Categories: TOP STORIES

లగ్జరీ సెగ్మెంట్ పైనే ఇండెక్సేషన్ ప్రభావం

స్థిరాస్తి విక్రయంపై ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని తొలగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రధానంగా లగ్జరీ సెగ్మెంట్ పైనే ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. స్థిరాస్తి విక్రయాలకు సంబంధించిన ఇండెక్సేషన్ ప్రయోజనం తీసివేయడం వల్ల ఇకపై ఆస్తిని విక్రయించాలనుకునే ఆస్తి యజమానులు ద్రవ్యోల్బణాన్ని ఉపయోగించి కొనుగోలు ధరను సర్దుబాటు చేయడం కుదరదు. తద్వారా వారి మూలధన లాభాలు తగ్గుతాయి. అంతేకాకుండా పన్ను కూడా పెరుగుతుంది. ఇప్పటివరకు ఆస్తి నుంచి వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలపై ఇండెక్సేషన్ ప్రయోజనంతో 10 శాతం పన్ను పడేది.

ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం ఇండెక్సేషన్ ప్రయోజనం లేకుండా ఈ పన్ను 12.5 శాతం కానుంది. అయితే, ఈ ప్రతిపాదన ప్రభావం అధిక ధర కలిగిన లగ్జరీ ప్రాపర్టీలపైనే పడుతుందని చెబుతున్నారు. కరోనా తర్వాత లగ్జరీ ప్రాపర్టీల అమ్మకాలు పెరిగాయి. అయితే, కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత నిర్ణయం వల్ల ఇన్వెస్టర్ల ఆలోచనలో మార్పు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. రూ.70 లక్షల లోపు ధర కలిగిన ఇళ్లను కొనేవారంతా తాము అందులోనే ఉంటారు. అంటే వారు ఇళ్లు కొని, అమ్మడం ఉండదు. అందువల్ల ఇండెక్సేషన్ తొలగింపు ప్రభావం వారిపై పడదు.

మరోవైపు అన్ని ఆర్థిక, ఆర్థికేతర ఆస్తుల ద్వారా వచ్చే దీర్ఘకాలిక లాభాలపై పన్నును 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించారు. ఈ నేపథ్యంలో ఇండెక్సేషన్ ప్రయోజనం తొలగింపు వల్ల 13 శాతానికి మించి వార్షిక పెరుగుదల కలిగిన ప్రాపర్టీలు కొనేవారు ట్యాక్స్ ఔట్ ఫ్లో రూపంలో లబ్ధి పొందుతారు. అంతకంటే తక్కువ పెరుగుదల కలిగిన ప్రాపర్టీల యజమానులు నష్టపోతారు. దీనివల్ల ముఖ్యంగా హై ఎండ్ సెగ్మెంట్ లో పెట్టుబడులు పెట్టేవారి ఆసక్తి తగ్గుతుంది.

This website uses cookies.