ఏజెంట్: సర్, 60 లక్షల ఫ్లాట్ రూ.30 లక్షలకే ఇస్తున్నాం.
బయ్యర్: ఔనా, ఇదెలా సాధ్యం?
ఏజెంట్: ముందే హండ్రెడ్ పర్సంట్ ఎమౌంట్ క్యాష్ కట్టాలి సార్.
బయ్యర్: బ్యాంక్ లోన్ తీసుకుని కడతా. కొంచెం టైమిస్తారా?
ఏజెంట్: బుకింగ్ ఎమౌంట్ టెంట్ పర్సంట్ కట్టి.. మిగతా ఎమౌంట్‌ని నెల రోజుల్లోపే కట్టేయాలి.
బయ్యర్: ఓ.. అవునా?
ఏజెంట్: ఔను సార్. పర్మిషన్లు తీసుకుని పనులు ప్రారంభమైతే ఈ ఫ్లాట్ ధర రూ.60 లక్షలు అవుతుంది సార్.
బయ్యర్: మరి, నా సొమ్ముకు గ్యారెంటీ ఏమిటీ? ముందే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారా?
ఏజెంట్: డబ్బులు కట్టగానే ఎంవోయూ రాసిస్తాం సార్. ఆతర్వాత యూడీఎస్ కింద రిజిస్ట్రేషన్ 100 గజాలు చేసిస్తాం.
బయ్యర్: ఇంతవరకూ ఏమైనా రిజిస్ట్రేషన్లు చేశారా? ఏదైనా డాక్యుమెంట్ ఉంటే చూపించండి?
ఏజెంట్: అది.. అది.. కొత్తగా స్టార్ట్ చేశాం కదా.. ఇప్పటివరకూ రిజిస్ట్రేషన్ ఎవరికీ చేయలేదు సార్.
బయ్యర్: ఏం రా.. పొద్దున పొద్దున నేనే దొరికిననా? నడువ్ ఇకడ్నుంచి..
తెలంగాణ రెరా అథారిటీ అధికారికి, ఒక ఏజెంట్ మధ్య జరిగిన సంభాషణ ఇది. ఇలా, నగరానికి చెందిన పలు నిర్మాణ సంస్థలు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. అయితే, ప్రీ లాంచ్, యూడీఎస్ పథకాల్లో ప్లాట్లు, ఫ్లాట్లను ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయవద్దని తెలంగాణ రెరా అథారిటీ సూచిస్తోంది. ఎవరైనా బిల్డర్ లేదా డెవలపర్, రెరా అనుమతి లేకుండా ఫ్లాట్ల అమ్మకపు ప్రకటనల్ని విడుదల చేస్తే.. రెరా సెక్షన్ 3 (1) ఉల్లంఘించినట్లు అవుతుంది. ఇది నిరూపితమైతే రెరా చట్టం సెక్షన్ 59 ప్రకారం.. ప్రాజెక్టు విలువలో పది శాతం సొమ్మును జరిమానా వసూలు చేస్తారు. అంటే, ఒక ప్రాజెక్టు విలువ రూ.10 కోట్లు అని రెరా అథారిటీ నిర్థారిస్తే.. అందులో పది శాతం జరిమానా, అంటే రూ.1 కోటి విధిస్తారు. ఇందుకోసం ముందుగా రెరా అథారిటీ షోకాజ్ నోటీసును జారీ చేస్తుంది. సదరు సంస్థ నుంచి సరైన జవాబు రాకపోతే, జరిమానాను వసూలు చేస్తారు.
* యూడీఎస్ లో స్కీములో బిల్డర్ స్థలం రిజిస్టర్ చేస్తున్నప్పటికీ, అతను చూపించేది ఫ్లాటే కాబట్టి, అది కచ్చితంగా మోసం కిందికే వస్తుందని తెలంగాణ రెరా అథారిటీ భావిస్తోంది. కొందరు డెవలపర్లు ఏం చేస్తున్నారంటే.. తక్కువ ధరకే ఫ్లాట్లను విక్రయించేందుకు అవిభాజ్యపు వాటా కింద వంద గజాల్లోపు స్థలాన్ని రిజిస్టర్ చేస్తోంది. అయితే, కొత్త నిబంధనల ప్రకారం, అనుమతి లేఅవుట్లలో ప్లాట్లను మాత్రమే రిజిస్టర్ చేసేందుకు అధికారులు సమ్మతిస్తున్నారు. కాబట్టి, కొనుగోలుదారులు ఇలాంటి వాటిలో కొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని అధికారులు సూచిస్తున్నారు.
* తక్కువ రేటంటూ కొందరు డెవలపర్లు ఆశ చూపెట్టి వంద శాతం సొమ్మును ముందే వసూలు చేస్తున్నారు. ఇందుకు గాను ఎంవోయూ రాసిస్తున్నారు. అయితే, బయ్యర్లు గుర్తించాల్సిన అంశం ఏమిటంటే.. ఇలాంటి ఎంవోయూలు ఎట్టి పరిస్థితిల్లో చెల్లనే చెల్లవు. కాబట్టి, ఇలాంటి ఎంవోయూల వల్ల కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు.
This website uses cookies.