- రియల్ ఎస్టేట్ గురుతో
- బుట్ట బొమ్మా.. బుట్ట బొమ్మా.. అర్మాన్ మాలిక్
సంగీతమే అతడి శ్వాస.. పాటలే ప్రాణం.. ఎక్కడున్నా అతడి హృదయం సరిగమల చుట్టూనే తిరుగుతుంటుంది. అతడే ప్రముఖ గాయకుడు, పాటల రచయిత అర్మాన్ మాలిక్. ‘బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా’ పాటతో మనకూ సుపరిచితుడే. పుట్టింది ముంబైలోనే అయినా.. అర్మాన్ తల్లి తెలుగు మహిళ కావడంతో అతడికి హైదరాబాద్ తోనూ చక్కని అనుబంధం ఉంది. మరి అర్మాన్.. తన కలల గృహం ఎలా ఉండాలని అనుకుంటున్నాడు? ఈ విషయంలో తన అభిరుచులు ఏమిటనేది రియల్ ఎస్టేట్ గురుతో పంచుకున్నాడు.
నిత్యం సంగీత సాగరంలో మునిగితేలే అర్మాన్ కు.. కలల గృహంపై విభిన్నమైన ఆలోచనలు ఉన్నాయి. తన కలల నివాసం చాలా విశాలంగా ఉండాలన్నదే అతడి అభిలాష. తన మదిలో ఉన్న ప్రేమనంతా అందులో నింపేస్తానంటున్నాడు. ముంబై, హైదరాబాద్ లోని తన తల్లిదండ్రుల మూలాలను ప్రతిబింబించేలా ఇంటిని డిజైన్ చేసుకుంటా అని మనసులో మాట బయటపెట్టాడు.‘ముందుగా లాన్ తో ప్రారంభిద్దాం. నా పెంపుడు శునకం ఎలాంటి అడ్డంకులూ లేకుండా తనకు కావాల్సినంత దూరం పరిగెట్టేంత లాన్ ఉండాలి.
ఇక అద్దంలాంటి ఈతకొలను ఉంటే ఆ మజాయే వేరు. ఎందుకంటే నీటిలో ఆడుకోవడం భలే సరదా నాకు. ఆ పక్కనే టెన్నిస్ కోర్టు లేదా ఫుట్ బాల్ ఆడటానికి వీలుగా చిన్న మైదానం ఉండాలి’ అని అర్మాన్ తన అభిరుచులు వెల్లడించాడు. ప్లే స్టేషన్ అంటే పిచ్చి అభిమానం కలిగిన ఈ సైమా అవార్డు విజేత.. అంతటితో ఆగిపోలేదు. తన డ్రీమ్ హోమ్ లో తప్పనిసరిగా గేమ్స్ కోసం ఒక గది ఉండాల్సిందేనని స్పష్టం చేశాడు. ‘సంగీతమే ప్రాణంగా బతికే నేను.. నా హోం స్టూడియోలోనే ఎక్కవ సమయం ఉంటా. ఇది చాలామందికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ అక్కడ నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది నన్ను సంగీతంతో మరింత మమేకం చేస్తుంది’ అని వివరించాడు.
లాస్ ఏంజిల్స్‌లో విశాలమైన స్థలంలో నిర్మించిన ఇల్లు ఒక విధంగా అతడి దీర్ఘకాలిక స్వప్నాన్ని కొంతవరకు నెరవేర్చింది. తాను కళాకారుడు కావడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుందని.. ఫలితంగా ముంబైలోని తన ఇంటిని, తల్లిదండ్రులు, సోదరుడు, పెంపుడు శునకాన్ని మిస్ అవుతుంటానని చెప్పాడు. ఇక లాస్ ఏంజిల్స్ లో వాతావరణం చాలా బాగుటుందని, ఎల్లప్పుడూ ఎండ ఉంటుందని తెలిపాడు. అర్మాన్ చల్లగా లేని ప్రాంతాలనే ఎక్కువ ఇష్టపడతాడు. అలాంటి వాతావరణంలో అయితే హాయిగా గడపొచ్చనేది అతడి అభిప్రాయం. అర్మాన్ కు ఇష్టమైన అలాంటి వాతావరణం అమెరికా తూర్పుతీరంలో ఉంది. అక్కడ తన డ్రీమ్ ల్యాండ్ ను నిర్మించడానికి ఆ వాతావరణమే ప్రధాన కారణమని వెల్లడించాడు. తనకు అన్ని విధాలా అనుకూలంగా ఉండటంతోనే లాస్ ఏంజిల్స్ పై మనసు పారేసుకున్నట్టు వివరించాడు.
చివరగా తన కలల సౌధానికి సంబంధించి నాలుగు ప్రధాన అంశాలు వెల్లడించాడు.. ‘ఇంట్లో మనం ఏర్పాటుచేసుకున్న ఫర్నిచర్ కంటే అక్కడి వాతావరణ ముఖ్యం. ఇక వినోదం కోసం ఒక ఫన్ జోన్ ఉండాలి. నోరూరించే ఆహారం తినడానికి వీలుగా మంచి మాడ్యులర్ కిచెన్. అందాలను ఆస్వాదించేందుకు చక్కని వ్యూ.. చివరగా సేద తీరడానికి అనువైన ఆవరణ ఉండాలి’ అని ముగించాడు.