హెచ్ఎండీఏ పరిధిలోని మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలు పుట్టుకొస్తున్నాయని పురపాలక శాఖ ఆలస్యంగా గుర్తించింది. వాస్తవానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిన తర్వాత ఈ అక్రమ తంతు ఆరంభమైంది. కాకపోతే, కాస్త ఆలస్యంగా కళ్లు తెరుచుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. హెచ్ఎండీఏ నుంచి ఎలాంటి అనుమతుల్లేకుండా లేఅవుట్లు, అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలను అక్రమంగా నిర్మిస్తున్నారని పురపాలక శాఖ గుర్తించింది. హెచ్ఎండీఏ ప్రకారం.. గ్రామ పంచాయతీలు జి+2 అంతస్తుల్లో వ్యక్తిగత ఇళ్లను కట్టుకునేందుకు అనుమతినివ్వాలి. కానీ, కొన్ని మున్సపాలిటీల్లో పాత గ్రామ పంచాయతీ అనుమతులున్నాయని పేర్కొంటూ కొందరు అక్రమార్కులు ఏకంగా అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలను నిర్మిస్తున్నారని తెలుసుకున్నది. ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ పరిధిలోని కమిషనర్లు.. క్షేత్రపర్యటన చేసి నిర్మాణ పనులు జరుగుతున్న కట్టడాలను తనిఖీ చేయాలని ఆదేశించింది. ఆయా నిర్మాణాలకు అనుమతులున్నాయా? లేవా? అని పరిశీలించాలని సూచించింది. ఒకవేళ అక్రమ నిర్మాణాలుంటే తక్షణమే వాటిని నేలమట్టం చేయాలని పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాన్ని పట్టించుకోవడంలో నిర్లక్ష్యం చేసే కమిషనర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని, ఇందుకు సంబంధించిన నివేదికను డిసెంబరు 30లోపు తమకు అందజేయాలని సూచించారు.
మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలు కొత్తేం కాదు. ఈ విషయం అటు ప్రభుత్వానికి తెలుసు. ఇటు స్థానికంగా పని చేసే మున్సిపల్ కమిషనర్లకు తెలుసు. దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో మంత్రి కేటీఆర్ పేరు చెప్పుకుని అక్రమ నిర్మాణాల్ని ప్రోత్సహించే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులున్నారు. ఇటీవల బౌరంపేట్‌లో వెలుగులోకి వచ్చిన అక్రమ విల్లాల నిర్మాణంలో కేటీఆర్ అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీ పాత్ర ఉందనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే కదా అక్కడి స్థానిక పురపాలక శాఖ యంత్రాంగం స్పందించలేదు. ఇదొక్కటే కాదు.. నగరం నాలుగు వైపుల ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఏదో మొక్కుబడిగా చర్యల్ని తీసుకోవడం మానేసి.. మంత్రి కేటీఆర్ అక్రమ నిర్మాణాలపై ప్రకటన చేయాలి. అక్రమ నిర్మాణాల్లో టీఆర్ఎస్ నేతల పాత్ర ఉందని నిరూపితమైతే వారిని సస్పెండ్ చేస్తామని ప్రకటించాలి. ఇలా కఠినంగా వ్యవహరిస్తేనే టీఆర్ఎస్ నేతలు అక్రమ నిర్మాణాల జోలికి వెళ్లరు.
This website uses cookies.