Categories: TOP STORIES

ఫ్యూచ‌ర్ సిటీ 4.O లో వరల్డ్ ట్రేడ్ సెంటర్..

ఏఐ సిటీ పక్కనే ప్రపంచ వాణజ్య కేంద్రం

అమెరికాలోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ నుంచి ఇతర దేశాల్లో వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వరల్డ్‌ట్రేడ్‌ సెంటర్స్‌ అసోసియేషన్‌ హక్కులు పొందింది. ఈ క్రమంలోనే దేశంలోని మెట్రో నగరాల్లో మరిన్ని ప్రపంచ వాణిజ్య కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో మొదటి వాణిజ్య కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభిస్తుండగా, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో మరో కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ ఇప్పటికే దిల్లీ, నోయిడా, బెంగళూరు, ముంబయి నగరాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.

చెన్నై, అహ్మదాబాద్, అమృత్‌సర్, అమరావతి, భోపాల్, గోవా, జయపుర, కొచ్చి, లఖ్‌నవూ, భువనేశ్వర్, పుణె, వారణాసి నగరాల్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ నిర్మాణ పనులవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించింది. భవిష్యత్తు నగరంలో విద్య, వినోద, పర్యాటక, ఆరోగ్య కేంద్రాలతో పాటు మరో ప్రతిష్టాత్మకమైన కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఫ్యూచర్ సిటీ-4.O లో ఏఐ సిటీతో పాటు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను నెలకొల్పేందుకు రేవంత్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది .

వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటుతో హైదరాబాద్ నగరం విశ్వ వాణిజ్య రంగంలో మరింతగా దూసుకుపోతుంది. ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే భవిష్యత్తు నగరంలో స్కిల్ యూనివర్సిటీని నిర్మించాలని నిర్ణయించిన రేవంత్ సర్కార్.. అందుకు సంబంధించిన పనుల్ని మొదలు పెట్టింది. స్కిల్ యూనివర్సిటీతో ఫ్యూచర్ సిటీలో నిర్మాణాలు మొదలవ్వగా.. క్రమంగా పలు ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఇందులోకి అడుగుపెడుతున్నాయి. ఫ్యూచర్ సిటీలో ఇప్పటికే విద్య, ఆరోగ్య, పర్యాటక, వినోద, వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

అందుకు సంబంధించిన ప్రణాళికలను సిద్దం చేయడంతో పాటు ఒక క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో ఆచరణలోకి తీసుకువస్తోంది. ఇక ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అమెరికాలోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ తరహాలో హైదరాబాద్ భవిష్యత్తు నగరంలో వాణిజ్య కేంద్రం ఏర్పాటుకు వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ముందుకొచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వంతో ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో భద్రత అంశాలను పరిగణనలోకి తీసుకున్న రెవెన్యూ, పరిశ్రమల శాఖ అధికారులు.. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇందుకోసం ఏఐ సిటీకి సమీపంలో మూడు ప్రాంతాల్ని పరిశీలించిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసే సెంటర్ కు సంబంధించిన‌ అవసరాలను ప్రభుత్వానికి నివేదించారు. ఎయిర్ పోర్ట్, మెట్రోరైల్‌ స్టేషన్లకు వేగంగా చేరుకునేందుకు వీలుగా ప్రధాన రోడ్డుతో పాటు, ఇంటర్నల్ రోడ్లు వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు అనుసంధానమై ఉండాలని కోరినట్లు తెలుస్తోంది.

వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు 50 ఎకరాల స్థలం కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుండగా, భవిష్యత్‌ అవసరాలు, పార్కింగ్‌ కోసం అదనంగా మరో 20 ఎకరాలు కేటాయించాలని ప్రతినిధులు కోరుతున్నారు. సోలార్ పవర్ ప్లాంట్ తో పాటు, కమ్యూనికేషన్‌ వ్యవస్థ కోసం భారీ టవర్లు ఏర్పాటు చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వీటన్నింటినీ అధికారులు పరిగణలోకి తీసుకుని స్థలాలను ఎంపిక చేయాలని కోరుతున్నారు.

This website uses cookies.