Categories: LATEST UPDATES

హైదరాబాద్ రియాల్టీ ట్రెండ్స్

హైదరాబాద్ రియాల్టీ ట్రెండ్స్  మార్కెట్లో ప్రస్తుతం మూడు అంశాల గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ఆగస్టు నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలను ప్రభుత్వం పెంచడానికి ప్రయత్నిస్తోందని తెలుసుకున్న నిర్మాణ సంస్థలు.. ఆ ప్రయత్నాన్ని తాత్కాలికంగా కొంతకాలం విరమించుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. సెకండ్ వేవ్ పూర్తయ్యి.. థర్డ్ వేవ్ గురించి ఆందోళన చెందుతున్న నేపథ్యంలో.. రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచితే ఫ్లాట్లను కొనాలని ఆలోచించే ప్రజలూ వెనకడుగు వేసే అవకాశముందని అంటున్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వం ప్యాండమిక్లో స్టాంప్ డ్యూటీని తగ్గించడం వల్ల అజయ్ దేవగన్, సన్నీలియోన్ వంటి బాలీవుడ్ తారలు తమ ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందుకొచ్చారు. సరిగ్గా, అలాంటి ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సమయంలో అందజేయాలని అభిప్రాయపడుతున్నారు. మరి, దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో?

కోకాపేట్ వెరీ హాట్..

తెలంగాణ ప్ర‌భుత్వం త‌ల‌పెట్టిన కోకాపేట్ భూముల వేలానికి అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. దాదాపు వంద‌కు పైగా సంస్థలు ఈ వేలంలో పాల్గొంటున్నాయ‌ని సమాచారం. హైద‌రాబాద్ సంస్థ‌ల్ని మిన‌హాయిస్తే ఢిల్లీ, చెన్నై, బెంగ‌ళూరు వంటి న‌గ‌రాల‌కు చెందిన కంపెనీలు త‌మ ఆస‌క్తిని వెల్ల‌డించాయ‌ని తెలిసింది. కోకాపేట్లో భూమి కొనేందుకు ఫార్మా, ఆస్ప‌త్రులు ఆస‌క్తి చూపిస్తుండ‌గా.. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన రీతిలో హోట‌ళ్లూ ముందుకొచ్చిన‌ట్లు స‌మాచారం. వీటితో బాటు ప‌లు ఐటీ సంస్థ‌లు కోకాపేట్‌లో స్థ‌లానికి పోటీ ప‌డుతున్నాయి. న‌గ‌రానికి చెందిన ప‌లు నిర్మాణ సంస్థ‌లు ఒక బృందంగా ఏర్ప‌డి కోకాపేట్ వేలంలో పాల్గొంటున్నాయని సమాచారం.

ఆఫ‌ర్ల కోసం ఆరాటం

కొవిడ్ నేప‌థ్యంలో.. కొనుగోలుదారులు ఆఫ‌ర్ల కోసం వెతుకుతున్నారు. ఇప్ప‌టికే ప‌లు నిర్మాణ సంస్థ‌లు ప్రీ ఈఎంఐ ఆఫ‌ర్ ను ప్ర‌క‌టించ‌గా.. కొన్ని రియ‌ల్టీ సంస్థ‌లు ప్లాటు కొంటే స్పాట్ రిజిస్ట్రేష‌న్ చేసిస్తామ‌ని చెబుతున్నాయి. దీంతో, బ‌య్య‌ర్లు ఇలాంటి ఆఫ‌ర్లు ఉన్న కంపెనీల వైపు దృష్టి సారిస్తున్నారు. మ‌రి, రానున్న రోజుల్లో ఏయే రియ‌ల్ సంస్థ‌లు ఎలాంటి ఆఫ‌ర్ల‌ను అంద‌జేస్తాయో!

This website uses cookies.