poulomi avante poulomi avante

111 జీవో ప్రాంతం హైడ్రా పరిధిలోకి తెస్తే ఎలా?

  • అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్న హైడ్రా..
  • హైడ్రాకు మరిన్ని అధికారులు కట్టబెట్టే ప్రయత్నం
  • ప్రశ్నార్ధకంగా 111 జీవో పరిధిలో 25 వేల కట్టడాలు?

హైడ్రా.. ఇప్పుడు ఈ పేరు వింటే అక్రమార్కుల గుండెల్లోనే కాదు సామాన్యుల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలపై కొరడా ఝ‌ళిపిస్తూ.. ఓవైపు హైడ్రా అందరి ప్రశంసలు అందుకుంటోంది. దీంతో హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడంతో పాటు పరిధిని కూడా పెంచాలన్న డిమాండ్ పెరుగుతోంది. అందుకు అనుగుణంగానే ట్రిపుల్ వన్ జీవో ప్రాంతాన్ని సైతం హైడ్రా పరిధిలోకి తీసుకు రావాలన్న యోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే గనుక జరిగితే 111 జీవో పరిధిలో నిర్మించిన వేలాది నిర్మాణాల భవితవ్యం ఏంటన్న ఆందోళన నెలకొంది. ఇదే సమయంలో సామాన్యులపై ప్రతాపం చూపిస్తుండగా హైడ్రా విమర్శలను ఎదుర్కొంటోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎవరి నోట విన్నా హైడ్రా పేరే వినిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా ఝులిపిస్తోంది. మరీ ముఖ్యంగా చెరువులను, నాలాలను, ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టిన క‌ట్ట‌డాల‌ను నేల‌మ‌ట్టం చేస్తోంది. సామాన్యుల నుంచి బడాబాబుల వరకు ఎవరు ఆక్రమణలకు పాల్పడినా హైడ్రా కఠిన చ‌ర్య‌ల్ని తీసుకుంటోంది.

దీంతో చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేసిన వారి గుండెల్లో దడ పుడుతోంది. ఆక్రమణలకు పాల్పడిన వారి వెన్నులో వణుకు పుట్టిస్తున్న హైడ్రా హైదరాబాద్ లో చెరువులు, పార్కు స్థలాలు ఆక్రమించి 18 చోట్ల చేపట్టిన 166 నిర్మాణాలను పడగొట్టి 43 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. అంతేకాదు జూబ్లీహిల్స్, మాదాపూర్‌ వంటి ఖరీదైన ప్రాంతంలో వందలాది నిర్మాణాలకు హైడ్రా నోటీసుల్ని జారీ చేసింది.

హైడ్రాకు రోజు రోజుకు హైదరాబాద్ తో పాటు తెలంగాణవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా తమ తమ ప్రాంతాల్లో సైతం హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసి చెరువులను, ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను కాపాడాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. అంతే కాదు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, దేశ రాజధాని ఢిల్లీలో సైతం హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వస్తోందంటే హైడ్రా ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఈ పరిణామాల నేపథ్యంలో హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడంతో పాటు హైడ్రా పరిధిని కూడా పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ట్రిపుల్ వన్ జీవో ప్రాంతాన్ని కూడా హైడ్రా పరిధిలోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఇదే గనుక జరిగితే 111 జీఓ ప్రాంతంలో అక్రమంగా నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన వేలాది నిర్మాణాల పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది.

హైదరాబాద్ జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ చెరువుల క్యాచ్మెంట్ ఏరియా నిర్మాణాలపై ట్రిపుల్ వన్ జీవో రూపంలో కఠినమైన ఆంక్షలున్నాయి. 1996లో సమైఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 111 ప్రకారం.. భవనాల నిర్మాణాలపై పలు ఆంక్షల్ని విధించింది. 111 జీవో పరిధిలోని మొత్తం 84 గ్రామాలు, 10 చదరపు కిలోమీటర్ల పరిధి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలెమెంట్ అథారిటీ కిందికి వస్తుంది. 2007లో స్పెషల్ మెమో ద్వారా 500 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు.

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువుల బఫర్ జోన్ 30 అడుగులు. ఈ చెరువుల‌కు 100 మీటర్ల వరకు గ్రీన్-రిక్రియేషన్ జోన్ ఉంటుంది. అంతేకాకుండా నిషేధిత జోన్ 500 మీటర్ల వరకు విధించారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువుల దిగువ భాగంలో కిలోమీటర్ తర్వాత‌ నిబంధనల మేరకు జి ప్లస్ 2 నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ ఈ నిబంధనలన్నింటికి పాతరేసి సుమారు 135 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న ట్రిపుల్ వన్ జీవో పరిధిలోని దాదాపు 25 వేలకు పైగా నిర్మాణాలను చేపట్టారని అంచనా.

మరోవైపు ట్రిపుల్ వన్ జీవో పరిధిలో అత్యధికంగా సామాన్యుల నిర్మాణాలే ఉన్నాయని తెలుస్తోంది. 80 శాతం మధ్య తరగతి వారు ఇళ్లను నిర్మించుకోగా, 20 శాతం రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన బిల్డర్లు భారీ నిర్మాణాలను చేపట్టారు. అందుకే ఒకవేళ‌ ప్రచారం జరుగుతున్నట్లు ట్రిపుల్ వన్ జీవోను హైడ్రా పరిధిలోకి తీసుకొస్తే మాత్రం.. సామాన్యుల నిర్మాణాల విషయంలో హైడ్రా నిబంధనలను సడలించే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. మరి ఏ మేరకు 111 జీవో ను రేవంత్ సర్కార్ హైడ్రా పరిధిలోకి తీసుకొస్తుంది.. అదే జరిగితే సామాన్యుల నిర్మాణాలపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ముందు ముందు తేలాల్సి ఉంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles