Categories: TOP STORIES

ఎఫ్ టీఎల్, బఫర్ జోన్.. మా స్థలం ఎక్కడుంది? ఇలా చెక్ చేయండి..

మా స్థలం, ఇల్లు ఎక్కడ ఉంది?
చెరువు దగ్గరో, నాలా పక్కనో ఉంటే ఎలా?
ఎన్నో ఏండ్ల క్రితం కొనుగోలు చేశాం..
ఇంకా బ్యాంక్ లోన్ కూడా తీరలేదు..

కొత్త ప్రాజెక్టుల్లో మేం ఫ్లాట్ కొనాలా? వద్దా?
ఆ ప్రాజెక్టు స్థలం సరైందేనా?
హైడ్రా కూల్చితే ఎట్లా?

ఇలాంటి అనేక అనుమానాలు సాధార‌ణ గృహ కొనుగోలుదారుల్ని వేధిస్తున్నాయి. జిల్లాల్లోనూ హైడ్రా వంటి వ్యవస్థలను ఏర్పాటు చేసి నీటి వనరులను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. దాంతో ఔటర్ రింగ్ రోడ్డు వరకే కాదు.. ఇప్పుడీ భయం జిల్లాల్లోనూ పట్టుకున్నది. అసలీ ఎఫ్ టీఎల్, బఫర్ జోన్.. పదాలు ఏంటి? గతంలో ఉన్నవేనా? ఇప్పుడు కొత్తగా సృష్టించారా? అని సామాన్యులకు సందేహాలు మొదలయ్యాయి.

నిజానికి చెరువు నిండితే ఎక్కడి దాకా నీళ్లు వస్తాయో అక్కడి దాకా విస్తీర్ణం అన్నది అందరికీ తెలిసిందే. అదే ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్ టీఎల్) గా ప్రాచుర్యం పొందింది. దాన్ని కాపాడేందుకు ఎఫ్టీఎల్ కి ఓ వైపు కొంత మేరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా ఉండేందుకు సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం బఫర్ జోన్లను నిర్దేశించారు. భారీ వర్షాలొస్తే ఆ వరద ఎక్కడికి వెళ్లాలో అంతుచిక్కక కాలనీలను ముంచెత్తుతుంది. ఇప్పుడీ చెరువులను రక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయమే హైడ్రా రూపంలో వచ్చింది. ఈ క్రమంలో చెరువుల పక్కనే ఉన్న ఆస్తుల యజమానులకు భయం పట్టుకున్నది. తమ ఇల్లు, ఇంటి స్థలం ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందో, రాదో తెలుసుకునే మార్గాలను వెతికే పనిలో నిమగ్నమయ్యారు. అందుకే వారి ఆస్తి హైడ్రా దృష్టిలో పడుతుందా? లేదా? అనే అంశాన్ని మీరు ఇలా తెలుసుకోవ‌చ్చు.

ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ అంటే..

ఎఫ్ టీఎల్(Full Tank Level): వాటర్ స్టోరేజీ సామర్ధ్యం. చెరువు చుట్టూ ఉంటుంది.

బఫర్ జోన్(Buffer Zone): ఎఫ్ టీఎల్, నాలా సైజును బట్టి ఉంటుంది.

నాలాలు, చెరువుల మ్యాప్స్ ల్లో ఎఫ్ టీఎల్ బౌండరీస్ చూపిస్తారు. బఫర్ జోన్ కి కూడా అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన వివరాలు ఉంటాయి. విలేజ్ మ్యాప్ లో రెవెన్యూ సర్వే నంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇరిగేషన్, రెవెన్యూ రూల్ బుక్ ప్రకారం చేస్తారు.

చెరువు, కుంట, శిఖం భూములు, ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు.
హెచ్ఎండీఏ, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ పరిధిలో నదులకు ఇరువైపులా కనీసం 50 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దు.

10 హెక్టార్లు లేదా 25 ఎకరాలకు పైగా ఉండే చెరువులు, కుంటలకు 30 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది. 9 మీటర్ల కెనాల్/నాలా/వరద కాల్వ ఉంటుంది.

10 హెక్టార్ల కంటే తక్కువగా ఉండే చెరువులు, కుంటలకు కనీసం 9 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది. 2 మీటర్ల కెనాల్/నాలా/వరద కాల్వ ఉంటుంది.

హెచ్ఎండీఏ పరిధిలో చెరువు విస్తీర్ణం, ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ వంటి అన్ని వివరాలను తెలుసుకునేందుకు ఇబ్బంది ప‌డ‌క్క‌ర్లేదు. ఇలా మీరు సులువుగా క‌నుక్కోవ‌చ్చు.

https://lakes.hmda.gov.in/ ఈ వెబ్ సైట్ కి వెళ్లాలి. అందులో జిల్లా, మండలం, గ్రామం సెలెక్ట్ చేసుకోండి. ఆ ఊరిలోని అన్ని చెరువుల వివరాలు వస్తాయి.

లేక్ ఐడీ, ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ ఉంటుంది.

ఎఫ్ టీఎల్ కాలమ్ లో క్లిక్ అని బ్లూ కలర్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మ్యాప్ ఓపెన్ అవుతుంది.

అందులో ఏ మూలన ఏం ఉందో స్పష్టంగా ఉంటుంది. అక్షాంశాలు, రేఖాంశాలు కూడా నమోదు చేశారు.

ఎఫ్ టీఎల్ వరకు చెరువు విస్తీర్ణం ఎంత? పరిసరాల్లో ఏమేం ఉన్నాయో కూడా కనిపిస్తుంది. దీని ద్వారా అర్ధం చేసుకోవడం కష్టం.

ఇప్పుడు బ్యాక్ కి వచ్చి క్యాడస్ట్రల్ మీద క్లిక్ చేయండి. మళ్లీ మ్యాప్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఆ చెరువు ఏయే సర్వే నంబర్ల పరిధిలో ఉన్నదో స్పష్టంగా తెలుస్తుంది. ఆ సర్వే నంబర్లను నోట్ చేసుకోండి.

మ్యాప్ లో బ్లూ కలర్ లైన్ తో ఉన్నది ఎఫ్టీఎల్ పరిధి, దాని పక్కనే రెడ్ కలర్ తో ఉన్నదే బఫర్ జోన్. బ్లూ, రెడ్ కి మధ్య కొంతనే ఉంటుంది. అంటే 9 మీటర్లు లేదా 2 మీటర్లుగా ఉంటుంది. ఇన్ లెట్, అవుట్ లెట్ ఎటు వైపు ఉన్నదో తెలుసుకోవాలంటే త్రిభుజాకారంలో బ్లాక్ మార్క్ ఉంటుంది.

చెరువు కట్ట ఆరెంజ్ కలర్ తో ఉంటుంది. దాన్ని బట్టి చెరువుకు ఎటు వైపు మీ స్థలం ఉన్నదో చెక్ చేసుకోవడానికి మార్గం సుగమమం అవుతుంది.

హెచ్ఎండీఏ వెబ్ సైట్ ద్వారా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, మెదక్, హైదరాబాద్ జిల్లాల పరిధిలోని 2,567 చెరువుల మ్యాప్ లు అందుబాటులో ఉన్నాయి. ఐతే హెచ్ఎండీఏ పరిధిలో 3,532 చెరువులు ఉన్నాయి. ఇప్పటి వరకు 3,114 చెరువుల సర్వే పూర్తయ్యింది. కానీ మిగతావి వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయలేదు.

ఇంకా తెలుసుకోవాలంటే..

హెచ్ఎండీఏ వెబ్ సైట్ ద్వారా చెరువు, కుంట విస్తీర్ణం, ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ తెలుసుకోవచ్చు.

అందులోని సర్వే నంబర్ల ద్వారా క్లారిటీ రాకపోతే ధరణి పోర్టల్ లో కూడా మరింత క్లారిటీ పొందొచ్చు.

https://dharani.telangana.gov.in/homePage?lang=en వెబ్ సైట్ ఓపెన్ చేయండి. అగ్రికల్చర్ అని క్లిక్ చేయగానే వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. అందులో (IM8) Cadastral Maps క్యాడస్ట్రల్ మ్యాప్స్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి.

Click Here to Continue ని క్లిక్ చేయండి.

జిల్లా, డివిజన్, మండలం, గ్రామం సెలెక్ట్ చేయండి. ఇప్పుడు హెచ్ఎండీఏ వెబ్ సైట్ మ్యాప్ నుంచి సేకరించిన చెరువుకు సంబంధించిన సర్వే నంబర్లను జూమ్ చేసి చూడొచ్చు.

అలాగే ధరణి పోర్టల్ లో ప్రొహిబిటెడ్ జాబితాలోనూ ఆ సర్వే నంబర్లు చూసి మరింత క్లారిటీ తెచ్చుకోవచ్చు.

హెచ్ఎండీఏ, ధరణి వెబ్ సైట్ల ద్వారా పొందిన వివరాలతో మీ స్థలం ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. మ్యాప్ లో కో ఆర్డినేట్స్ కూడా ఉన్నాయి. వాటి సాయంతో మీరు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఉన్నారా? లేదా? అన్న విషయాన్ని చెక్ చేసుకునే వీలుంది. సర్వే నంబర్లు తెలుసుకున్న తర్వాత మీ సేల్ డీడ్ ని పరిశీలించండి. ఆ తర్వాత అక్షాంశాలు, రేఖాంశాలతో సెర్చ్ చేయండి. ఎఫ్ టీఎల్ నుంచి మీ స్థలం ఎంత దూరంలో ఉందో చెక్ చేసుకోండి.

This website uses cookies.