- కర్ణాటక ప్రభుత్వాల నిర్లక్ష్యంతో
బెంగళూరు వెనకబడింది - ఆ స్థానాన్ని హైదరాబాద్ ఆక్రమించే ఛాన్స్
ఐటీలో బెంగళూరుకు దీటుగా దూసుకెళ్తున్న మన భాగ్యనగరం త్వరలోనే ఐటీ రారాజు కిరీటం దక్కించుకోనుందా? కర్ణాటక ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగా మనం బెంగళూరును వెనక్కి నెట్టబోతున్నామా? అంటే ఔననే అంటున్నారు ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ, మాణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ టీవీ చైర్మన్ మోహన్ దాస్ పాయ్. బెంగళూరులో పరిస్థితులు ఇలానే కొనసాగితే ఐటీ రాజధాని హోదా హైదరాబాద్ కు వెళ్లిపోవడం ఖాయమని పేర్కొన్నారు.
కర్ణాటకలో ఏర్పడిన ప్రభుత్వాలు దాదాపు పదేళ్లుగా ఐటీ రంగాన్ని పట్టించుకోవడం మానేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని మోహన్ దాస్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో మరింత శ్రద్ధ కనబరుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
బెంగళూరును ఐటీ రాజధాని హోదా నుంచి వెనక్కి నెట్టే పనిలో హైదరాబాద్ ఉందంటూ మోహన్ దాస్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో పెట్టిన పోస్టుపై పలువురు స్పందించారు. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ కృషి ఎనలేనిదని ప్రశంసించారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే ఇది కచ్చితంగా జరుగుతుందని.. అదే కాంగ్రెస్ గెలిస్తే ఐటీ, రియల్ రంగాలు అమాంతంగా పడిపోతాయని ఓ ఎక్స్ వినియోగదారు పోస్టు చేశారు.
ప్రతి రాష్ట్రంలో ఇలాంటి హైదరాబాద్ ఉండాలని కోరుకుంటున్నట్టు ఓ వినియోగదారు పోస్టు చేశారు. ‘బెంగళూరువాసిగా ఉన్నందుకు గర్వంగా ఉంది. మన అవినీతి ప్రభుత్వాలు ఈ అద్భుతమైన నగరాన్ని అస్తవ్యస్తం చేశాయని అంగీకరిస్తున్నా. హైదరాబాద్ పెరుగుతోంది.. వేగంగా పెరుగుతోంది.. అందులో సందేహం లేదు. ఏదో ఒకరోజు కచ్చితంగా బెంగళూరును ఐటీ రాజధాని హోదా నుంచి హైదరాబాద్ వెనక్కి నెట్టడం ఖాయం. ఇది కఠినమైన వాస్తవం. అందుకే బెంగళూరును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి, ఈ అవినీతి రాజకీయ నాయకుల నుంచి రక్షించాలి’ అని ఓ వినియోగదారు ఎక్స్ లో పేర్కొన్నారు.