హైదరాబాద్ మరో ముంబైగా మారుతోంది. మేఘాల్ని తాకేలా ఆకాశహర్మ్యాలకు చిరునామాగా మారుతోంది. దీంతో, దేశవిదేశాలకు చెందిన బిలియనీర్లు నగరం వైపు ఆసక్తిగా చూస్తున్నారు. రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రాంగూడ, కోకాపేట్, నార్సింగి వంటి ప్రాంతాల్లో నిర్మితమవుతున్న ఆకాశహర్మ్యాల్ని చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. గతంలో ఎన్నడూ లేనివిధంగా.. 32 అంతస్తుల ఎత్తు నుంచి గరిష్ఠంగా 57 అంతస్తుల ఎత్తు వరకూ నిర్మితం అవుతున్నాయి. అంతా సవ్యంగా సాగితే.. ఈ ప్రాజెక్టులన్నీ 2028 లోపు పూర్తయ్యే అవకాశముంది. మరి, నగరంలో నిర్మితమవుతున్న పలు స్కై స్క్రేపర్ల వివరాలు మీకోసం..
ఎస్ఏఎస్ క్రౌన్ అనే సంస్థ కోకాపేట్‌లో 4.5 ఎకరాల్లో 57 అంతస్తుల ఆకాశహర్మ్యాన్ని నిర్మిస్తోంది. ఇందులో వచ్చే మొత్తం ఫ్లాట్ల సంఖ్య.. దాదాపు 237. ఫ్లాట్ల విస్తీర్ణం.. 6564 నుంచి 8811చదరపు అడుగుల్లో ఉంటుంది. ఈ నిర్మాణాన్ని 2027లో పూర్తి చేయడానికి సంస్థ సన్నాహాలు చేస్తోంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ పౌలోమీ ఎస్టేట్స్ కోకాపేట్‌లో సుమారు 4.6 ఎకరాల్లో 55 అంతస్తుల్లో.. పౌలోమీ పలాజో అనే ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఇందులో మొత్తం 145 ఫ్లాట్లను కడుతోంది. ఫ్లాట్ల విస్తీర్ణం విషయానికి వస్తే.. 6225 నుంచి 8100 చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టును 2026లో పూర్తి చేయడానికి పౌలోమీ నిర్మాణ పనుల్ని జోరుగా జరిపిస్తోంది.
ఎస్ఏఎస్ ఇన్‌ఫ్రా సంస్థ సుమారు ఆరు ఎకరాల్లో నానక్‌రాంగూడలో 418 ఫ్లాట్లను కడుతోంది. దీనికి ఎస్ఏఎస్ డౌన్‌టౌన్ అని పేరు పెట్టింది. ఎత్తు.. 54 అంతస్తులు. ఫ్లాట్ల విస్తీర్ణం 2175 నుంచి 4025 చదరపు అడుగుల్లో నిర్మిస్తోంది. రెరా అనుమతి గల ఈ ప్రాజెక్టును 2026లో పూర్తి చేస్తామని సంస్థ చెబుతోంది.
బెంగళూరుకు చెందిన క్యాండియర్ సంస్థ.. శేరిలింగంపల్లిలో 5.5 ఎకరాల్లో.. క్యాండియర్ క్రీసెంట్ అనే 50 అంతస్తుల ఆకాశహర్మ్యానికి శ్రీకారం చుట్టింది. ఇందులో వచ్చే ఫ్లాట్ల సంఖ్య.. 1230. ఫ్లాట్ల విస్తీర్ణం.. 1601 నుంచి 2656 చదరపు అడుగుల్లో కడుతున్నారు. 2025 డిసెంబరులోపు హ్యండోవర్ చేస్తామని సంస్థ చెబుతోంది.
ఆకాశహర్మ్యాల్లో తమదైన ప్రత్యేకతను చాటి చెబుతున్న మై హోమ్ సంస్థ.. కోకాపేట్‌లో మై హోమ్ నిషధ అనే 45 అంతస్తుల ప్రాజెక్టును నిర్మిస్తోంది. దాదాపు 16.68 ఎకరాల్లో 1398 ఫ్లాట్లను కడుతోంది. ఇందులో ఫ్లాట్ల విస్తీర్ణం 3534 నుంచి 4617 చదరపు అడుగులు దాకా ఉంటుంది. ఈ ప్రాజెక్టును 2026 జూన్‌లోపు పూర్తి చేయడానికి సంస్థ సన్నాహాలు చేస్తోందని సమాచారం.
రాఘవ హెచ్ఆర్ఐ క్యాపిటల్ 45 అనే ప్రాజెక్టును నానక్‌రాంగూడలో రాఘవ, హాల్ మార్క్ కన్స్ట్రక్షన్స్ కలిసి చేపడుడుతున్నాయి. 1.9 ఎకరాల్లో ఆరంభించిన ఈ నిర్మాణంలో వచ్చేవి కేవలం తొంభై ఫ్లాట్లే. ప్రాజెక్టు ఎత్తు.. 45 అంతస్తులు. 2027లో పూర్తి చేస్తామని సంస్థ చెబుతోంది.
రాఘవ అనే సంస్థ రాయదుర్గంలో 45 అంతస్తుల రాఘవ ఐరిస్ అనే ప్రాజెక్టును 7.38 ఎకరాల్లో కడుతోంది. ఇందులో వచ్చే ఫ్లాట్ల సంఖ్య.. సుమారు 520. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం.. 5425 నుంచి 6600 దాకా ఉంటుంది. 2028లోగా ప్రాజెక్టును పూర్తి అవుతుందని సంస్థ అంటోంది.
నాణ్యమైన నిర్మాణాల్ని చేపట్టే డీఎస్సార్ సంస్థ నానక్‌రాంగూడలో 3.6 ఎకరాల్లో డీఎస్సార్ స్కైమార్క్ అనే 45 అంతస్తుల సరికొత్త ప్రాజెక్టును ప్రారంభించింది. ఇందులో వచ్చే మొత్తం ఫ్లాట్ల సంఖ్య.. సుమారు 328. 2028లో ఈ నిర్మాణాన్ని సంస్థ హ్యాండోవర్ చేస్తుంది.
హైదరాబాద్‌లో అత్యధిక విస్తీర్ణం గల ఫ్లాట్ల నిర్మాణానికి డీఎస్సార్ సంస్థ శ్రీకారం చుట్టింది. నానక్‌రాంగూడలో 3 ఎకరాల్లో ఆరంభించిన 44 అంతస్తుల ట్విన్ టవర్స్ ప్రాజెక్టులో ఒక్కో ఫ్లాటు విస్తీర్ణం.. సుమారు 15,999 చదరపు అడుగులు. ఇందులో మొత్తం వచ్చే ఫ్లాట్లు కేవలం ఎనభై ఐదు మాత్రమే.
ప్రకృతితో మమేకం అయ్యేలా నిర్మాణాల్ని చేపట్టే అలేఖ్య సంస్థ.. కోకాపేట్‌లో అలేఖ్య రైజ్ అనే 32 అంతస్తుల ప్రాజెక్టును ప్రారంభించింది. సుమారు 7.68 ఎకరాల్లో 512 ఫ్లాట్లను నిర్మిస్తోంది. ఇందులో ఫ్లాట్ల సైజులు 3500 నుంచి 6200 చదరపు అడుగుల్లో ఉంటాయి. హెచ్ఎండీఏ మరియు రెరా అనుమతి గల ఈ ఆకాశహర్మ్యం 2028లో పూర్తయ్యే అవకాశముంది.