షేక్‌పేట్ నుంచి కోకాపేట్ (నార్సింగి).. వయా మణికొండ పైప్ లైన్ రోడ్డు..
ఈ రహదారి చుట్టూ అనేక కాలనీలు వెలిశాయి. వందలాది అపార్టుమెంట్లను నిర్మించారు. ఎంతలేదన్నా మూడు లక్షల మంది దాకా నివసిస్తున్నారు. ఇంతమంది జనాభా పెరుగుతారని ముందే ఊహించిన అప్పటి ప్రణాళికా అధికారులు.. 2001లోనే 120 అడుగుల రహదారి వేయాలని ప్రతిపాదించారు. మాస్టర్ ప్లాన్‌లో కూడా పొందుపరిచారు. ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేస్తూ 5వ నెంబర్ రేడియల్ రోడ్డు వేయాలని కూడా నిర్ణయించారు. అదేంటో కానీ, ఇప్పటివరకూ ఈ ఫోర్ లేన్ రహదారి పనులు ఆరంభమే కాలేదు. ఆరు కిలోమీటర్ల ఈ రహదారి నార్సింగి జంక్షన్ కు అనుసంధానం చేస్తే పాత ముంబై హైవే మీద కొంతమేరకు ఒత్తిడి తగ్గుతుంది. జూబ్లీహిల్స్ నుంచి గచ్చిబౌలి వెళ్లేవారు నానక్‌రాంగూడ రోడ్డు నుంచి కాకుండా ఈ రహదారి మీద పయనించేందుకు ఆస్కారం ఉంటుంది. స్థానికులు అటు శంషాబాద్ వెళ్లాలన్నా.. జూబ్లీహిల్స్ వెళ్లాలన్నా.. సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు.
ఈ రహదారిలో కొంత దూరం దాకా.. నిజాం నవాబు కట్టించిన మంచినీటి వాటర్ ఫీడర్ ఛానెల్ ఉంది. ప్రస్తుతం దీని ద్వారా మంచినీరు సరఫరా కావట్లేదు. ఒకవేళ వాడేందుకు ప్రయత్నించినా ఫలితం ఉండదు. కారణం.. ఈ పైపులైనులోకి ఇప్పటికే మురుగునీరు వచ్చి చేరింది. పైగా, హెరిటేజ్ స్ట్రక్చర్ అంటూ పాడైన ఈ ఫీడర్ ఛానెల్ కోసం అధిక స్థాయిలో సొమ్ము ఖర్చు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికైనా ప్రణాళికా అధికారులు, వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకుని.. పనికిరాని ఈ ఫీడర్ ఛానెల్ తొలగించి.. మాస్టర్ ప్లాన్ లో పేర్కొన్నట్లుగా 120 అడుగుల రహదారిగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇందుకు సంబంధించి ఏదో ఒక నిర్ణయం త్వరితగతిన తీసుకోవాలని అభ్యర్థిస్తున్నారు. లేకపోతే తమ కష్టాలు ఇలాగే కొనసాగుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో స్లిప్ రోడ్లను అభివృద్ధి చేసినట్లుగానే ఈ రహదారిని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
This website uses cookies.