ఆరు నెలల వ్యవధిలో మార్కెట్ విలువలను 25% నుంచి 50% వరకు పెంచడం అన్యాయమని.. పరీక్షా సమయంలో పరిశ్రమకు చేయాలని.. మార్కెట్ విలువల పెంపు నిర్ణయాన్ని కొంతకాలం వాయిదా వేయాలని తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ కోరుతోంది. గురువారం బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లోని ఒక హోటల్‌లో టీబీఎఫ్ సంఘం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. మార్కెట్ విలువల్ని పెంచాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు.. సరైన పద్ధతిని అనుసరించి న్యాయబద్ధంగా పెంచితే ఎవరికీ ఇబ్బందికరంగా ఉండదన్నారు.
ఫిబ్రవరి 1 నుంచి మార్కెట్ విలువ సవరణను చేపట్టడం నిర్మాణ పరిశ్రమతో పాటు రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద దెబ్బ అని అన్నారు. గత ఏడాది జులైలోనే మార్కెట్ విలువల్ని సవరించారని.. ఆశ్చర్యకరంగా ఆరు నెలల వ్యవధిలోనే మరోసారి మార్కెట్ విలువలను సవరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరు నెలల వ్యవధిలోనే మరోసారి మార్కెట్ విలువలను పెంచాలన్న నిర్ణయం తీసుకునేటప్పుడు ఇందులో భాగస్వాముల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని టీబీఎఫ్ ప్రధాన కార్యదర్శి టీ నర్సింహారావు తెలిపారు. రియల్ ఎస్టేట్ పరిశ్రమ మార్కెట్ గత 6 నెలలుగా మందగించిందని.. కొవిడ్-19 మహమ్మారి వల్ల అమ్మకాలు తగ్గాయని వివరించారు. డిసెంబర్, జనవరి నెలల్లో పండుగలు ఉన్నాయని.. ఈ సమయంలో నిర్ణయాలు తీసుకోవడం కరెక్టు కాదన్నారు.
కొందరు బిల్డర్లు ప్రీ-లాంచ్, యూడీఎస్ పేరుతో చాలా గందరగోళం సృష్టిస్తున్నారని.. పరిశ్రమ పేరును చెడగొట్టారని తెలిపారు. దురదృష్టవశాత్తు సామాన్యులు ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో జరిగే ప్రకటనలను చూసి మోసపోతున్నారని కోశాధికారి గోపాల్ అన్నారు. దీనివల్ల రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ప్రైస్ మార్కెట్‌లోని వాస్తవమైన, క్రమపద్ధతిలో జరిగే లావాదేవీలు దెబ్బతింటున్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మార్కెట్ విలువల సవరణను ఆరు నెలల వ్యవధిలోనే రెండోసారి చేపట్టడం వల్ల 1.2.2022 నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం పడుతోందన్నారు.
అందుకే, తక్షణమే ఈ పెంపుదలను కొంతకాలం వాయిదా వేయాలని దాదాపు 900 మంది బిల్డర్లు గల తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ కార్యక్రమంలో కె.రాజారెడ్డి, మారం సతీష్ కుమార్, ఎస్ రమేష్, ఎన్ శ్రీనివాసన్, వి.శ్రీనివాస్, జేటీ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
This website uses cookies.