Categories: TOP STORIES

ఫిర్యాదుల పరిష్కారంలో క్రెడాయ్ చెన్నై సూపర్

బిల్డర్లపై ఇళ్ల కొనుగోలుదారులు చేసిన ఫిర్యాదులను పరిష్కరించే విషయంలో చెన్నై క్రెడాయ్ వేగంగా వ్యవహరిస్తోంది. 19 మంది బిల్డర్లపై వచ్చిన 44 ఫిర్యాదుల్లో 38 ఫిర్యాదులను పరిష్కరించింది. ప్రాజెక్టుల అప్పగింతలో జాప్యం, రిఫండ్ వ్యవహారాలు, సౌకర్యాల కల్పనలో విఫలం, కార్పస్ ఫండ్ కు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయి. ‘సగటున ఫిర్యాదు ప్రాధాన్యతను బట్టి 45 నుంచి 90 రోజుల్లోనే పరిష్కరించాం. కొన్ని ఫిర్యాదులు కేవలం ఒక్కరోజులో కూడా పరిష్కరించిన సందర్భాలున్నాయి’ అని క్రెడాయ్ చెన్నై అధ్యక్షుడు ఎస్.శివగురునాథన్ చెప్పారు.

వాస్తవానికి చెన్నై క్రెడాయ్ పదేళ్లుగా పనిచేస్తున్నప్పటికీ, ఫిర్యాదుదారులు సంప్రదించడం ఇటీవలే మొదలైంది. ఇళ్ల కొనుగోలుదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా ఓ కమిటీ పనిచేస్తోంది. ‘కొనుగోలుదారులకు సమస్యలు ఎదురైతే తొలుత మమ్మల్ని సంప్రదించాలని కోరుతున్నాం. బిల్డర్లు, డెవలపర్లతో సమావేశమై సమస్యలను పరిష్కరించడం ఇక్కడ సులభం. ఒకవేళ ఇక్కడ కంటే తమిళనాడు రెరాలోనే న్యాయం జరుగుతుందని భావిస్తే.. అక్కడకే వెళ్లొచ్చు’ అని గురునాథన్ పేర్కొన్నారు. అయితే, తమ సభ్యులుగా ఉన్న బిల్డర్లకు సంబంధించిన ప్రాజెక్టులపై వచ్చే ఫిర్యాదులనే క్రెడాయ్ చెన్నై పరిష్కరిస్తుంది.

This website uses cookies.