వచ్చే ఐదేళ్లలో..
రిటైల్ వృద్ధికి కారణం వినియోగ వ్యయం పెరగడమే
గతేడాది హైదరాబాద్, బెంగళూరుల్లోనే కొత్త మాల్స్
అనరాక్, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడి
కరోనా మహమ్మారి నుంచి రిటైల్ రంగం క్రమంగా పుంజుకోవటంతో దేశంలో కొత్త షాపింగ్ మాల్స్ ఎంట్రీ ఇస్తున్నాయి. వచ్చే 4–5 ఏళ్లలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో కొత్తగా 2.5 కోట్ల చ.అ. స్థలంలో షాపింగ్ మాల్స్ రానున్నాయి. వినియోగ వ్యయం పెరగడమే రిటైల్ రంగం వృద్ధికి కారణమని, దీంతో కొత్త మాల్స్‌కు డెవలపర్లు శ్రీకారం చుడుతున్నారని అనరాక్, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్‌ఏఐ) నివేదిక వెల్లడించింది.
ప్రస్తుతం దేశంలోని ఏడు ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ–ఎన్‌సీఆర్, పుణే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కత్తాలలో 5.1 కోట్ల చ.అ. మాల్స్ ఉండగా.. 62 శాతం ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరులోనే కేంద్రీకృతమై ఉన్నాయి. కొత్తగా రానున్న మాల్స్‌లలో 46 శాతం ఎన్‌సీఆర్, హైదరాబాద్‌లో, 19 శాతం బెంగళూరు నగరాలలోనే వస్తున్నాయి. గతేడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 26 లక్షల చ.అ. మాల్ స్థలం అందుబాటులోకి వచ్చింది. 2021తో పోలిస్తే ఇది 27 శాతం ఎక్కువ. కేవలం హైదరాబాద్, బెంగళూరులలో మాత్రమే గతేడాది కొత్తగా మాల్స్ స్థలం అందుబాటులోకి వచ్చింది.
* మాల్స్‌లలో అద్దెలు 15 శాతం పెరిగినప్పటికీ డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ఇది కరోనా ముందు కంటే మాల్స్ గిరాకీ మరింత పెరిగింది. గతేడాది అత్యధికంగా బెంగళూరులో 27 శాతం, కోల్‌కత్తాలో 20 శాతం మేర పెరిగాయి. 2019–22 మధ్య కాలంలో దేశీయ రిటైల్ రంగంలోకి 1,473 మిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా.. ఇందులో 76 శాతం 2019లోనే వచ్చాయి. హైదరాబాద్, ముంబై ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులలో 40 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
2022 ఆర్ధిక సంవత్సరంలో రిటైల్ అమ్మకాల పరిమాణం 52 బిలియన్ డాలర్లుగా అంచనా వేయగా.. 2028 నాటికి 136 బిలియన్ డాలర్లకు చేరుతుంది. అలాగే ఈ–రిటైల్ మార్కెట్ వచ్చే ఐదేళ్లలో 25–30 శాతం మేర పెరిగి 2026 ఆర్ధిక సంవత్సం నాటికి 120–140 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.
గతేడాది చివరల్లో పండుగ సీజన్‌లో రిటైల్ అమ్మకాల విలువ రూ.2.5 లక్షల కోట్లుగా ఉందని ఆర్‌ఏఐ అంచనా వేసింది. ఇతి అంతకుక్రితం ఏడాదితో పోలిస్తే దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ. 2032 నాటికి దేశీయ రిటైల్ పరిమాణం 2 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అనరాక్ సీఈఓ అనూజ్ కేజ్రీవాల్ అంచనా వేశారు. వ్యవస్థీకృత రిటైల్ రంగంలో ఏటా 25 శాతం వృద్ధి రేటుతో 2021 నాటికి 690 బిలియన్ డాలర్లకు చేరిందని తెలిపారు. ప్రసుతం వ్యవస్థీకృత రిటైల్‌లో ఆన్‌లైన్ వాటా 25 శాతంగా ఉందని.. 2030 నాటికి 37 శాతానికి పెరుగుతుందని పేర్కొన్నారు.
This website uses cookies.