Categories: LATEST UPDATES

దుబాయ్ రియాల్టీలో పెట్టుబ‌డికి సై

దుబాయ్ రియల్ ఎస్టేట్ లో భారతీయ పెట్టుబడులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా భారతీయ యువత దుబాయ్ రియల్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తోంది. మధ్యస్థ ధరల నుంచి హై ఎండ్ ధరల వరకు ఫ్యాన్సీ హౌసింగ్ ప్రాపర్టీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ విషయంలో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న రష్యన్లు సైతం వెనక్కి నెట్టి ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది తొలి రెండు నెలల్లో రష్యన్ల కంటే భారతీయ యువత పెట్టుబడులే ఎక్కువగా ఉండటం ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది దుబాయ్ లో మన పెట్టుబడులు 4.2 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని అంచనా. ఇది గతేడాదితో పోలిస్తే చాలా ఎక్కువ.

సాధారణంగా దుబాయ్ లో పెట్టుబడులు పెట్టే భారతీయుల్లో వ్యాపారవేత్తలు, అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు, సంప్రదాయ పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఉంటారు. అయితే, ఈ ధోరణిలో నయా పోకడలు మొదలయ్యాయని, యువ పెట్టుబడిదారులు వెల్లువలా దుబాయ్ వైపు చూస్తున్నారని దుబాయ్ కు చెందిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ మెంట్ కన్సల్టెన్సీ సంస్థ ఫోర్ మెన్ ఫీఫ్ డమ్ సీఈఓ ఆదిల్ అక్తర్ తెలిపారు. దుబాయ్ కాస్మోపాలిటన్, బహుళ సాంస్కృతిక వాతావరణం చాలా మంది భారతీయులను ఆకర్షిస్తోందని వివరించారు. వారంతా ఉన్నత జీవన ప్రమాణాలు, విభిన్న అవకాశాలను అందించే నగరం కోసం చూస్తున్నారని పేర్కొన్నారు. దుబాయ్ లోని తక్కువ పన్నులు, వ్యాపార అనుకూల విధానాలు భారతీయ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారాయని వెల్లడించారు.

గతేడాది అక్టోబరులో పదేళ్ల గోల్డెన్ వీసా ప్రవేశపెట్టిన తర్వాత యువకులతోపాటు పలువురు భారతీయ ప్రొఫెషనల్స్ శాశ్వత నివాసం, వ్యాపారం కోసం దుబాయ్ ను ఎంచుకుంటున్నారని అక్తర్ చెప్పారు. 20 లక్షల దిర్హ‌మ్‌(5.45 లక్షల డాలర్లు)ల కంటే అధికంగా విలువ చేసే ప్రాపర్టీని కొనుగోలు చేసేటప్పుడు అనేక రకాల ప్రయోజనాలతో పాటు 10 సంవత్సరాల కాల వ్యవధి కలిగిన యూఏఈ రెసిడెన్సీ వీసాను విదేశీ పౌరులు పొందే వెసులుబాటు కల్పించారు. ఇంకా దుబాయ్ లోని విలాసవంతమైన ప్రాజెక్టులు, రెడీ టూ మావ్ ఇన్, ఆఫ్ ప్లాన్ ప్రాజెక్టులు భారతీయ పెట్టుబడిదారులను ఆకర్షించే మరో అంశం. కొత్త పెట్టుబడిదారులు 1.5 మిలియన్ దిర్హ‌మ్‌ల నుంచి 5 మిలియన్ దిర్హ‌మ్‌ల మధ్య విలువ కలిగిన ప్రాపర్టీలను ఎంచుకుంటున్నారని అక్తర్ వెల్లడించారు. దుబాయ్ మెరీనా, డౌన్ టౌన్ దుబాయ్, పామ్ జుమేరా వంటి ప్రధాన ప్రదేశాలలో వాణిజ్య, నివాస ఆస్తుల్లో పెట్టుబడులకు భారతీయ పెట్టుబడిదారులు ప్రాధాన్యత ఇస్తారని భావిస్తున్నారు. కాగా, 2022 మొదటి ఆరు నెలల్లోనే భారతీయ పౌరులు 1.96 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తంలో దాదాపు 4 వేల రియల్ ఎస్టేట్ లావాదేవీలు జరిపారు.

This website uses cookies.