Categories: TOP STORIES

హైద‌రాబాద్‌లో.. 35 % త‌గ్గిన ఫ్లాట్ సేల్స్‌

ఈ ఏడాది క్యూ1తో పోలిస్తే క్యూ2లో 18 శాతం క్షీణత

హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి

దేశంలో రియల్ జోరు కాస్త తగ్గింది. లోక్ సభ ఎన్నికల ప్రభావమో ఏమో గానీ దేశవ్యాప్తంగా ఇళ్ల అమ్మకాలు తగ్గాయి. హైదరాబాద్ సహా దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు ఈ ఏడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే ఏకంగా 18 శాతం తగ్గాయి. క్యూ1లో 1,46,194 ఇళ్లు అమ్ముడుకాగా, క్యూ2లో 1,19,901 ఇళ్లు మాత్రమే విక్రయమయ్యాయి.

గతేడాది క్యూ2లో పోలిస్తే.. విక్రయాలు పెరిగినప్పటికీ, ఈ ఏడాది త్రైమాసికాలవారీగా చూస్తే మాత్రం భారీ క్షీణత నమోదైంది. అత్యధికంగా హైదరాబాద్ లో 36 శాతం తగ్గుదల నమోదైనట్టు ప్రాప్ ఈక్విటీ వెల్లడించింది. ఈ ఏడాది క్యూ1లో హైదరాబాద్ లో 23,595 ఇళ్లు అమ్ముడుకాగా, క్యూ2లో 15,016 ఇళ్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

అనరాక్ నివేదిక ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో హైదరాబాద్ లో 15,085 ఇళ్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే.. 11 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది జూన్ త్రైమాసికంలో 13,565 ఇళ్ల విక్రయాలు జరిగాయి. దేశవ్యాప్తంగా కూడా అన్ని ప్రధాన నగరాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. గతేడాదితో పోలిస్తే తాజా త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు పెరిగినా.. ఈ ఏడాద మార్చి త్రైమాసికంతో పోలిస్తే మాత్రం తగ్గుదల నమోదైంది.

దేశవ్యాప్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ కాలంలో ఇళ్ల అమ్మకాలు గతేడాది ఇదే కాలంలో పోల్చినప్పుడు 5 శాతం పెరిగి 1,20,340 యూనిట్లుగా ఉన్నాయి. కానీ, ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో విక్రయాలు 1,30,170 యూనిట్లతో పోల్చిచూస్తే 8 శాతం తగ్గాయి.

నగరాలవారీగా చూస్తే.. ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్లో జూన్‌ త్రైమాసికంలో 16,550 యూనిట్ల ఇళ్లు అమ్ముడుకాగా, గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఒక శాతం పెరుగుదల నమోదైంది. ముంబైలో గతేడాదితో పోలిస్తే 9 శాతం వృద్ధితో 41,540 యూనిట్లు అమ్ముడయ్యాయి. బెంగళూరులో కూడా 9 శాతం వృద్ధితో 16,360 ఇళ్లు విక్రయమయ్యాయి. పుణె మార్కెట్లోనూ 2 శాతం వృద్ధితో ఇళ్ల అమ్మకాలు 21,145 యూనిట్లుగా ఉన్నాయి.

చెన్నైలో మాత్రం 9 శాతం తక్కువగా 5,020 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. కోల్‌కతాలో 20 క్షీణతతో 4,640 ఇళ్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత త్రైమాసికంలో ఇళ్లు అధికంగా అమ్ముడైనప్పుదు తర్వాతి త్రైమాసికంలో అమ్మకాలు తగ్గడం సాధారణమేనని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు. ప్రాపర్టీ ధరలు పెరగడం కూడా అమ్మకాలు తగ్గడానికి ఓ కారణమని పేర్కొన్నారు.

This website uses cookies.