కింగ్ జాన్సన్ కొయ్యడ: ట్రిపుల్ జీవో ఎత్తివేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనతో డెవలపర్లలో ఒక్కసారిగా భయం ఏర్పడింది. ఇప్పటికే పశ్చిమ హైదరాబాద్‌లో ప్రాజెక్టుల్ని ఆరంభించిన వారిలో గుబులు కలుగుతోంది. కోకాపేట్ నియోపోలిస్‌లో భూముల వేలం తర్వాత.. ఒక్కసారిగా స్థలాల ధరలు పెరిగాయి. పెరిగిన రేటు చొప్పున డెవలపర్లు ఆకాశహర్మ్యాలు, బహుళ అంతస్తుల్ని ఆరంభించారు. పలు కొత్త ప్రాజెక్టులు ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, హఠాత్తుగా 1.32 లక్షల ఎకరాల భూమి కొత్తగా అందుబాటులోకి వస్తే.. ప్రస్తుత ప్రాజెక్టులపై ఎలాంటి ప్రభావం పడుతుంది? కొనుగోలుదారులు సొంతిల్లు కొనుక్కోవడం.. పెట్టుబడిదారులు మదుపు చేయడం కొంతకాలం నిలిపివేస్తారా? 111 జీవోపై స్పష్టత ఏర్పడిన తర్వాతే అడుగు ముందుకేస్తారా? అసలీ నిర్ణయం కోర్టుల ముందు నిలబడుతోందా? ఇలా రకరకాల సందేహాలు డెవలపర్లను పట్టి పీడిస్తోంది.
ప్రభుత్వం నిర్వహించిన వేలం పాటల పుణ్యమా అంటూ.. కోకాపేట్, నార్సింగి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పొప్పాల్ గూడ, నానక్‌రాంగూడ వంటి ప్రాంతాల్లో ఎకరం ధర రూ.20 నుంచి 45 కోట్లకు చేరింది. తెల్లాపూర్, కొల్లూరు, వెలిమల వంటి ప్రాంతాల్లోనూ రేటు పెరిగింది. అధిక రేటు పెట్టి భూముల్ని కొని.. చాలామంది డెవలపర్లు బహుళ అంతస్తుల భవనాలు, ఆకాశహర్మ్యాల్ని ఆరంభించారు. దీంతో, ఫ్లాట్ల సరఫరా అధికమైంది. దారుణమైన విషయం ఏమిటంటే.. ఏవో ఒకట్రెండు ప్రాజెక్టుల్ని మినహాయిస్తే.. ఈమధ్య అమ్మకాలు దారుణంగా పడిపోయాయి.
ఈ క్రమంలో ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేస్తే ఆకాశహర్మ్యాలు, విల్లాల్ని కొనేందుకు ముందుకొచ్చేదెవరని చాలామంది బిల్డర్లు భయపడుతున్నారు. ప్రస్తుతం కోకాపేట్ వంటి ప్రాంతాల్లో ఫ్లాట్ కొనాలంటే చదరపు అడుక్కీ సుమారు 8 నుంచి పది వేలు దాకా అవుతుంది. అదే, కొంతకాలం వేచి చూస్తే.. ట్రిపుల్ జీవోను ఎత్తివేస్తే.. ఆయా ప్రాంతాల్లో స్థలాల ధరలు తగ్గుతాయి. ఆ రేటుకు అపార్టుమెంట్లను ఆరంభిస్తే.. తక్కువ రేటుకే ఫ్లాట్లు లభిస్తాయి.
అందుకే, ప్రస్తుతం కొనుగోలును వాయిదా వేసేవారి సంఖ్య పెరిగే అవకాశముంది. ట్రిపుల్ జీవో ఎత్తివేసి, దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించి, వినియోగంలోకి తేవడానికి ఎంతలేదన్నా ఒకట్రెండేళ్లు పడుతుంది. దీనిపై స్పష్టత వచ్చేంత వరకూ పెట్టుబడిదారులు ముందుకొచ్చే పరిస్థితి ఉండదు. కోకాపేట్‌లో ఎకరం 40 కోట్లు పెట్టడం కంటే.. కాస్త ముందుకెళితే 10 కోట్లకే భూములు వస్తుంటే.. మదుపరులు అక్కడే పెట్టుబడి పెడతారు కదా! వీరంతా కావాలంటే కొంతకాలం వేచి చూడటానికైనా సిద్ధపడతారు.
ఇప్పటివరకూ పశ్చిమ హైదరాబాద్‌లో స్థలయజమానులు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగింది. ఒకరకంగా చెప్పాలంటే, ఈ మహానుభావులే నిర్మాణ రంగాన్ని నిర్వీర్యం చేశారు. అపార్టుమెంట్లను కట్టేందుకు ముందుకొచ్చే బిల్డర్లను.. 30 అంతస్తులు కడతారా? 40 అంతస్తులు నిర్మిస్తారా? అంటూ ప్రశ్నించేవారు. తక్కువ స్థలంలో ఎక్కువ విస్తీర్ణం కడితేనే స్థలం అమ్ముతానంటూ లేదా డెవలప్‌మెంట్‌కి ఇస్తానంటూ మాట్లాడేవారు. అడ్డూఅదుపు లేని వీరి ఆగడాలకు ఇకనైనా కొంత అడ్డుకట్ట పడుతుంది. కొత్తగా వేల ఎకరాలు అందుబాటులోకి వస్తే.. రియల్ రంగానికి ఒక రకంగా ప్రయోజనమేనని చెప్పొచ్చు. స్థలం లభ్యత పెరిగితే.. ఆటోమెటిగ్గా భూముల ధరలూ తగ్గుతాయి. కాబట్టి, రానున్న రోజుల్లో అందుబాటు గృహాలు, మధ్యతరగతి ప్రజానీకానికి అక్కరకొచ్చేలా ఇళ్ల నిర్మాణం పెరుగుతుంది. కోకాపేట్‌లో స్థల లభ్యత తక్కువ, భూమి రేటెక్కువ కాబట్టి, డెవలపర్లకు ఆకాశహర్మ్యాలు కడితే తప్ప గిట్టుబాటు కాని పరిస్థితి ఏర్పడింది. ట్రిపుల్‌వన్ జీవో ఎత్తివేస్త స్థలాల లభ్యత గురించి పెద్దగా చింతించక్కర్లేదు.
ఇప్పటికే నగరమంతటా కాంక్రీటు జంగిల్లా మారింది. నగరం నడిబొడ్డులో పచ్చదనం కరువైంది. నిన్నటి వరకూ రోడ్డు మధ్యలో చెట్లు ఉండేవి. మెట్రో రైలు పుణ్యమా అంటూ వాటిని నరికివేశారు. ఆయా మార్గంలో పచ్చదనాన్ని పెంపొదిస్తామన్న మాటను మెట్రో రైలు ఎప్పుడో మర్చిపోయింది. హైదరాబాద్‌ను ఇప్పటివరకూ కాపాడుతుందీ 1.32 లక్షల ఎకరాల ఖాళీ స్థలమే. నగర ప్రజల దాహార్తిని తీర్చిన జంట జలాశయాలు ఇప్పుడు అక్కర్లేదని సీఎం మాటలు విని.. సగటు హైదరాబాదీయులు సోషల్ మీడియాలో విరుచుకు పడుతున్నారు. పర్యావరణవేత్తలు కోర్టుల్లో కేసులు వేసేందుకు సిద్ధమవుతున్నారు. 111 జీవో ఎత్తివేత అంత సులువేం కాదని కొట్టి పారేస్తున్నారు. మరోవైపు, ప్రభుత్వం కూడా 111 జీవో ఎత్తివేతకు సంబంధించి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని నిర్ణయించింది. 111 జీవో ఎత్తివేత గురించి నిర్మాణ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి తమ నిర్ణయాన్ని వెల్లడించాలి. సీఎం ప్రకటనను ట్రెడా, క్రెడాయ్ తెలంగాణలు స్వాగతించాయి.
ట్రిపుల్ జీవోను ఎత్తివేయాలని సీఎం కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆయన గతంలో కోరుకున్నట్లే సామాన్యులు సొంతిల్లు కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది. భూముల ధరలు ఆకాశాన్నంటి.. స్థలయజమానుల అత్యాశ.. పెరిగిన నిర్మాణ సామగ్రి ధరల వల్ల.. ప్రజలకు తక్కువ ధరలో ఫ్లాట్లను అందించలేని దుస్థితి ఏర్పడింది. భూముల ధరలు పెరిగినంతగా.. ఉద్యోగుల జీతాలు పెరగట్లేదు. అందుకే, వీరంతా యూడీఎస్ బిల్డర్ల చేతికి చిక్కి అన్యాయం అవుతున్నారు. ఇప్పుడు వేల ఎకరాలు అభివృద్ధిలోకి వస్తే.. భూముల ధరలు తక్కువగా ఉండటం వల్ల.. నామమాత్రపు ధరకే ఫ్లాట్లను కొనుగోలుదారులకు ఇవ్వగల్గుతాం. – ఇంధ్రసేనారెడ్డి, సెక్రటరీ జనరల్, క్రెడాయ్ తెలంగాణ
(నేను షేర్ చేసిన చెరువుల బొమ్మ పెట్టి ఈ బుల్లెట్ పాయింట్లు పెట్టు)
This website uses cookies.