ప్రభుత్వ ఉద్యోగాల్లో.. కాలేజీల్లో రిజర్వేషన్ల గురించి విన్నాం కానీ ఐటీ ఆఫీసుల్లో రిజర్వేషన్ ఏమిటని అనుకుంటున్నారా? ఇంతకీ నియామకాల్లోనా లేక మరే ఇంత అంశంలోనా? అన్నది మీ సందేహమా? ఆగండాగండి.. అక్కడికే వస్తున్నాం. కరోనా పుణ్యమా అంటూ ఐటీ కార్యాలయల్లో సమూల మార్పులొచ్చిన విషయం తెలిసిందే కదా! తాజాగా ఐటీ సంస్థలు వినూత్నంగా ఆలోచించడం మొదలు పెట్టాయి. అందులో నుంచి పుట్టుకొచ్చిన ఈ సరికొత్త ట్రెండే.. ఐటీ ఆఫీసుల్లో సీటు కోసం రిజర్వేషన్!!
కరోనా మూడు వేవుల కారణంగా ఐటీ ఉద్యోగులు ఆఫీసుకు రావడం మానేశారు. రెండేళ్ల నుంచి ఇంటికే పరిమితం అయ్యారు. ఇంట్లో నుంచి పని చేయడం వల్ల ఉద్యోగుల పనితీరు మెరుగైందని కొన్ని సంస్థలు భావిస్తున్నాయి. అందుకే, కరోనా ఉపద్రవం ముగిసినా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అధిక శాతం కంపెనీలు కొనసాగిస్తున్నాయి. దీని వల్ల ఆయా సంస్థలకు నిర్వహణ ఖర్చూ తగ్గుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో పలు కంపెనీలు తమ ఆఫీసు సముదాయాల విస్తీర్ణాన్ని తగ్గిస్తున్నాయి.
అంటే, మునుపటి అంత విశాలంగా కాకుండా తక్కువ స్థలంలోనే కార్యకలాపాల్ని నిర్వహించేందుకు మొగ్గు చూపుతున్నాయి. గతంలో వెయ్యి సీట్ల సామర్థ్యం ఉన్న కంపెనీలు.. వంద నుంచి రెండు వందల సీట్లకు ఆఫీసు కార్యాలయాన్ని కుదిస్తున్నాయి. ఈ క్రమంలో ఎవరైనా ఆఫీసుకు వచ్చి పని చేయాలంటే.. సీటును ముందే రిజర్వు చేసుకోవాలనే నిబంధనను విధిస్తున్నాయి. ఫలితంగా, ఆఫీసుకెళ్లి పని చేయాలని భావించేవారే సీటును రిజర్వు చేసుకుంటున్నారు. మిగతా వారంతా ఇంటి నుంచి పని చేస్తున్నారు.
This website uses cookies.