సాధారణంగా తప్పు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేస్తారు. న్యాయస్థానాలు అయినా తప్పు చేసినవారికే శిక్షను విధిస్తుంటాయి. కానీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. అపార్టుమెంట్ కట్టిన బిల్డర్‌ని వదిలేసి.. అందులో నివసించేవారి మీద పాతిక శాతం అధికంగా ఆస్తి పన్నును విధిస్తుంది. అక్రమంగా కట్టిన నిర్మాణాల్ని, అనుమతుల్లేకుండా నిర్మించిన వారి మీద జరిమానా విధించొచ్చు గాక. జీవో నెం. 86 రాక ముందు, అంటే 2006 కంటే ముందు పాత జీవో ప్రకారం.. కట్టిన అపార్టుమెంట్లు, బహుళ అంతస్తుల భవనాల నుంచి పాతిక శాతం అదనంగా ఆస్తి పన్ను వసూలు చేయడం దారుణమైన విషయమని బాధితులు వాపోతున్నారు.
2006 కంటే ముందు శివారు ప్రాంతాలన్నీ హుడా పరిధిలోకి వచ్చేవి. ఆతర్వాత వాటన్నింటినీ ఎంసీహెచ్‌లోకి కలిపేశారు. దీంతో, కొత్తగా జీహెచ్ఎంసీ అవతరించింది. మిగతా ప్రాంతాల్లో హెచ్ఎండీఏ పరిధిలోకి తెచ్చారు. ఇంతవరకూ బాగానే ఉంది. పాత హుడా పరిధిలోకి వచ్చే అపార్టుమెంట్లకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేదని గుర్తించి.. గత కొంతకాలం నుంచి ఆస్తి పన్నులో పాతిక శాతం జరిమానా విధించడం ఆరంభించారు. ఆయా అపార్టుమెంట్లను కట్టేటప్పుడు లంచాలకు మరిగిన మున్సిపల్ అధికారులు కళ్లు మూసుకున్నారు.
బిల్డర్లు ఎంచక్కా ప్రాజెక్టులో నుంచి వెళ్లిపోయేంత వరకూ నిద్రపోయారు. ఆమ్యామ్యాల మత్తులో నిద్రపోతున్నట్లు కొందరు నటించారు. కొంతకాలం నుంచి ఆయా ప్రాజెక్టుల్లో నివసించేవారి నుంచి ఆస్తి పన్నులో 25 శాతం జరిమానా వసూలు చేస్తున్నారు. కారణం ఏమిటంటే.. ఆయా బిల్డర్ ఎన్‌వోసీ తీసుకోలేదట. మరి, ఎన్‌వోసీ తీసుకోనప్పుడు మీరేం చేస్తున్నారు? కళ్లు మూసుకున్నారా? ఇప్పటికైనా తమ అపార్టుమెంట్‌ని నిర్మించిన బిల్డర్‌ని పిలిచి.. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకోమని చెప్పాలని నివాసితులు అభ్యర్థిస్తున్నారు.
అసలే కరోనా కష్టకాలంలో ఉద్యోగాలు పోయి.. సరైన వ్యాపారం లేక.. నానా ఇబ్బందులు పడుతున్నామని.. ఇలాంటి సమయంలో పాతిక శాతం అదనంగా ఆస్తి పన్ను కట్టలేమని చేతులెత్తేస్తున్నారు. కనీసం ఇప్పుడైనా జీహెచ్ఎంసీ అధికారులు ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించి.. పాతిక శాతం అధికంగా ఆస్తి పన్ను వసూలు చేస్తున్న బిల్డర్లకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ సమర్పించాలని తాఖీదునివ్వాలని వీరంతా ముక్తకంఠంతో కోరుతున్నారు.
This website uses cookies.