Categories: TOP STORIES

హైదరాబాద్ వర్సెస్ అమరావతి

అంశుమ‌న్ మ్యాగ‌జీన్‌, ఛైర్మ‌న్‌, సీబీఆర్ఈ

రియల్ ఎస్టేట్ మార్కెట్ పరంగా
దేని ప్రత్యేకతలు దానివే

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ అమరావతి వెలుగులోకి వచ్చింది. వైఎస్సార్ సీపీ సర్కారు ఉన్న ఐదేళ్లు అమరావతి రియల్ పరిస్థితి దారుణంగా మారిపోగా.. కూటమి అధికారంలోకి రాగానే భూముల ధరలు మళ్లీ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ లో రియల్ డిమాండ్ తగ్గే అవకాశం ఉందని పలువురు విశ్లేషిస్తున్నప్పటికీ, భాగ్యనగరానికి రియల్ పరంగా ఎలాంటి ఢోకా ఉండదను మరికొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు హైదరాబాద్ కు, అమరావతికి మధ్య తేడాలేంటి? ఏ నగరం దేనికి అనుకూలంగా ఉందో చూద్దామా?

హైదరాబాద్ నగరం ప్రధానంగా ఐటీ, ఫార్మా, ఇతర సేవారంగాల్లో బలమైన వృద్ధిని కలిగి ఉంది. జనాభాపరంగా ఇది దేశంలో 6వ అతిపెద్ద నగరం. ఇక్కడ బల్క్ డ్రగ్ క్యాపిటల్, బల్క్ ఐటీ ఉత్పత్తుల ఎగుమతులు సాగుతున్నాయి. అత్యధిక నికర విలువ కలిగిన వ్యక్తులు ఉన్న నగరాల్లో హైదరాబాద్ 4వ స్థానంలో ఉంది. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఎలాంటి సమస్యా లేకుండా ఇక్కడ నివసిస్తారు. అందువల్ల ఇక్కడ రియల్ ఎస్టేట్ పై ఇతర రాష్ట్రాల ప్రభావం అంతగా ఉండదు. అమరావతి విషయానికి వస్తే..

విజయవాడ, గుంటూరు మధ్య ప్రణాళికాబద్ధమైన నగరంగా దీనిని తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందించారు. ఇక్కడ ప్రపంచస్థాయి గ్రీన్ ఫీల్డ్ ను అభివృద్ధి చేయడానికి చక్కని అవకాశం ఉంది. ఈ నగర అభివృద్ధికి ఉద్దేశించిన ప్రణాళికలను అమలు చేయడం మీదనే అమరావతి అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి రెండు రాష్ట్రాలకు సంబంధించిన రంగాలు, దృక్కోణాలు వేర్వేరుగా ఉంటాయి. తెలంగాణ ఐటీ, ఫార్మా, సర్వీసెస్ లలో తన బలాన్ని పెంచుకుంటూ వెళుతోంది. ఏపీ తన సొంత స్వాభావిక బలాలపై దృష్టి పెట్టడం ద్వారా ఇతర రంగాలను అన్వేషించే అవకాశం ఉంది.

రియల్ ఎస్టేట్ పరంగా చూస్తే కొన్ని అంచనాల ప్రకారం అమరావతిలో ప్రభుత్వ, ప్రైవేటు భూములు కలిసి దాదాపు 50వేల ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం అమరావతే రాజధాని అని స్పష్టంచేసిన తర్వాత ఇక్కడ భూముల ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఈ డిమాండ్ అనేది.. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యకలాపాలు, మౌలిక వసతులపై ఆధారపడి ఉంటుంది. విభజనకు ముందు హైదరాబాద్ ఏపీకి రాజధానిగా ఉండటంతో ప్రస్తుత ఏపీకి చెందినవారు సైతం హైదరాబాద్ లోనే పెట్టుబడులు పెట్టారు. విభజన తర్వాత హైదరాబాద్ అభివృద్ధితో ఇదే కొనసాగింది. ప్రస్తుతం కొందరు ఇన్వెస్టర్లు అమరావతి వైపు చూస్తున్నా.. దీని ప్రభావం హైదరాబాద్ పై అంతగా పడే అవకాశం లేదు. ఇక్కడ కాంగ్రెస్ సర్కారు తీసుకునే చర్యలను బట్టి రియల్ వృద్ధి ఆధారపడి ఉంటుంది.

అమరావతే రాజధాని అని కూటమి సర్కారు స్పష్టం చేయడంతో అక్కడ రియల్ కు ఊపు వచ్చింది. ఈ క్రమంలోనే కొత్త సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా ఐటీ విభాగాన్ని అక్కడ పునరుద్ధరించడానికి కూటమి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఐటీ రంగం ఆకాంక్షిస్తోంది. ఐటీ కంపెనీలకు స్థలం అభివృద్ధి, హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి అంశాలతోపాటు వైజాగ్ ను ఐటీ హబ్ గా ఏర్పాటు చేయాలని కోరుకుంటోంది. అలాగే విశాఖకు సమీపంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని కూడా కోరుకుంటున్నారు.

మొత్తానికి అమరావతిని మహానగరంగా అభివృద్ధి చేయడానికి మౌలిక వసతులతోపాటు పరిశ్రమలు కూడా చాలా కీలకం. ఇక్కడ కొత్త రాజధాని అభివృద్ధిపై విపరీతమైన ఆసక్తి ఉన్నప్పటికీ, రాష్ట్రంలో వికేంద్రీకృత అభివృద్ధి నమూనా అవసరం. ఈ విషయంలో ప్రభుత్వ పాత్రే కీలకం. ముఖ్యంగా సేవా ఆధారిత పరిశ్రమలు, ఎడ్యుకేషనల్ హబ్ లు, నాలెడ్జ్ సెంటర్లను అభివృద్ధి చేయడంతోపాటు వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి అవసరమైన పెట్టుబడిదారులుతో స్నేహపూర్వక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

This website uses cookies.