తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరువుల ఆక్రమణలపై మరోసారి ఆసక్తికరమై వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై కొరడా ఝూళిపిస్తున్న హైడ్రా విషయంలో ఎట్టిపరిస్థితుల్లోను వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ఖచ్చితంగా చెరువులను ఆక్రమంచిన ఆక్రమణదారుల భరతం పట్టే వరకు విశ్రమించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణ పోలీసు అకాడమీలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్ లో రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా హైదరాబాద్ లో చెరువుల ఆక్రమణలపై ఘాటుగా స్పందించారు.
కొందరు పెద్దలు ప్రాజెక్టుల వద్ద ఫాంహౌస్ లు కడుతున్నారన్న ముఖ్యమంత్రి.. ఫాంహౌస్‌ల నుంచి వచ్చే డ్రైనేజీని గండిపేటలో కలుపుతున్నారని మండిపడ్డారు. నాలాల ఆక్రమణలతో ఉప్పెనలా వరదలు వస్తున్నాయని, దాంతో పేదల ఇళ్లు మునుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆవేధన వ్యక్తం చేశారు.
చెరువులను ఆక్రమణల నుంచి విడిపించేందుకే హైడ్రాను ఏర్పాటు చేశామన్న రేవంత్ రెడ్డి.. ఆక్రమణలు వదిలి గౌరవంగా తప్పుకోండని ఆక్రమణదారులను హెచ్చరించారు. లేదంటే అలాంటి ఆక్రమణలను కూల్చే బాధ్యత హైడ్రా తీసుకుంటుందని అన్నారు. ఒకవేళ కూల్చివేతలపై ఎవరైనా స్టే తెచ్చుకున్నా కోర్టుల్లో కొట్లాడతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్ కాలుష్యం నల్గొండ వరకు చేరుతోందని చెప్పిన ముఖ్యమంత్రి.. ఆక్రమణలు తొలగించి మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేస్తామని చెప్పారు. అయితే మూసీ పరివాహక ప్రాంతంలో పేదల ఆక్రమణలు ఉన్నాయని, వారి పట్ల ప్రభుత్వం మానవతా ధోరణితో వ్యవహరిస్తుందని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. మూసీ వెంట ఉన్న 11 వేల మంది బాధితులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని అన్నారు. మొత్తానికి చెరువులను కబ్జా చేస్తే చెరసాలే దిక్కని ఆక్రమణదారులను నేరుగానే హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి.
This website uses cookies.