చిన్న అపార్టుమెంట్లలో ఫ్లాట్లు కొనాలన్నా మధ్యతరగతి ప్రజలకు సాధ్యం కావట్లేదు. నిన్నటివరకూ చదరపు అడుక్కీ రూ.3 నుంచి 4 వేల చొప్పున శివార్లలో ఎక్కువగా ఫ్లాట్ల లభించేవి. ఇప్పుడేమో వాటి ధర.. చదరపు అడుక్కీ ఐదున్నర వేల నుంచి ఆరు వేల రూపాయలకు పెరిగిపోయాయి. పార్కింగ్, జీఎస్టీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు అదనం. అంటే, ఒక చిన్న అపార్టుమెంట్‌లో డబుల్ బెడ్‌రూం ఫ్లాటును కొనాలన్నా రూ.70 లక్షలు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. నిన్నటివరకూ రూ.40 నుంచి రూ.50 లక్షలకు దొరికే డబుల్ బెడ్‌రూం ఫ్లాటు.. నేడు 70 నుంచి 80 లక్షలు పెట్టనిదే దొరకట్లేదు. అదే పశ్చిమ హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీల్లో అయితే.. డబుల్ బెడ్‌రూం ఫ్లాట్లు కోసం కనీసం కోటి రూపాయలు ఉండాల్సిందే. ఇలాగైతే సామాన్యుల సొంతింటి కల ఎలా తీరుతుంది?
హైదరాబాద్‌లో పెరిగిన భూముల రేట్లను చూసి అనుభవజ్ఞులైన బిల్డర్లు సైతం కొత్త ప్రాజెక్టుల్ని ఆరంభించడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. మునుపటిలా పోటీపడి అపార్టుమెంట్లను ఆరంభించే పరిస్థితి ప్రస్తుతం కనిపించట్లేదు. ఇప్పటికే అమెరికా, యూరప్, యూకే వంటి దేశాల్లో ఆర్థిక మాంద్యం ఆరంభమైందని పలువురు ఐటీ మేనేజర్లు అంగీకరిస్తున్నారు. కొత్త నియామకాల్ని ఐటీ సంస్థలు తగ్గించడంతో ఎప్పుడేం జరుగుతుందోనని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు భయపడుతున్నారు. నిన్నటి వరకూ కాలరు ఎగరేసే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల ఆలోచనా ధోరణీ కూడా మారింది. అందుకే, ఎక్కువ మంది రేటెక్కువ పెట్టి ఫ్లాట్లు కొనడానికి ఆసక్తి చూపించట్లేదు.
This website uses cookies.