Categories: TOP STORIES

అక్రమార్కుల బై బ్యాక్ ఆఫర్?

30 లక్షలు పెడితే.. 20 నెలల్లో 50 లక్షలు వెనక్కి..
60 లక్షలు పెడితే.. 20 నెలల్లో రూ.కోటి వెనక్కి..

ఆహా.. చదువుతుంటే ఎంత టెంప్టింగ్ గా ఉంది కదూ.. ఇప్పుడే అప్పోసొప్పో చేసి.. 30 లక్షలు పెట్టుబడి పెట్టేసి నిశ్చింతంగా ఉండాలనిపిస్తుంది కదా? 30 లక్షల మీద 20 లక్షలు రాబడి వస్తుందంటే.. ఎవరైనా ఎగిరి గంతేస్తారు కదా.. కానీ, అంతంత రాబడి నిజంగానే ఆశించొచ్చా? అసలిది సాధ్యమయ్యే పనేనా? ఇలాంటి సెబీ నిబంధ‌న‌ల‌కు విరుద్ధం అని మ‌రిచిపోవ‌ద్దు. మ‌న‌దేశంలో ఏ పెట్టుబ‌డి ప‌థకంలో సొమ్ము పెట్టినా.. ఫ‌లానా మొత్తంలో రాబ‌డి వ‌స్తుంద‌ని ఎంత పెద్ద సంస్థ అయినా చెప్ప‌లేదు. మ‌రి, మ‌న వ‌ద్ద కొంద‌రు అక్ర‌మార్కులు 30 ల‌క్ష‌లు పెడితే యాభై ల‌క్ష‌లిచ్చేస్తామ‌ని అంటున్నారు.

రియల్ రంగంలో రకరకాల స్కీముల్ని ప్రవేశపెట్టి.. సామాన్యులకు ఆశపెట్టి.. సొమ్ము దండుకునేందుకు బయల్దేరిందో అక్రమార్కుల ముఠా. శంకర్ పల్లిలోని మోమిన్ పేట్ వద్ద ముప్పయ్ లక్షలకు అర ఎకరం స్థలం కొంటే చాలు.. 18 నెలలకే రూ.47.5 లక్షలిస్తామని అంటున్నారు. బ్యాంకు, బంగారం కంటే అధిక మొత్తంలో సొమ్ము వెనక్కి ఇస్తామంటున్నారు. అంటే, ఏడాదిన్నరకే 17.5 లక్షల అప్రిసియేషన్ అన్నమాట. అదే 20 నెలలు ఆగితే యాభై లక్షలు ఇస్తామని చెబుతున్నారు. దీన్నే వీళ్లు బై బ్యాక్ ఆఫర్ అని ముద్దుగా చెబుతున్నారు. హైదరాబాద్ రియల్ రంగంలో ఇంతింత అప్రిసీయేషన్ పక్కాగా వస్తుందంటే.. తెలంగాణ ప్రజానీకంలో కనీసం ఇరవై శాతం మంది అయినా ఇందులో పెట్టుబడి పెడతారు. కాబట్టి, తెలంగాణ రెరా అథారిటీ అనుమతి లేని ఇలాంటి మోసపూరిత పథకాల్లో పెట్టుబడి పెట్టొద్దు. మీ క‌ష్టార్జితాన్ని బూడిద‌లో పోసిన ప‌న్నీరు చేసుకోవ‌ద్దు.

This website uses cookies.