poulomi avante poulomi avante

అక్రమార్కుల భరతం పట్టే వరకు విశ్రాంతి లేదు

  • అక్రమ కట్టడాలపై కొరడా ఝుళిపిస్తున్న హైడ్రా
  • గ్రేటర్ సిటీలో 42 చోట్ల నిర్మాణాల కూల్చివేత‌
  • 224 అక్రమ కట్టడాలను నేలమట్టం చేసిన హైడ్రా
  • 78 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా
  • 120 ప్రధాన చెరువుల పరిరక్షణే లక్ష్యంగా రంగనాథ్‌

హైదరాబాద్ లో చెరువులు, నాలాలను ఆక్రమించి అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్న వారిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా గుబులు రేపుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు, కుంటల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మించిన అక్రమ కట్టడాలను, పెద్ద భవంతులను ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తోంది. ఇందులో భాగంగానే హీరో నాగార్జుకు చెందిన ఎన్ కన్వెన్షన్‎ను హైడ్రా కూల్చివేసింది. అక్కడ్నుంచి ఎక్కడా వెనకడుగు వేయకుండా బుల్డోజర్ తో జెట్ స్పీడ్ తో హైడ్రా ముందుకు వెళుతోంది.

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా చెరువులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన ఏ ఒక్కరిని హైడ్రా వదలడం లేదు. బుల్డోజర్లతో గంటల్లోనే భారీ బిల్డింగులను సైతం నేలమట్టం చేస్తోంది. అక్ర‌మ‌ నిర్మాణాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చెరువులను కబ్జాలు చేసి కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటా అంటే కుదరదని హెచ్చరిస్తున్నారు. కోర్టులకు వెళ్లి స్టే లు తెచ్చుకునే సమయం కూడా ఇవ్వకుండా.. అక్ర‌మ‌ నిర్మాణాలను 2,3 గంటల్లో హైడ్రా కూల్చేస్తోంది. లోటస్ పాండ్ నుంచి మొదలైన హైడ్రా అక్రమ కట్టడాల కూల్చివేతలు, రాజేంద్ర నగర్, హయత్ నగర్, బంజారాహిల్స్, ఫిలిం నగర్, గాజులరామారం, అమీర్ పేట్ నాలా, నందగిరి హిల్స్, చందానగర్, బాచుపల్లి, ఖానాపూర్, చిల్కూర్, మాదాపూర్, గండిపేట్, ఎన్ కన్వెన్షన్, ఆ తరువాత రామ్ నగర్, గగన్ పహాడ్, మియాపూర్, శేర్లింగంపల్లి, మదీనగూడ , నిజాంపేట ఇలా చాలా ప్రాంతాల్లో పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కాకుండా చుట్టు పక్కల ఉన్న గ్రామాల్లో కబ్జాలకు గురైన చెరువులు, నాలాలపై హైడ్రా ప్రత్యేకంగా దృష్టి సారించింది. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలంలోని పలు అక్రమ క‌ట్ట‌డాల‌ను తహశీల్దార్ రాధా, హైడ్రా అధికారులు దగ్గరుండి కూల్చివేయించారు. ఐలాపూర్ గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ 119, 121లో అక్రమ వెంచర్ వెంచర్ ఏర్పాటు చేసి నిర్మాణాలు చేపట్టగా వాటిని హైడ్రా కూల్చేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని సాకి చెరువును పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.. చెరువులో 18 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. సామాన్య ప్రజలు నిర్మించుకున్న ఇండ్ల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు కమిషనర్ రంగనాథ్ సూచించారు.

అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్ 462 లోని ప్రభుత్వ భూమిలో.. ప్యూజియన్ ప్రైవేటు స్కూల్ ను హైడ్రా ఆదేశాలతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. సర్వే నెంబర్ 462లో గల ప్రభుత్వ భూమిలోని 17 గుంటల్లో నిర్మించిన స్కూల్ గేటు, రూమ్స్, గ్రౌండ్ ను జేసీబీలతో కూల్చివేశారు. ఇక చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్ల‌లో నిర్మాణాలు చేపట్టిన వారిపై మియాపూర్ పీఎస్ లో ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు. ఈ మేరకు వైశాలీ నగర్ ఈర్ల చెరువు బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టారని స్వర్ణలత, కృష్ణ కిషోర్ల పై ఇరిగేషన్ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ అపార్ట్ మెంట్ లను హైడ్రా అధికారులు గంటల్లోనే నేలమట్టం చేశారు. నిజాంపేట్ ఎర్రకుంటలో అక్రమ నిర్మాణాలు చేపట్టాడని మ్యాప్స్ ఇన్ఫ్రా ఎండి సుధాకర్ రెడ్డిపై ఇరిగేషన్ శాఖ అధికారులు బాచుపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేయగా.. ఈ నిర్మాణాలను పరిశీలించి హైడ్రా అధికారులు కూల్చేశారు.

హైడ్రాకు తోడు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్, రెవెన్యూ శాఖలు సైతం రంగంలోకి దిగాయి. ఈ క్రమంలోనే దుర్గం చెరువులోని కాలనీల్లోని అక్రమ కట్టడాలపై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలోని 204 ఇళ్లకు ఇటీవల జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులిచ్చారు. హైటెక్‌ సిటీలోని రాయదుర్గం, మాదాపూర్‌ పరిధిలో దుర్గం చెరువు చుట్టూ వందలాది విలాసవంతమైన భవనాల్ని నిర్మించారు. ఇందులో తెలంగాణ సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు కూడా ఉంది. తాజాగా హైడ్రా అధికారులు ఈ అక్రమ నిర్మాణదారులందరికి నోటీసులిచ్చారు. దీంతో హైడ్రా, ప్రభుత్వం ఎవ్వరికి అతీతం కాదని చెప్పకనే చెబుతోంది.

జులై 27 నుంచి అక్రమ కట్టడాలను కూల్చేస్తున్న హైడ్రా ఇప్పటివరకూ సుమారు 42 చోట్ల చెరువులు, నాలాలను ఆక్రమించి నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చేసింది. ఇప్పటి వరకు మొత్తం 224కి పైగా అక్రమ నిర్మాణాలను నేమట్టం చేసినట్లు తెలుస్తోంది. చెరువులను ఆక్రమించి, నాలాలను కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాల్ని కూల్చడం ద్వారా ఇప్పటివరకూ హైడ్రా దాదాపు 78 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుందని అధికారిక వర్గాల సమాచారం. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్లో సుమారు 120 చెరువుల పరిసరాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలకు సంబందించి సర్వే నిర్వహిస్తున్న హైడ్రా.. ఆ నిర్మాణదారులందరికి నోటీసులు జారీ చేసేందుకు సిద్దమవుతోందని తెలుస్తోంది. దీన్ని బట్టి ముందు ముందు హైదరాబాద్ లోని వందలాది అక్రమ నిర్మాణాలు నెలమట్టం కానున్నాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక బాధ్య‌త‌ అప్పగించనున్న‌ది. హెచ్ఎండిఎ పరిధిలోని చెరువుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన కమిటీకి ఛైర్మన్‌గా రంగనాథ్‌ను నియమిస్తున్న‌ట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ పరిధిలోని 7 జిల్లాల్లో ఉన్న చెరువులను పరి రక్షించే బాధ్యతలను కూడా హైడ్రాకు అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. అదే గనుక జరిగితే అక్రమ కట్టడాల విషయంలో హైడ్రా మరింత దూకుడుగా ముందుకెళ్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles