మార్కెట్లోకి కొత్తగా 1.49 కోట్ల చ.అ. స్థలం
2023 ఆర్ధిక సంవత్సరంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో కార్యాలయాల స్థలాల సరఫరాలో హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచింది. నగరంలో కొత్తగా 1.49 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ సప్లయి కాగా.. 26 శాతం వాటాతో బెంగళూరులో 1.26 కోట్ల చ.అ. స్థలం సరఫరా జరిగిందని అనరాక్ గ్రూప్ నివేదిక వెల్లడించింది. 2022 ఆర్ధిక సంవత్సరంలో హైదరాబాద్‌లో 1.18 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ సప్లయి జరిగింది. అలాగే 78.5 లక్షలు చ.అ. లావాదేవీలు జరిగాయి. అదే బెంగళూరులో 1.45 కోట్ల చ.అ. సప్లయి జరగగా.. 76 లక్షలు చ.అ. స్థలం లావాదేవీలు జరిగాయి.
దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 2023 ఆర్ధిక సంవత్సరంలో కొత్తగా 4.86 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ మార్కెట్లోకి వచ్చింది. 3.61 కోట్ల చ.అ. లాదేవీలు జరిగాయి. అంతకు క్రితం ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే సరఫరాలో క్షీణత, లావాదేవీలలో వృద్ధి నమోదయింది. 2022 ఎఫ్‌వైలో 5.12 కోట్ల చ.అ. స్థలం సరఫరా కాగా.. 3.40 కోట్ల చ.అ. లావాదేవీలు పూర్తయ్యాయి. 2023 ఎఫ్‌వైలో ఎన్‌సీఆర్‌లో 88.2 లక్షలు చ.అ. ఆఫీసు స్పేస్ సప్లయి కాగా.. ఎంఎంఆర్‌లో మరీ దారుణంగా కేవలం 41.8 లక్షలు చ.అ.లకే పరిమితమైంది. అంతకుక్రితం ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే ఇది 46 శాతం తక్కువ.
2023 ఎఫ్‌వైలో ఆఫీసు స్పేస్ లావాదేవీలలో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడ నగరంలో 68.8 లక్షలు చ.అ. కార్యాలయ స్థలాల లావాదేవీలు జరిగాయి. 98.8 లక్షల చ.అ.ల నికర లావాదేవీలతో బెంగళూరు తొలి స్థానంలో నిలవగా.. 68.9 లక్షలు చ.అ. లావాదేవీలతో రెండో స్థానంలో ఎన్‌సీఆర్ నిలిచింది.
గ్రేడ్–ఏ ఆఫీసు స్పేస్ వెకన్సీలోనూ హైదరాబాద్ దుమ్మరేపింది. భాగ్యనగరంలో తప్ప మిగిలిన అన్ని మెట్రో నగరాలలో క్షీణత నమోదయింది. వార్షిక ప్రాతిపదికన హైదరాబాద్‌లో గ్రేడ్–ఏ ఆఫీసు స్పేస్ వెకన్సీలో 0.5 శాతం పెరుగుదల కనిపించింది. మిగిలిన ఆరు నగరాలలో 0.1 శాతం నుంచి 0.5 శాతం మధ్య తగ్గుదల నమోదయింది. అత్యధికంగా ఎంఎంఆర్‌లో 0.5 శాతం క్షీణత నమోదు కాగా.. కోల్‌కత్తాలో 0.4 శాతం, పుణేలో 0.2 శాతం, బెంగళూరు, చెన్నై, ఎన్‌సీఆర్‌లలో 0.1 శాతం తగ్గుదల కనిపించింది.
ఏడాది కాలంలో ఆఫీసు స్పేస్ అద్దెలు 4 శాతం మేర పెరిగాయి. నగరాల వారీగా చూస్తే.. అత్యధికంగా పుణే, బెంగళూరులో ఆఫీసు రెంట్లు పెరిగాయి. పుణేలో 10 శాతం, బెంగళూరులో 9 శాతం అద్దెలు వృద్ధి చెందగా.. హైదరాబాద్‌లో 7 శాతం మేర పెరిగాయి. అత్యంత ఖరీదైన ఆఫీసు స్పేస్ మార్కెట్‌గా ఎంఎంఆర్ నిలిచింది. ఇక్కడ చ.అ. అద్దె నెలకు రూ.132 కాగా.. బెంగళూరులో రూ.85, ఎన్‌సీఆర్‌లో రూ.82, కోల్‌కత్తాలో రూ.54గా ఉన్నాయి.
This website uses cookies.