Categories: TOP STORIES

ఎల్ఆర్ఎస్‌పై హైడ్రా ప్ర‌భావం?

తెలంగాణలో లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ ఎల్‌ఆర్‌ఎస్‌ పై హైడ్రా తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిప‌ల్‌ కార్పోరేషన్ పరిధిలో జరుగుతున్న హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో.. ఎల్‌ఆర్‌ఎస్‌ పై అధికారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం 25.70 లక్షల దరఖాస్తులు రాగా, ఇప్పటివరకూ కేవలం 65 వేల దరఖాస్తుల్ని ఆమోదించారు. ఈ క్రమంలో ఎల్ఆర్ఎస్ కు అర్హత లేని దాదాపు 3 లక్షల అప్లికేషన్లను అధికారులు తిరస్కరించారు. షార్ట్‌ఫాల్‌ డాక్యుమెంట్స్‌ పేరుతో మరికొన్ని ఎల్ఆర్ఎస్ ద‌రఖాస్తులను తిరస్కరించినట్లు తెలుస్తోంది.

ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులను నిశితంగా పరిశీలించి.. అవి చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్స్ లో ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించుకుంటున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఎల్ఆర్ఎస్ ద‌రఖాస్తుల పరిశీలన ఆలస్యం అవుతోంది. భవిష్యత్తులో తమకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు.. చిన్న చిన్న కారణాలతోనూ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లను రిజెక్ట్‌ చేస్తున్నారని సమాచారం. హైడ్రా కూల్చివేతల కారణంగా కొన్ని నిర్మాణాలకు అనుమతులిచ్చిన‌ అధికారులపై కేసులు న‌మోదైన నేప‌థ్యంలో.. త‌మ‌కు భ‌విష్య‌త్తులో ఇబ్బందులు త‌లెత్తుతాయ‌నే భ‌యం ప‌ట్టుకుంది. హైడ్రా ప్రభావం, అధికారుల తీరుతో సుమారుగా 40 నుంచి 50 శాతం ఎల్ఆర్ఎస్ ధరఖాస్తులు తిర‌స్కరణకు గురయ్యే అవ‌కాశ‌ముంది. అంతే కాకుండా ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా ఖజానాను నింపుకోవచ్చని భావించిన రేవంత్ సర్కార్ ఆశకు సైతం హైడ్రా గండికొడుతున్నది.

This website uses cookies.