తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోయే ప్రసక్త లేదని నిర్మాణ రంగ పెద్దలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా, బీఆర్ఎస్ గెలిచినా.. భాగ్యనగరాన్ని అభివృద్ధి చేయాల్సిందేనని అంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి చెందినప్పుడే.. దాని మీద ఆధారపడిన ఇతర రంగాలకూ గిరాకీ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. పైగా, స్థానిక రాజకీయాల వల్ల హైదరాబాద్ ప్రభావితమయ్యే పరిస్థితి ప్రస్తుతం లేదని.. అంతర్జాతీయ స్థాయికి నగర ఖ్యాతి పెరిగిందని చెబుతున్నారు. కాకపోతే, అధికార మార్పిడి జరిగిన తర్వాత.. సర్దుబాటుకు కొంత సమయం పడుతుందన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నే కాకుండా మొత్తం తెలంగాణనే సమగ్రంగా అభివృద్ధి చేసే మాస్టర్ ప్లాన్ తమ వద్ద ఉందని తెలిపారు. టన్నెల్ బోర్ మిషన్ల ద్వారా హైదరాబాద్ నగరంలో భూగర్భ రహదారులు నిర్మిస్తామని, మూసీ ఆక్రమణలు తొలగించి, నల్లగొండ జిల్లాలోని మూసీ రిజర్వాయర్ వరకు సుందరీకరించడమే కాకుండా ఇరువైపులా వ్యాపార కార్యకలాపాలు సాగేలా ఏర్పాట్లు చేస్తామని వివరించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ వరకూ అర్బన్ పాలసీ, ఔటర్ నుంచి రీజనల్ రింగు రోడ్డు వరకు సెమీ అర్బన్ పాలసీ, రీజనల్ రింగు రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ పాలసీ ఉంటుందన్నారు. మొత్తానికి, హైదరాబాద్‌తో పాటు తెలంగాణను 2050 నాటికి అభివృద్ధి చేసే మెగా మాస్టర్ ప్లాన్ తమ దగ్గర ఉందన్నారు. హైదరాబాద్ ను ప్రపంచంలోనే గుర్తింపు పొందిన పెట్టబడి నగరంగా మారుస్తామని భరోసా కల్పించారు. అందుకే, అధిక శాతం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం పలు కీలక అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిర్మాణ నిపుణులు అంటున్నారు. అవేమిటంటే..
కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక హెచ్ఎండీఏకు పూర్తి స్థాయి కమిషనర్‌ను నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఎందుకంటే, ఇప్పటివరకూ అటు పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా మరోవైపు హెచ్ఎండీఏ కమిషనర్‌గా అరవింద్ కుమార్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఎందుకంటే, హెచ్ఎండీఏ మొత్తం ఏడు జిల్లాల్లో విస్తరించింది. 70 మండలాలు, 1032 గ్రామాలున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని 75 గ్రామాలు, 40 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లోని 138 గ్రామాలు, మిగతా 719 గ్రామాలు హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తాయి. ఇంత పెద్దగా విస్తరించి ఉన్న హెచ్ఎండీఏకు పూర్తి స్థాయి కమిషనర్ లేకపోవడం దారుణమైన విషయం. అందుకే, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. పూర్తి స్థాయి కమిషనర్ ను ఏర్పాటు చేయాలి.
మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో రెరా అథారిటీ మెరుగ్గా పని చేస్తుంటే, తెలంగాణలో మాత్రం ఈ అథారిటీ నిర్వీర్యమైంది. 2018 నుంచి ఈ విభాగానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం.. బలోపేతం చేయకపోవడంతో.. రాష్ట్రంలో ప్రీలాంచులు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా, సామాన్యులతో బాటు మధ్యతరగతి ప్రజానీకం ఆర్థికంగా నష్టపోయారు. అందుకే, కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం రెరాను మరింత బలోపేతం చేయాల్సిన అవసరముంది.
దారిద్య్ర రేఖకు దిగువగా ఉన్న ప్రజలకు ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం గృహాల్ని ఆరంభించింది. ఎగువ మధ్యతరగతితో పాటు సంపన్నులు ఖరీదైన గృహాల్ని కొంటారు. కాకపోతే, సమస్యల్లా మధ్యతరగతి వేతనజీవులతోనే. అందుకే, కొత్త ప్రభుత్వం మధ్యతరగతి ప్రజానీకం కోసం ప్రత్యేకంగా అపార్టుమెంట్లను నిర్మించేందుకు ప్రణాళికల్ని రచించాలి. అదేవిధంగా, విదేశీ నగరాల తరహాలో అద్దె గృహాల్ని సైతం కట్టించడం మీద దృష్టి సారించాలి. అలా చేస్తే భారతదేశంలోనే మొదటి నగరంగా హైదరాబాద్ ఖ్యాతినార్జిస్తుంది.
ప్రభుత్వం మారితే రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు. ఐటీతో పాటు ప్రైవేటు రంగాల్లో కొత్త ఉద్యోగాలు ఏర్పాటయ్యేంత వరకూ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఎలాంటి ఢోకా ఉండదు. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు మైగ్రేషన్ ఉన్నంత కాలం ఇళ్ల గిరాకీ పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశమే లేదని ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలి. – జీవీ రావు, అధ్యక్షుడు, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్
బీఆర్ఎస్ ప్రభుత్వం గనక అధికారంలోకి వస్తే.. రియల్ ఎస్టేట్ వ్యాపారం యధావిధిగా కొనసాగుతుంది. ఎందుకంటే, ప్రభుత్వం బిల్డర్ కమ్యూనిటీకి పూర్తి స్థాయి మద్ధతునిచ్చింది. కాంగ్రెస్ గనక అధికారంలోకి వచ్చినా నగరానికి మేలే జరుగుతుంది. ఎందుకంటే, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా బిల్డరే కాబట్టి, నిర్మాణ రంగ వ్యాపారం గురించి పూర్తి అవగాహన ఉంది కాబట్టి.. ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంపై దృష్టి సారించే అవకాశముంది.- ప్రశాంత్ రావు, డైరెక్టర్, పౌలోమీ ఎస్టేట్స్
This website uses cookies.