- సెప్టెంబర్ లో ఆరు నెలల గరిష్ట స్థాయికి విక్రయాలు
- చిన్న ఇళ్ల అమ్మకాల్లో 14 శాతం వృద్ధి నమోదు
కోవిడ్ మహమ్మారి వల్ల విపరీతంగా నష్టపోయిన అమెరికాలో పరిస్థితులు కుదుటపడుతున్నట్టు కనిపిస్తున్నాయి. కరోనా కాలంలో ఎదురైన ఇబ్బందులు అధిగమించడానికి చాలామంది సొంతింటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో గత నెలలో చిన్న ఇళ్ల అమ్మకాల్లో గణనీయమైన పురోగతి కనిపించింది. ఈ సెప్టెంబర్ లో ఏకంగా 8 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. గత మార్చి తర్వాత ఆ స్థాయిలో ఇళ్ల అమ్మకాలు పెరగడం ఇదే తొలిసారి. సెప్టెంబర్ లో జరిగిన ఇళ్ల అమ్మకాల్లో 14 శాతం వృద్ధి నమోదైందని అమెరికా వాణిజ్య విభాగం వెల్లడించింది.
అయితే, ఆగస్టులో ముందు వెల్లడించిన గణాంకాలు మారాయి. తొలుత ఆగస్టులో 7,40,000 ఇళ్ల అమ్మకాలు జరిగాయని చెప్పగా.. తాజాగా దానిని 7,02,000 ఇళ్లుగా సవరించారు. ఒక ఎప్పుడూ డిమాండ్ ఉండే దక్షిణ ప్రాంతంలో గృహ అమ్మకాలు పెరిగాయి. అలాగే పశ్చిమ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా మంచి డిమాండ్ కనిపించింది. కానీ మిడ్ వెస్ట్ లో మాత్రం అమ్మకాలు అంతగా పెరగలేదు. ప్రతి ఏటా సెప్టెంబర్ లో జరిగిన ఇళ్ల అమ్మకాలతో పోలిస్తే ప్రస్తుతం అది 17.6 శాతం తగ్గుదల నమోదైంది. ఈ ఏడాది జనవరి ఏకంగా 9,93,000 ఇళ్ల విక్రయాలు జరిగాయి. 2006 తర్వాత ఇంత భారీగా అమ్మకాలు నమోదుకావడం అదే.
కరోనా ప్రారంభమైన తొలినాళ్లలో విశాలమైన ఇళ్లు కావాలనుకునే అమెరికన్ల సంఖ్య భారీగా పెరిగింది. ఇంట్లోనే కార్యాలయం ఏర్పాటు, పిల్లల ఆన్ లైన్ తరగతుల కోసం కాస్త పెద్ద సైజున్న ఇళ్లకు గిరాకీ పెరిగింది. ప్రస్తుతం స్కూళ్లు, ఆఫీసులకు జనం రావడం మొదలు కావడంలో ఇళ్ల కొనుగోళ్ల సందడి కాస్త తగ్గింది. గత నెలలో అమ్మకాలు జరిగిన ఇళ్లలో దాదాపు 74 శాతం నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం అమెరికా రియల్ మార్కెట్ లో 3,79,000 కొత్త ఇళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి.