Categories: LATEST UPDATES

అక్రమ నిర్మాణాలు.. 41 ఓసీల రద్దు

చట్టం ముందు అందరూ సమానులే. తప్పు చేస్తే ఎంతటి పెద్దవారినైనా శిక్షించాల్సిందే. కానీ చాలాసార్లు ఇది జరిగే అవకాశం లేదు. అయితే, హర్యానా టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్ మెంట్ (డీటీసీపీ) ఎన్ ఫోర్స్ మెంట్ టీం మాత్రం ఇది చేసి చూపించింది.

ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల(ఓసీ)ను తీసుకున్న తర్వాత అక్రమంగా మార్పులు చేర్పులు చేసిన భవంతులకు సంబంధించి 41 ఓసీలను రద్దు చేసి పారేసింది. అంతేకాకుండా సదరు ప్రాపర్టీ యజమానులు, ఆర్కిటెక్టులు, కాంట్రాక్టర్లపై కేసులు నమోదు చేసింది. ఓసీలను రద్దు చేసిన వెంటనే తదుపరి చర్యలకు కూడా ఉపక్రమించింది. ఈ ప్రాపర్టీలకు సంబంధించిన ఎలాంటి సేల్ డీడ్లను రిజిస్టర్ చేయొద్దని తహశీల్దార్లను కోరింది. అలాగే ఆర్కిటెక్టులకు షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఈ ప్రాపర్టీలన్నీ గుర్గావ్ లోని లైసెన్స్ డ్ కాలనీలు అయిన పాలం విహార్, ఉప్పల్ సౌతెండ్, విపుల్ వరల్డ్, సన్ సిటీ, డీఎల్ఎఫ్-1, వాటికా సెక్టార్-83, డీఎల్ఎఫ్ అలమేదల్లో ఉన్నట్టు ఓ అధికారి వెల్లడించారు. ఓసీలు తీసుకున్న తర్వాత నివాస గృహాలకు సంబంధించి మార్పులు చేశారనే ఫిర్యాదులపై డీటీసీపీ డైరెక్టర్ కేఎం పాండురంగ్ దృష్టి సారించి ఐదుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. వారు ఆయా భవంతులను పరిశీలించి అక్రమాలను నిర్ధారించారు.

వాస్తవ బిల్డింగ్ ప్లాన్ లో ఉన్నట్టు కాకుండా అక్రమంగా నిర్మాణాలు చేసినట్టు గుర్తించారు. ఓసీలు మంజూరు చేసిన 10 రోజుల తర్వాత అధికారులు ఈ పరిశీలన చేశారు. అనంతరం మళ్లీ 45 రోజుల తర్వాత మరోసారి తనఖీలు చేశారు. ముందు, వెనుక భాగాలతోపాటు స్టిల్ట్ పార్కింగ్ వద్ద కూడా మార్పులు చేసినట్టు గుర్తించి, ఆ మేరకు ప్రాపర్టీ యజమానులపై చర్యలు చేపట్టారు. ముందుగా ఓసీలు రద్దు చేశారు. చాలామంది యాజమానులు నిబంధనలకు విరుద్ధంగా అదనపు నిర్మాణాలు, అనుమతి పొందిన ప్లాన్ కు విరుద్ధంగా మార్పులు చేసినట్టు గుర్తించామని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. కొన్ని నివాస గృహాల్లో వాణిజ్య కార్యకలాపాలు కూడా సాగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే వారిపై చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. మరి రాష్ట్రంలో ఇలాంటి అక్రమాలపై తెలంగాణ పురపాలక శాఖ అధికారులు కానీ, రెరా అధికారులు కానీ ఇదే విధంగా చర్యలు తీసుకునే పరిస్థితి ఉందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

This website uses cookies.