లువురు డెవ‌ల‌ప‌ర్లు చెబుతున్నారు.

త‌క్కువకే వస్తుంటే తప్పేంటి?

యూడీఎస్ కింద తక్కువ రేటుకే ఫ్లాటు వస్తుంటే తప్పేంటి అని వాదించే డెవలపర్లు, రియల్టర్లు, ఏజెంట్లు లేకపోలేరు. కొందరు ప్రభుత్వ పెద్దలూ పరోక్షంగా ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నార‌ని స‌మాచారం. పదేళ్ల క్రితం నోయిడా, గుర్గావ్ వంటి ప్రాంతాల్లో కొందరు డెవలపర్లు చేసిన మోసాల వల్ల అక్కడి సామాన్య కొనుగోలుదారులు దారుణంగా మోసపోయారు. మధ్యతరగతి ప్రజలు తమ కష్టార్జితాన్ని ఇలా బూడిదపాలు చేసుకోకూడదనే ఉద్దేశ్యంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం రెరా నిబంధనలకు రూపకల్పన చేసింది. గతంలో ఢిల్లీలో జరిగిన మోసాలే మళ్లీ హైదరాబాద్లో ఈ యూడీఎస్ వల్ల జరిగే ప్రమాదముందని కొందరు బిల్డర్లు భయపడుతున్నారు. రెరా నుంచి అనుమతి లేకుండా ఫ్లాట్లను విక్రయించేసి.. ఒకవేళ ఆ బిల్డర్ అపార్టుమెంట్ పూర్తి చేయకపోతే? అందులో కొన్నవారి పరిస్థితి ఏమిటి? బిల్డర్ తో సహా యూడీఎస్లో కొన్నవారూ ఆ మోసంలో పాలిభాగస్తులు అవుతారు. కాబట్టి, యూడీఎస్ లో కొనకపోవడమే అన్నివిధాల మేలు అని అభిప్రాయపడే డెవలపర్లూ ఉన్నారు.

కోర్టును ఆశ్ర‌యించే యోచ‌న‌లో..

తెలంగాణ‌కు చెందిన కొన్ని నిర్మాణ సంఘాలు యూడీఎస్ విధానాన్ని పూర్తిగా వ్య‌తిరేకిస్తున్నాయి. అయినా, ఆయా సంఘాల‌కు చెందిన కొంద‌రు బిల్డ‌ర్లు యూడీఎస్ బాట ప‌ట్టారు. ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తున్నారు. వీరిని చూసి చిన్న చిన్న రియ‌ల్ట‌ర్లు సైతం ఎక్క‌డో ఒక చోట స్థ‌లం తీసుకుని.. అంద‌మైన బ్రోచ‌ర్ల‌ను ముద్రించి.. యూడీఎస్‌లో ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తున్నారు. క్రెడాయ్ హైద‌రాబాద్ వ‌చ్చే నెల హైద‌రాబాద్‌లో నిర్వ‌హించే ప్రాప‌ర్టీ షోలో రైట్ ప్రాప‌ర్టీని ఎంచుకోమ‌ని ప్ర‌చారాన్ని ఆరంభించింది. ఈ యూడీఎస్ విధానం వ‌ల్ల జ‌రుగుతున్న న‌ష్టాన్ని అంచ‌నా వేసిన తెలంగాణ బిల్డ‌ర్స్ ఫెడ‌రేష‌న్ ఏకంగా కోర్టును ఆశ్ర‌యించే యోచ‌న‌లో ఉంది. నిర్మాణ సంస్థ‌లు దీర్ఘ‌కాలంలో న‌ష్టాన్ని చ‌విచూసే అవ‌కాశం ఉన్నందు వ‌ల్ల యూడీఎస్ విధానానికి వ్య‌తిరేకంగా కోర్టును ఆశ్ర‌యించే యోచ‌న‌లో ఉన్నామ‌ని తెలంగాణ బిల్డ‌ర్స్ ఫెడ‌రేష‌న్ అధ్య‌క్షుడు సీహెచ్ ప్ర‌భాక‌ర్ రావు తెలిపారు. మ‌రి, ప్ర‌స్తుతం అసెంబ్లీ సెష‌న్ జ‌రుగుతున్న నేప‌థ్యంలో, దీనిపై ప్ర‌భుత్వం తుది నిర్ణయం తీసుకునే అవ‌కాశం ఉంటుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.

This website uses cookies.