Categories: TOP STORIES

రియాల్టీ జోరుకు అడ్డంకులివే

భారతీయ రియల్ ఎస్టేట్ అనేది అతిపెద్ద, ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన రంగాల్లో ఒకటి. అత్యధిక మందికి ఉపాధి కలిగించే వాటిలో మన రియల్ రంగం దేశంలోనే రెండోది. దేశ జీడీపీలో దీని వాటా 13 శాతం కావడం విశేషం. అలాంటి రంగానికి కోవిడ్ రూపంలో తీవ్రమైన ఒడుదొడుకులు ఎదురయ్యాయి. అప్పటినుంచి ఎన్నో కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. కరోనా ప్రారంభ సమయంలో రియల్ రంగం పూర్తిగా కుదేలైంది. మార్కెట్ వాటి కొత్త కనిష్ట స్థాయికి తగ్గడంతోపాటు నిర్మాణ కార్మికులు సొంతూళ్లకు తిరిగి వెళ్లిపోవడంతో పలు ప్రాజెక్టులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. అయితే, 2021 ప్రారంభం నుంచి క్రమంగా గాడిన పడి, కోవిడ్ ముందు స్థాయికి తిరిగి వెళ్లినప్పటకీ, ఈ రంగం పూర్తిస్థాయిలో ముందుకెళ్లకుండా ఇంకా కొన్ని సవాళ్లు అడ్డుపడుతున్నాయి.

లాక్ డౌన్ సమయంలో డెవలపర్లు, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లు వినియోగదారులను చేరుకోవడానికి సాంకేతికతను పూర్తిగా ఉపయోగించుకున్నారు. అమ్మకాలు పెంచడానికి ప్రత్యేక ఆఫర్లతో పాటు రాయితీలు కూడా ప్రకటించారు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలు సైతం రియల్ రంగం మళ్లీ గాడిన పడటానికి ఉపయోగపడ్డాయి. అయితే, ఈ రంగం పూర్వ వైభవం సంతరించుకునే చేయడానికి ఇవన్నీ ఇతోథికంగా దోహదపడినప్పటికీ, దేశంలో పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్లు తీర్చడానికి రియల్ రంగానికి మరింత ప్రోత్సాహం తో పాటు సరైన వ్యూహాలు అవసరమే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ మెట్రో నగరాలపైనే రియల్ ఎస్టేట్ ప్రధానంగా దృష్టి సారించిందని, చిన్న నగరాల్లో సైతం కార్యకలాపాలు విస్తరిస్తేనే ఈ రంగం మరింతగా దూసుకెళ్తుందని అంటున్నారు.

రియల్ వృద్ధికి ఇవే అడ్డంకులు..

అమ్ముడుపోని ఇన్వెంటరీ: నిజానికి ఇది కరోనా మహమ్మారి వల్ల వచ్చిన సమస్య కాదు. ఇటీవల వచ్చిన ఓ నివేదిక ప్రకారం.. భారత్ లో విక్రయించని ఇన్వెంటరీని అమ్మడానికి దాదాపు 3.3 సంవత్సరాలు పడుతుందని అంచనా. కరోనా మహమ్మారి షాక్ కు ఇది అదనం అన్నమాట. డెవలపర్లు ఎదుర్కొంటున్న ప్రాథమిక సవాల్ ఇది. పాత ఇన్వెంటరీని లిక్విడేట్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో డెవలపర్లు ఆ ఇన్వెంటరీలను అధిక మొత్తం తగ్గించి విక్రయించే అవకాశం ఉంది. అంటే ఆస్తి విలువ తగ్గి, రియల్ రంగానికి భారీ నష్టాలను మూటగడుతుంది. నిలిచిపోయిన ప్రాజెక్టులు, అమ్ముడుపోని ఇన్వెంటరీ గత నాలుగైదు ఏళ్లుగా రియల్ పరిశ్రమకు ప్రధాన అడ్డంకిగా మారాయి.

ప్రభుత్వ మద్దతు లేకపోవడం: రియల్ ఎస్టేట్ రంగానికి మద్దతుగా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. నిధుల చొప్పించడం, రాయితీలు, కొత్త పథకాలు ప్రవేశపెట్టడం వంటి కార్యక్రమాలు అమలు చేసింది. అయితే, సర్కారు నుంచి మరింత మద్దతు అవసరం. రియల్ ఎస్టేట్ పరిశ్రమకు మౌలిక సదుపాయాల హోదా కల్పించడాన్ని పరిగణించాలి. అలాగే సింగిల్ విండో క్లియరెన్సులు ప్రవేశపెట్టడం, సులభంగా ఫైనాన్స్ లభ్యత చేకూర్చడం, జీఎస్టీ రేట్లను తగ్గించడం ద్వారా ఎక్కువ మంది వినియోగదారులు ప్రాపర్టీలు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చేలా చేయవచ్చు. అదే సమయంలో గృహ రుణాలపై ఇస్తున్న రూ.2 లక్షల పన్ను రాయితీని పెంచాల్సిన అవసరం కూడా ఉంది. జీఎస్టీ ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ ను తిరిగి ప్రవేశపెట్టాలి.

అసంపూర్తిగా ఉన్న ఇన్వెంటరీ: నిలిచిపోయిన 1600 ప్రాజెక్టులకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం రూ.25వేల కోట్ల బడ్జెట్ ప్రకటించినప్పటికీ, ఆయా ప్రాజెక్టుల్లో పురోగతి పెద్దగా లేదు. ఇప్పటికీ 4.58 లక్షల అసంపూర్తి యూనిట్లను పూర్తి చేయడంలో విఫలమైంది. ప్రత్యేకించి చిన్న నగరాలు, పట్టణాల్లో కార్మికులు, ముడి పదార్ధాలు, మౌలిక వసతుల కొరత వంటి సమస్యలతో డెవపర్లు సతమతమవుతున్నారు. ఇది అసంపూర్తి ఇన్వెంటరీని పూర్తి చేయడానికి అవరోధాలుగా మారాయి.

డెవలపర్ల మూలధనం మొత్తం ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి వెచ్చిస్తుండటంతో వారు కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టడానికి లేదా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి చూడటం లేదు. ఈ పరిణామాలన్నీ రియల్ రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ జీఎస్టీ రేట్లు అమల్లోకి తేవడంతో పాటు విక్రయాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న నగరాల్లో కూడా విలాసవంతమైన గృహాలను ప్రోత్సహిస్తే, రాబోయే కాలంలో ఈ రంగం వృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొంటున్నారు.

This website uses cookies.