హైదరాబాద్ దమ్మాయిగూడలో పేదల కోసం గత బీఆర్ఎస్ సర్కారు నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో కనీస వసతులు కూడా లేకపోవడం పట్ల లబ్ధిదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇళ్ల నిర్మాణం తుది దశలో ఉన్నప్పటికీ కనీస వసతులు కూడా వాటిలో లేవని పేర్కొంటున్నారు. దాదాపు 4వేల కుటుంబాలు త్వరలో ఈ ఇళ్లలో నివసించబోతున్నాయి. అయితే, తాగునీరు, విద్యుత్ సరఫరా కనెక్షన్ వంటి కనీస సౌకర్యాలతోపాటు వైద్య ఆరోగ్య కేంద్రాలు కూడా సమీపంలో లేవని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించారు కానీ, తాగునీటి వంటి కనీస వసతులపై ఎవరూ దృష్టి పెట్టలేదని.. వాటిని ఎవరూ పట్టించుకోకుంటే తాము అందులో నివసించాలని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో సరైన వైద్య ఆరోగ్య కేంద్రాలు లేవని.. అలాగే స్కూళ్లు, కాలేజీలతోపాటు సరైన రవాణా సౌకర్యాలు కూడా లేవని పేర్కొన్నారు. ఇప్పటికే ఆ కాలనీ సమపంలో 2వేల కుటుంబాలు నివసిస్తుండగా.. త్వరలోనే దాదాపు 4వేల కుటుంబాలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కాలనీలోకి వెళ్లనున్నాయి.
2016లో ఈ ఇళ్ల నిర్మాణం ప్రారంభమైనప్పుడే కనీస వసతుల కల్పన గురించి తాము అడిగామాని.. కానీ ఎవరూ పట్టించుకోలేదని లబ్ధిదారులు చెబుతున్నారు. గతేడాది బస్తీ దవాఖానా ప్రారంభించారని.. కానీ అందులో అన్ని రకాల రోగాలకూ చికిత్స అందుబాటులో లేదన్నారు. ఇక ప్రభుత్వ పాఠశాల ఒకటే ఉందని.. అందులోనూ సరైన సౌకర్యాలు లేవని తెలిపారు. ఈ నెలలోనే తాము కొత్త ఇళ్లలోకి మారాల్సి ఉందని.. కానీ కనీన వసతులు కూడా లేకపోవడం వల్ల అక్కడ ఎలా ఉండాలో అర్థంకావడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించామని పేర్కొన్నారు.
This website uses cookies.