అరబిందో రియాల్టీ ఎండీ శరత్ చంద్రారెడ్డి అరెస్టు అయ్యి నెల రోజులు దాటేసింది. తీహార్ జైలు నుంచి ఎప్పుడు బయటికొస్తారో? ఇంకెంత కాలం ఈ కేసు కొనసాగుతుందో తెలియని దుస్థితి నెలకొంది. తాజాగా సీబీఐ న్యాయస్థానం రిమాండ్ ను మరో రెండు వారాలు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఏ-2గా నమోదైన ఈయన.. అరెస్టు కాక ముందు.. అరబిందో ఫార్మా సంస్థ కార్యనిర్వాహక విధుల్ని నిర్వహించేవాడు. కాకపోతే, ఈడీ అరెస్టు చేయడంతో ఫార్మా బాధ్యతల నుంచి అరబిందో సంస్థ తప్పించిన విషయం తెలిసిందే. కాకపోతే ఆయా కంపెనీలో డైరెక్టర్ గా మాత్రం కొనసాగుతాడని కంపెనీ పత్రికముఖంగా వెల్లడించింది. అంతేతప్ప, అరబిందో రియాల్టీకి సంబంధించి ఇంతవరకూ సంస్థ ఒక్క ప్రకటనను విడుదల చేయలేదు. ఎందుకీ సంస్థ రియాల్టీ ప్రాజెక్టుల తాజా స్థితిగతుల గురించి పెట్టుబడిదారులు, కొనుగోలుదారులకు వివరించట్లేదు? అరబిందో రియాల్టీలో అసలెం జరుగుతోంది?
హైదరాబాద్ నిర్మాణ రంగంలో పుట్టగొడుగుల్లా కొత్త ప్రాజెక్టులు ఆరంభమవుతున్నాయి. కేవలం ఆకాశహర్మ్యాలే నలభై నుంచి యాభై దాకా ఆరంభమయ్యాయి. ఇందులో కొన్ని అధికారికంగా ఆరంభం కాగా.. మరికొన్ని అనుమతుల దశలో ఉన్నాయి. ఇదే సమయంలో పలువురు డెవలపర్లు.. ప్రీలాంచ్‌లో మార్కెట్ కంటే తక్కువ రేటుకే ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. అంతెందుకు, ఇదే అరబిందో సంస్థ కొండాపూర్‌లోని రీజెంట్ ప్రాజెక్టుకు సంబంధించి.. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరిట.. రెరా అనుమతి రాక ముందే ఫ్లాట్లను విక్రయించిన విషయం తెలిసిందే.
మాదాపూర్‌లోని అరబిందో కొహినూర్ ప్రాజెక్టు వెనక వైపు హెచ్ఎండీఏ నిర్వహించిన వేలం పాటలో స్థలం కొన్న మరో సంస్థ.. వేలం సొమ్ము చెల్లించడానికే.. ప్రీలాంచులో ఫ్లాట్లను విక్రయించింది. ఇలా, హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను అమ్మని సంస్థ అంటూ లేదు. నిన్నటివరకూ ఇదే మంత్రాన్ని జపించిన అరబిందో రియాల్టీకి ఇప్పుడు ఇదే ప్రీలాంచ్ అమ్మకాలు సమస్యగా మారింది. ఎలాగో తెలుసా? మాదాపూర్‌లోని అరబిందో ప్రాజెక్టుల్లో.. ఫ్లాట్ల ధరను చదరపు అడుక్కీ రూ.10 వేలకు అటుఇటుగా చెబుతున్నారు. కానీ, ఇంత కంటే యాభై శాతం తక్కువకే మార్కెట్లో ప్రీలాంచ్లో ఫ్లాట్లు దొరుకుతున్నాయి.
పైగా, అరబిందో రియాల్టీ ఎండీ లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కుపోవడంతో.. పెట్టుబడిదారులు, ఇళ్ల కొనుగోలుదారులు ఈ సంస్థ వైపు పెద్దగా దృష్టి సారించట్లేదు. ఈ సంస్థ చేపట్టిన ప్రాజెక్టుల్లో ఎవరెవరు ఎంతెంత పెట్టుబడులు పెట్టారనే అంశంపై ఈడీ దృష్టి సారిస్తే తమ పేర్లు బయటికొస్తాయనే భయం ఇన్వెస్టర్లకు పట్టుకుంది. కొనుగోలుదారులూ ఇందులో ఫ్లాట్లను కొనడానికి ఆసక్తి చూపించట్లేదు. ఒక్కసారి పెట్టుబడిదారులు, కొనుగోలుదారుల నమ్మకాన్ని పోగొట్టుకుంటే.. మళ్లీ నిలబెట్టుకోవడమెంతో కష్టమనే విషయం తెలిసిందే. మరి, ఈ సమస్యను అరబిందో రియాల్టీ ఎలా పరిష్కరిస్తుందో?
ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామంగా మారింది. పీఈ ఫండ్ల వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే.. నిర్మాణ సంస్థ నుంచి ప్రతినెలా వడ్డీని తీసుకోకుండా.. ప్రాజెక్టులో లాభాల్ని స్వీకరిస్తాయి. ఫలితంగా, సాధారణ అమ్మకాలతో సంబంధం లేకుండానే ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. దీని వల్ల బయ్యర్లకు ఎంతో మేలు కలుగుతుంది. ఎందుకంటే, ప్రాజెక్టు సకాలంలో పూర్తవుతుంది. మరి, ఇలాంటి పీఈ ఫండ్లు అరబిందో వంటి రియల్ సంస్థల్లో మదుపు చేయడానికి ఎందుకు ఆసక్తి చూపెట్టడం లేదు? ఈ సంస్థ ఎండీ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కుపోవడమే అసలు కారణమా?
ఎంత బడా నిర్మాణ సంస్థ అయినా, ఇన్వెస్టర్ల నమ్మకాన్ని వమ్ము చేసుకుంటే మార్కెట్లో నిలదొక్కుకోవడం సులువైన విషయమేం కాదు. ఇక్కడ, అరబిందో రియాల్టీ అంశంలో అటు ఇన్వెస్టర్లు ముందుకు రావట్లేదు.. ఇటు ఇళ్ల కొనుగోలుదారులు ఫ్లాట్లను కొనట్లేదు. కొంతకాలం నుంచి మీడియాలో వివిధ ప్రాజెక్టుల గురించి వ్యాపార ప్రకటనల్ని గుప్పిస్తున్నా.. మార్కెట్ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించట్లేదు. కొహీనూర్, ద పర్ల్, రీజెంట్ వంటి ప్రాజెక్టులతో పాటు పటాన్‌చెరు ఇంద్రేశం చేరువలోని ఐనవోలు వద్ద విల్లా ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారనే సందేహం సర్వత్రా నెలకొంది. సాక్షాత్తు సంస్థ ఎండీ తీహార్ జైలులో ఊచలు లెక్క పెడుతుండటంతో.. అరబిందో ప్రమోటర్లు సొంత నిధుల్ని వెచ్చించి ప్రాజెక్టులను పూర్తి చేస్తారా? లేకపోతే ఇతర వ్యూహాన్ని అనుసరిస్తారా? అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
This website uses cookies.