ఎత్తైన ఆకాశ హర్మ్యాల్లో నివసించడం భలే అనుభూతి ఇస్తుందని, అందులో ఉండటానన్నే తాను ఇష్టపడతానని నటి ఇర్రా మోర్ పేర్కొన్నారు. 30వ అంతస్తులో ప్లాట్ తీసుకోవడానికి తానెంతమాత్రం ఆలోచించనని స్పష్టం చేశారు. సొంతిల్లు ఎలా ఉండాలనే అంశంపై తన ఆలోచలను రియల్ ఎస్టేట్ గురుతో పంచుకున్నారు. ఇంటికి సంబంధించి తెలివి, భావోద్వేగాల సమతుల్యతతో ఆమె సరైన మార్గంలోనే ఉన్నారు. ‘క్లాసిక్, విలాసవంతమైన డెకరేషన్ ఉండాలనేది నా కోరిక. రిచ్ గా అలంకరించిన వస్తువులనే ఎంపిక చేసుకుంటాను. టైమ్ లెస్ కలెక్షన్ తో నా మ్యాగ్జిమలిస్ట్ గదులను మార్చడం చూడటానికి చాలా బాగుంటుంది. అలాంటి డెకర్ ఎవరినైనా సరే ఆగి తదేకంగా చూసేలా చేస్తుంది. ఇక సీక్విన్స్ నన్ను బాగా ఆకర్షిస్తాయి. వాటి మెరుపులు నా ఇంటిని ఉన్నతంగా, ఖరీదైందిగా చేస్తాయి. ఇక పూలతో కూడిన కుండీలు చూస్తే వదల్లేను. వాటి నుంచి అస్సలు దూరంగా వెళ్లలేను. ప్రస్తుతం మనం డీఐవై యుగంలో జీవిస్తున్నాం. అందువల్ల నేను విపరీతమైన డెకర్ మార్గాలు అన్వేషించడానికి ఇష్టపడతాను’ అని ఇర్రా వెల్లడించారు.
హైరైజ్ భవనంలో ఫ్లాట్ కోసం చూస్తున్న ఇర్రా మోర్.. ఎత్తైన భవనం నుంచి వీక్షణలను బాగా ఇష్టపడతారు. ‘ఎత్తైన భవనం నుంచి వీక్షణ బాగుంటుంది. ఆ భవనంలోని బాల్కనీ ఎత్తును చూడండి. పార్టీ కోసం పై అంతస్తులో ఏర్పాట్లు అన్నీ బాగుంటాయి. హైరైజ్ బిల్డింగ్ లో భద్రత కూడా బావుంటుంది. అందువల్ల 30వ అంతస్తులైనైనా సరే ఫ్లాట్ తీసుకోవడానికి నేను రెడీ’ అని పేర్కొన్నారు. బంగ్లాలు తన చిన్ననాటి నివాసాన్ని గుర్తుకు తెస్తాయని చెప్పారు. ఇక షూటింగ్ లో లేనప్పుడు తనకున్న పెద్ద తోటలో గరిష్ట సమయం గడుపుతానని వివరించారు. ‘మనం తినే కూరగాయలను పురుగుమందులు లేకుండా పండించడం చాలా మంచి అనుభూతిని ఇస్తుంది. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో ఇదిఎక్కువగా ఉంది. షూటింగ్ లేనప్పుడు నేను ఇందులోనే ఎక్కువసేపు గడుపుతాను. ఇది నాకు చాలా సరదాగా ఉంటుంది. ఇది నా ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది’ అని చెప్పారు.
తన కలల సౌధాన్ని ముంబైలోనే నిర్మించుకోవాలని భావిస్తున్నట్టు ఇర్రా వెల్లడించారు. ‘ఇది నా గ్లామర్ ప్రపంచానికి కలుపుతుంది. అన్ని విధాలుగా ఇది ఓ మెగా సిటీ. ఎంతో శక్తివంతమైన, పేరున్న నగరం. పైగా బ్రిటిష్ ఆర్కిటెక్చర్ ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. సరిగ్గా చెప్పాలంటే నక్షత్రాల నిజమైన గెలాక్సీ’ అని పేర్కొన్నారు. ఇల్లు గందరగోళంగా ఉండటాన్ని ఏమాత్రం ఇష్టపడని ఇర్రా.. అన్నీ చక్కగా అమర్చుకోవాలని భావిస్తారు. ‘నా ఇంటిని చక్కగా ఉంచుకోవడం నాకు చాలా ఇష్టమైన పని. క్రమబద్ధంగా జీవించే కళపై దృష్టి సారించడం ఎల్లప్పుడూ స్వాగతిస్తాను. ఇతరులకు ఇది చాలా కష్టమైన పని కావొచ్చు. కానీ నాకు కాదు. మీ ఇల్లు లైట్ల కళాకాంతులతో వెలిగిపోవాలి. గులాబీ, తెలుపు కలయిక నాకు చాలా ఇష్టం. అలాగే నాకు ఎలాంటి గందరగోళం లేని ఇల్లు కావాలి’ అని స్పష్టంచేశారు. నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇంటికి వెళ్లి చూసిన తీరును ఆమె మర్చిపోలేదు. అక్కడి రంగుల కలయిక ఇర్రాను బాగా ఆకర్షించింది. ఇంకా అక్కడ చాలా మొక్కలున్నాయని తెలిపారు. ఇంకా అద్దాల గది కూడా బాగుందని పేర్కొన్నారు. మొత్తానికి ఇర్ఫాన్ ఇల్లు అత్యద్భుతంగా ఉందని ఇర్రా వెల్లడించారు.