జెన్‌పాక్ట్ భూమి పూజ.. కండ్లకోయ ఐటీ పార్కు శంకుస్థాపన.. ఈ రెండూ అంశాలు సాధారణ పరిస్థితిలో అయితే రియాల్టీ మార్కెట్‌కు కొంత ఊపునిచ్చేవే. కానీ, ఇప్పుడా ఊపు, ఉత్సాహం మార్కెట్లో పెద్దగా కనిపించట్లేదు. ఎందుకంటే, దశాబ్దం తర్వాత పెరగాల్సిన భూముల ధరల్ని ఇప్పటికే పెంచేశారు. దాన్ని మనం అభివృద్ధి అంటున్నాం. మధ్యతరగతి ప్రజానీకానికి సొంతింటిని భారం చేసి.. అదే అభివృద్ధి అనుకుంటే ఎలా? మార్కెట్లో స్థిరనివాసం కోసం చూసేవారు ఫ్లాట్లను కొనడం లేదు.
మదుపరులేమో యూడీఎస్, ప్రీలాంచుల మీద దృష్టి సారిస్తున్నారు. అంతేతప్ప బిల్డర్లు కట్టే అపార్టుమెంట్లు, విల్లాల్ని పట్టించుకోవట్లేదు. మార్కెట్లో అమ్మకాలు పడిపోయాయని ఇప్పటికే నిర్మాణ సంఘాలు ప్రభుత్వానికి విన్నవించాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల తరుణంలో ఎన్ని ఐటీ పార్కుల్ని ఆరంభించినా.. ఫ్లాట్లను కొనేవారు ముందుకు రాకపోతే ఏం ప్రయోజనం?