నిన్నటివరకూ.. బీరంగూడలో కోటి రూపాయల్లోపు.. నార్సింగి, తెల్లాపూర్‌లో రెండు కోట్లకు అటుఇటుగా విల్లాలు దొరికేవి. కానీ, నేడో..
నిన్నటివరకూ.. కాస్త తక్కువ రేటులో విల్లాలు కావాలంటే నార్సింగి, తెల్లాపూర్, బీరంగూడ వంటి ప్రాంతాలకు వెళితే సరిపోయేది. బీరంగూడలో కోటి రూపాయల్లోపు.. నార్సింగి, తెల్లాపూర్‌లో రెండు కోట్లకు అటుఇటుగా విల్లాలు దొరికేవి. కానీ, నేడో విల్లాల పరిధి ఓటర్ రింగ్ రోడ్డు దాటేసింది. హైదరాబాద్‌లో ఎక్కడ విల్లా కొనుగోలు చేసిన ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాచుపల్లి తర్వాత వచ్చే మల్లంపేట్, పటాన్‌చెరు, గుండ్లపోచంపల్లి, ఉస్మాన్ నగర్, బౌరంపేట్, శంషాబాద్, కొల్లూరు, పాటి ఘనపూర్ వంటి ప్రాంతాల్లో విల్లాల్ని నిర్మించే డెవలపర్ల సంఖ్య పెరిగింది.
బాచుపల్లి తర్వాత వచ్చే మల్లంపేట్‌లో విల్లా కొనాలంటే కనీసం కోటి నలభై లక్షలు పెట్టుకోవాల్సిందే. వాస్తవానికి, ఐదేళ్ల క్రితం బాచుపల్లి, మల్లంపేట్ వంటి ప్రాంతాల్లో రూ.75 లక్షలకే వ్యక్తిగత డూప్లే విల్లా లభించేవి. కానీ, అదేంటో కానీ, ఇప్పుడు కనీసం కోటిన్నర పెడితే తప్ప విల్లా కొనలేని పరిస్థితి ఏర్పడింది. పోనీ, ఈ ఐదేళ్లలో ఇక్కడ రహదారులేమైనా అభివృద్ధి చెందాయా? ఉద్యోగావకాశాల్ని కల్పించే సంస్థలు పుట్టుకొచ్చాయా? అంటే అదీ లేదు. కారణాలైతే తెలియదు కానీ, మల్లంపేట్, బౌరంపేట్ వంటి ప్రాంతాల్లో విల్లాల రేట్లు ఆకాశాన్నంటేశాయి. మరి, వీటిలో ఎంతమంది విల్లాలు కొంటున్నారో తెలియని పరిస్థితి.
పటాన్ చెరు అంటే ఒకప్పుడు కాలుష్యానికి మారుపేరుగా భావించేవారు. కానీ, ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ రుద్రారం వద్ద రావడం, సుల్తాన్‌పూర్‌లో ప్రభుత్వం మెడికల్ డివైజెస్ పార్కు పెడుతున్నామని ప్రకటించడం, కంది వద్ద ఐఐటీ రావడం, గీతం కాలేజీ ఏర్పాటు కావడం వంటి అంశాల వల్ల ఒక్కసారిగా పటాన్ చెరు హాట్ లొకేషన్‌గా మారింది. ప్రస్తుతం ఇక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో అపార్టుమెంట్లు, విల్లాల్ని కొనే డెవలపర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక్కడ ఎంతమంది వ్యక్తిగత గృహాలు కొనుగోలు చేస్తున్నారో తెలియదు కానీ, వీటిని కట్టే డెవలపర్లు మాత్రం పెరిగారు. దాదాపు కోటి నుంచి కోటిన్నర మధ్యలో వ్యక్తిగత గృహాలు లభిస్తుండటంతో కొందరు కొనుగోలుదారులు ఇందులో తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం.
This website uses cookies.